December 20, 2024

మైసూరులో టిప్పు జయంతి రాజ్యోత్సవ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన  టిప్పు జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్సీ ఎ.హెచ్.విశ్వనాథ్ పాల్గొని 18వ శతాబ్దపు మైసూరు పాలకుడిపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఖండించారు.  విశ్వనాథ్ తన సొంత పార్టీ సభ్యుల వైఖరినే ఈ సందర్భంగా తప్పుపట్టారు.   రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్‌పై వాస్తవాలను వక్రీకరించే ఏ ప్రయత్నమైనా వివాదాలను మాత్రమే సృష్టిస్తుందని, చరిత్రను మార్చలేమని అన్నారు.

టిప్పు సుల్తాన్‌ను ఈ ప్రాంత “ఆత్మగౌరవానికి చిహ్నం”గా విశ్వనాథ్ అభివర్ణించారు. “ఆయన ఇతర పాలకుల లాగా బ్రిటిష్ వారి ముందు తలవంచలేదు. వారిపై ధైర్యంగా పోరాడాడు’’ అన్నారు. మైసూరు చుట్టుపక్కల సెరికల్చర్‌ను ప్రవేశపెట్టడానికి టిప్పు సుల్తాన్ చేసిన కృషిని,  కావేరి నదికి అడ్డంగా KRS ఆనకట్ట నిర్మాణం కోసం టిప్పు సుల్తాన్ చూపిన దార్శనికతను ఆయన గుర్తు చేశారు.

టిప్పు సుల్తాన్ 70,000 మందిని చంపి 40,000 మందిని మతమార్పిడి చేశారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనాటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇవి కట్టుకథలుగా కనబడుతున్నాయని అన్నారు.

విశ్వనాథ్ విలేకరులతో మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ ఎప్పుడూ హిందూ మతాన్ని వ్యతిరేకించలేదన్నారు. పైగా శృంగేరి మఠంపై దాడి జరిగినప్పుడు రక్షించేందుకు తన సైన్యాన్ని పంపాడని చెప్పారు.

(ఆధారం: హిందూ దినపత్రిక)