December 20, 2024

భారత ఉపఖండంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవుల్లో ప్రముఖంగా వినిపించే పేరు అహ్మద్ ఫరాజ్. ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ద్వారా భారతసాహిత్యాన్ని అభ్యుదయపథంపై నడిపించిన కవుల్లో అగ్రగణ్యుడు. మరో ముఖ్యమైన విషయమేమంటే, ఇక్బాల్, ఫైజ్ ఉర్దూ కవిత్వంలో చాలా పెద్ద పేర్లు. కాని, అహ్మద్ ఫరాజ్ కవితలు ప్రజలు పాడుకున్నంతగా మరొకరి కవితలు పాడుకోలేదేమో. దక్షిణాసియా భాషల్లో ఏ కవికి లభించని విధంగా అహ్మద్ ఫరాజ్ కవితలు ప్రజల నోళ్ళలో నాట్యం చేశాయి.

ఉర్దూ కవిత్వాన్ని ఉర్దూ భాష తెలియకుండా అర్ధం చేసుకోవడం, ఆస్వాదించడం కాస్త కష్టమే. ఉర్దూ కవిత్వ ప్రపంచంలో గజల్ ఎప్పుడైనా సరే మధ్యాహ్న సూర్యబింబం వంటిదే. గజల్ కేవలం సాహిత్యమే కాదు, అది సంగీతం కూడా. సంగీతసాహిత్యాల మేలు కలయికగా గజల్ ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. భారత పాకిస్తాన్ దేశాల్లో కేవలం గజల్ మాత్రమే పాడే గాయకులు అనేకమంది ఉన్నారు. గజల్ మాస్ట్రోలుగా పేరెన్నికగన్నారు. ఈ గాయకులు సుదీర్ఘపరిశ్రమ, అభ్యాసాలతో గజల్ సంగీతానికి ఒక ప్రత్యేక సొగసునిచ్చారు. ఈ గాయకుల్లో చాలా మంది సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ గజల్ సంగీతానికి మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చారు. సినిమాల్లో పాటల కన్నా గజల్ పాడడమే ముఖ్యంగా భావించారు. సంగీత ప్రపంచంలో మనకు శుద్ధ శాస్త్రీయ సంగీతంలో పండితులు కనిపిస్తారు. అద్భుతమైన సంగీతజలధిలో ఓలలాడిస్తారు. అదేవిధంగా గజల్ సంగీతకారులు కూడా గజల్ సంగీతానికి ఒక శాస్త్రీయహోదా లభించలేలా చేశారు. గాలిబ్ లేదా మీర్ వంటి కవుల గజల్ పాడడమంటే ఒక గొప్ప విజయం సాధించినట్లు భావిస్తారు. గాలిబ్ గజలును ఎవరు ఎలా పాడారన్నది కూడా గమనిస్తుంటారు.

గజల్ గాయకుల వల్ల కవుల కవితలు ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగాయి. ఒక గొప్ప గజలును అనేకమంది గజలు గాయకులు పాడడం, ఒకే గాయకుడు కూడా అనేకసార్లు పాడడం జరుగుతుంది. ప్రతి సారీ ఒక కొత్తదనం పలికించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చూస్తే, అహ్మద్ ఫరాజ్ గజల్లను గాయకులు ఎక్కువగా పాడారు. దక్షిణాసియాలోనే ప్రముఖ గాయకురాలుగా ప్రసిద్ధి పొందిన లతా మంగేష్కర్ ఒకసారి మెహదీ హసన్ గానాన్ని మెచ్చుకుంటూ, శ్రీరామచంద్రుడి రథం ఆయన గొంతులో ప్రయాణించిందేమో అన్నారు. అహ్మద్ ఫరాజ్ రాసిన గజల్ ’’రంజిష్ హీ సహీ దిల్ హి దుఖానేకె లియే ఆ‘‘ (కోపంగా ఉన్నా సరే, హృదయాన్ని బాధపెట్టడానికైనా సరే రా…) అన్న గజల్ మెహదీ హసన్ పాడగా విన్నప్పుడే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పాకిస్తాన్ దేశాల్లో చాలా ప్రసిద్ధి పొందిన గజల్లలో ఈ గజలు కూడా ఒకటి.

