December 19, 2024

‘ది కేరళ స్టోరీ’ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిలో బురఖా ధరించిన మహిళ షాలిని ఉన్నికృష్ణన్ అనే హిందువుగా, తాను నర్సు కావాలనుకునే తన గతాన్ని వివరించింది. తాను ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జైలులో ISIS తీవ్రవాదిగా మగ్గుతున్నానని చెబుతుంది. తన పేరు ఫాతిమా బా గా మార్చారని తెలియజేసింది. తనలాగే ఇస్లాం మతంలోకి మార్చబడి సిరియా, యెమెన్‌లకు పంపబడిన అమ్మాయిలు 32,000 మంది ఉన్నారని చెబుతోంది. “కేరళలో సాధారణ అమ్మాయిలను ప్రమాదకరమైన టెర్రరిస్టులుగా మార్చే ఒక ప్రమాదకరమైన గేమ్ నడుస్తోంది, అది కూడా అందరి కళ్ల ముందు” అని చెబుతుంది.

చాలా మంది యూజర్లు షేర్ చేస్తూ కేరళకు చెందిన ఒక మహిళ వాస్తవ కథ అన్నారు, కొందరు #TrueStory అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించి, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ’ కేరళ రాష్ట్రంలో తప్పిపోయిన 32,000 మంది మహిళల కథగా చెప్పుకున్నారు.

మార్చి 2022లో ThePrintలో సేన్ ఇంటర్వ్యు వచ్చింది. ANIతో సంభాషణలో సేన్ ఇలా చెప్పాడు: “ఇటీవలి పరిశోధన ప్రకారం, 2009 నుండి – హిందూ క్రైస్తవ వర్గాలకు చెందిన మహిళలు  కేరళ నుండి దాదాపు 32,000 మంది ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు. వారిలో చాలా మంది ఐసిస్ బలంగా ఉన్న సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు తరలించబడ్డారు. ISIS చేస్తున్న ఈ భారీ అంతర్జాతీయ కుట్రలకు వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆలోచించడం లేదు.‘‘ అన్నాడు.

టీజర్‌లో కనిపించే ఫాతిమా పాత్రను నటి అదా శర్మ పోషించారు. ఆమె వైరల్ క్లిప్‌ను #ట్రూస్టోరీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసింది.

శర్మ ట్వీట్‌కు ముందే, #ISIS, ‘ది కేరళ స్టోరీ’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. OpIndia, Zee News, Film Companion, The Statesman, Outlook, Times of India ఇలా పలు మీడియా సంస్థలు దీని గురించి రాశాయి. “ఇటీవలి పరిశోధన ప్రకారం, 2009 నుండి, కేరళ, మంగళూరులోని హిందూ, క్రైస్తవ వర్గాలకు చెందిన దాదాపు 32,000 మంది బాలికలు ఇస్లాంలోకి మారారు; వారిలో ఎక్కువ మంది సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇతర ప్రాంతాలలో ISIS, హక్కానీ ప్రభావం ఉన్న ప్రాంతాలకు తరలించబడ్డారని రాశాయి.

జర్నలిస్ట్ అభిజిత్ మజుందార్ టీజర్ విడుదలకు సంబంధించిన వన్ఇండియా నివేదికను ట్వీట్ చేస్తూ, “32,000 మంది బాలికలు ఇస్లాం మతంలోకి మారి ISIS బానిసలుగా విక్రయించబడ్డారు: ఇది ‘ది కేరళ స్టోరీ’” అని రాశారు.

బీబీసీ పంపిన మెసేజ్‌లకు ఈ సినిమా ప్రొడ్యూసర్ విపుల్ షా సమాధానం ఇవ్వలేదు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరినట్లు జర్నలిస్టు అరవిందకృష్ణన్ బీబీసీతో చెప్పారు.

టీజర్‌లో చేస్తున్న ఆరోపణలపై సినిమా నిర్మాతలు ఆధారాలు చూపించాలని ఆయన కోరుతున్నారు. ‘‘ఏవో కొన్ని కేసుల్లో ఇలా జరిగి ఉండొచ్చు. కానీ, మరీ 32 వేలా? అసలు ఆ సంఖ్య నమ్మేలా ఉందా?’’అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 2021లో కుట్టీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అసెంబ్లీలో చెప్పిన వివరాల ఆధారంగా ఆ సంఖ్య విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు చెప్పారు.

2006 నుంచి మొత్తంగా 2667 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మతం మారినట్లు 2012లో చాందీ చెప్పారని, అవి వార్షిక గణాంకాలు కావని ఆల్ట్‌న్యూస్ చెబుతోంది. కేరళకు చెందిన 21 మంది 2016లో దేశాన్ని విడిచిపెట్టి మిలిటెంట్ సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు వెళ్లారు. 2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళకు చెందిన నలుగురు మహిళలు ప్రస్తుతం అక్కడి జైళ్లలో గడుపుతున్నట్లు భారత అధికారులు గుర్తించారు. ‘‘ఈ విషయంలో మనం రికార్డులను పరిశీలించాలి. కానీ, అంచనాల ప్రకారం చూస్తే.. 2016 నుంచి కేరళకు చెందిన 10 నుంచి 15 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మారి ఐఎస్‌లో చేరివుంటారు’’అని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టేట్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌లకు కూడా లేఖలు రాసినట్లు అరవిందకృష్ణన్ చెప్పారు. ‘‘దేశ సమైక్యత, సార్వభౌమత్వాలకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉంది. భారత నిఘా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దీనిలో ఆరోపణలు చేశారు’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఈ సినిమా టీజర్ కేరళలో రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒది ఒక ‘‘మిస్‌ఇన్ఫర్మేషన్’’ క్యాంపెయిన్‌లో భాగమని కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘కేరళ ప్రతిష్ఠను మసకబార్చేందుకు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దీన్ని తీశారు’’అని ఆయన అన్నారు. కేరళలోని సీపీఎంకు చెందిన చట్టసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాతలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు చెప్పారు.

వివాదాల మీద సినిమాలు తీస్తే లాభపడతామనో లేక మనోభావాలతో ముడిపడిన అంశాలను తీసుకుంటే త్వరగా ఆడియన్స్ ని ఆకర్షిస్తామనే లెక్కనో ఏమో కానీ ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇలాంటివి మరిన్ని రావడానికి స్ఫూర్తినిస్తోంది. కాశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు డాక్యుమెంటరీ తరహాలో ఉన్నా సరే ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయి ఏకంగా మూడవ వందల కోట్ల వసూళ్లు గుప్పించింది. అందులో చాలా అవాస్తవాలు చూపించారనే కామెంట్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వ అండదండలతో నిర్విరామంగా కొనసాగింది.

ఇప్పుడీ వరసలో మరో మూవీ రానుంది. అదే ది కేరళ స్టోరీ. వారం క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. ముందుగా దీని గురించి ఎవరికీ తెలియదు, పట్టించుకోలేదు. కానీ చాలా సున్నితమైన అంశాలను ఆ చిత్రంలో సృశించారనే టాక్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది కాంట్రావర్సీకి బిందువుగా మారుతోంది. దర్శకులు శ్రీ సుదీప్తో సేన్ ఆ వీడియో ద్వారా కేరళ రాష్ట్రంలో 32 వేల మహిళలు మతం మార్చబడి ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠా చేరేలా ప్రేరేపింపబడ్డారని చూపించారు. సిరియా యెమెన్ ఎడారుల్లో వీళ్లందరినీ సజీవంగా దహనం చేశారని కూడా ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు.

నిజానికి టీజర్ లో బుర్ఖా వేసుకున్న ఒక అమ్మాయి మాట్లాడ్డం తప్ప ఏమి లేదు. కాకపోతే కేరళలో పరిస్థితి చాలా దారుణంగా ఉందనేలా చెప్పించిన తీరు ఇప్పుడీ రచ్చకు కారణమవుతోంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు దీన్ని నిషేదించాలని బిజెపికి లేఖలు రాస్తున్నారు. గాడ్స్ ఓన్ ల్యాండ్ గా పేరున్న కేరళ పేరుని చెడగొట్టేందుకే పూనుకున్నారని ప్రజా మద్దతు కూడగడుతున్నారు. విపుల్ అమృత్ లాల్ షా లాంటి సీనియర్ నిర్మాత కం డైరెక్టర్ ఈ ప్రాజెక్టు వెనుక ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.