మెహదీ హసన్ ఆ గజలు పాడకముందు, చాలా సంవత్సరాలు ముందే పాకిస్తాన్ లో వచ్చిన సినిమా మొహబ్బత్ లో ఈ గజలును వాడుకున్నారు. అందులోను మెహదీ హసనే పాడారు. అప్పుడు ఈ గజల్ భారతదేశంలోను ప్రజాదరణ పొందింది. పాకిస్తాన్ లో సినిమా హీరో ముహమ్మద్ అలీ కోసం మెహదీ హసన్ పాడేవారు. ఒకప్పుడు భారతదేశంలోని హిందీ సినిమాల్లోను, పాకిస్తాన్ ఉర్దూ సినిమాల్లోను ప్రఖ్యాత కవులు రాసిన గజల్లను వాడుకోవడం జరిగేది. ఈ కవులు ప్రత్యేకంగా సినిమా కోసం రాసేవారు కాదు. సినిమా నిర్మాతలే గజలును తమ సినిమాలో వాడుకుంటామని ముందుకు వచ్చి, గజలుకు అనుగుణమైన బాణీ సంగీత దర్శకులు కట్టేవారు.

అహ్మద్ ఫరాజ్ ముఖ్యంగా గజల్ కవి. ఆయన రాసిన ఇతర కవితలు చాలా ఉన్నప్పటికీ, ఆయన రాసిన నజ్మ్ కవితలు కూడా ప్రజాదరణ పొందినప్పటికీ గజలు కవిగానే ఆయన ప్రసిద్ధుడు. హిందీ, ఉర్దూ సాహిత్య ప్రేమికులు అహ్మద్ ఫరాజ్ పేరు వినకపోవడం జరగదు. సంగీత దర్శకులు ఆయన గజల్లను తీసుకుని బాణీలు కట్టి సినిమాల్లో వాడుకునేవారు. పాకిస్తాన్ టెలివిజన్లో అహ్మద్ ఫరాజ్ గజల్లపై అనేక కార్యక్రమాలు జరిగేవి. సినిమాల్లో పాడిన గజల్లు, అవే గజల్లకు కొత్త బాణీలతో పాడడడం జరిగేది. అహ్మద్ ఫరాజ్ రాసిన మరో ప్రముఖ గజల్ ’’యే ఆలమ్ షౌక్ కా దేఖా న జాయే‘‘ (ఈ ప్రేమోత్సాహం చూడనలవి కాదుగా…) అలాంటి గజల్లలోనే ఒకటి. దీన్ని సినిమా కోసం నాహిద్ అక్తర్ పాడారు. ఆ తర్వాత గజల్ మాస్ట్రో గులామ్ అలీ పాడారు. తాహిరా సయ్యద్ పాడారు.

అహ్మద్ ఫరాజ్ కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాడ్రనిజం, పోస్టు మాడ్రనిజం, ఉర్దూ సాహిత్యంపై దాని ప్రభావాల గురించి కూడా మాట్లాడుకోవాలి. సాహిత్యప్రపంచంలో ఈ పరిణామాలు ఉర్దూ గజలుపై కూడా ప్రభావం వేశాయి. ఉర్దూ గజలు కేవలం ప్రేమ కవిత మాత్రమే అన్న విమర్శలు కూడా బలంగా వినిపించాయి. గజల్ సామాజిక ప్రయోజనంపై ప్రశ్నలు వచ్చాయి. గజలు రాసే కవులు, గజలు గాయకులు హేతుబద్దమైన, శాస్త్రీయమైన ఆలోచనలు లేనివారిగా కూడా అభివర్ణించబడ్డారు. భారత సాహిత్యాన్ని విమర్శిస్తూ మెకాలే చేసిన వ్యాఖ్యలు కూడా గజల్ పై విమర్శలకు కారణమయ్యాయి. కాని ఎవరెన్ని విమర్శలు చేసినా గజలు చెక్కుచెదరలేదు. ప్రజాదరణ తగ్గలేదు. సామాజిక ప్రయోజనాలను కూడా గజల్ తనదైన శైలిలో ప్రతిఫలిస్తుందని ఫైజ్, ఫరాజ్, మక్దూం వంటి కవులు చాటి చెప్పారు.

ఫరాజ్ తన మొదటి కవిత్వ సంపుటి ప్రచురించినప్పుడే సంచలనమయ్యాడు. ప్రతి కొత్త సంపుటి తర్వాత కవిగా మరిన్ని ఎత్తులు అధిరోహించాడు. చాలా మంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆయన రాసిన కవిత్వంలో ప్రారంభకాలంలో రాసింది ఎక్కువగా ప్రేమకవిత్వమే. అందులోను ఆయన సామాజికాంశాలను సూచనాప్రాయంగా ప్రస్తావించడం మానలేదు. ప్రేమ మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రేమకవిత్వము, భావకవిత్వము ప్రతి మనిషి హృదయతంత్రులను మీటుతుంది. అహ్మద్ ఫరాజ్ ఇందులో ఆరితేరిన కవి. చాలా మంది ప్రముఖ ఉర్దూ కవులు గజలులో సామాజిక చైతన్యం, సామాజిక ప్రయోజనాల వైపుకు మరల్చారు. ఆధునిక కాలంలోని నిరంకుశ రాజకీయ భావాలపై గజలును కూడా సంధించారు. కాని అహ్మద్ ఫరాజ్ గజల్ ప్రత్యేకత, గజలులోని సారం ప్రేమైక తాదాత్మ్యతను వదల్లేదు. ప్రేమ, ఎడబాటు, విరహం వంటి భావాలే సరికొత్తగా అద్భుతమైన మార్ధవంతో ప్రకటించాడు.

ఫరాజ్ సమకాలీనుల్లో నాసిర్ కాజ్మీ, మునీర్ నియాజీ వంటి కవులు దేశవిభజన కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించారు. అహ్మద్ ఫరాజ్ ప్రత్యక్షంగా దేశవిభజన కష్టాలు అనుభవించలేదు. అందువల్లనే కాబోలు ప్రారంభంలో ఆయన రాసిన కవిత్వంలో ఈ విషయాలేవీ కనిపించవు. ఈ కాలంలోనే తీవ్రమైన స్త్రీవాద భావాలు ప్రకటించిన కిశ్వర్ నాహిద్ వంటి కవయిత్రులు కూడా రాసేవారు. అయినప్పటికీ అహ్మద్ ఫరాజ్ కవితలు తాజా గాలిలా పాఠకుల మనస్సులను ఆహ్లాదపరిచేవి.

కాని అరవైలలో అహ్మద్ ఫరాజ్ కవిత్వం కొత్త మలుపు తిరిగింది. అప్పట్లో ఆయన పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచంలో పరిస్థితులు కొత్త మలుపు తిరుగుతున్న కాలం అది. విద్యార్థి ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఏర్పాటు, అమెరికా వత్తాసుతో పాకిస్తాన్ ను పాలిస్తున్న సైన్యం పట్ల నిరసన ఇవన్నీ ఆయనపై ప్రభావం వేశాయి. ఈ ప్రభావాలున్నప్పటికీ ఆయన భావకవిగా, ప్రేమకవిగానే నిలబడ్డాడు. హిక్మత్, ఫైజ్, నెరుడాల మాదిరిగా అహ్మద్ ఫరాజ్ రాజకీయ కవి కాదు. టాగూర్, ఇక్బాల్ ల మాదిరిగా ఆయన తత్వవేత్త అయిన కవి కూడా కాదు. ఆయన ముఖ్యంగా హృదయ కవి. అయితే దుర్మార్గపు, దౌర్జన్యాల పరిస్థితులను ఆయన ఎదుర్కోవడంలో చూపించిన మనోనిబ్బరం ఆయన్ను ప్రత్యేకమైన కవిగా, రాజకీయ కవిగా పరిచయం చేస్తుంది. ఆయనకు ఏదైనా నచ్చకపోతే ఎలాంటి శషభిషలు లేకుండా తీవ్రంగా ఖండిస్తూ రాశాడు. అది ప్రభుత్వానికి, నిరంకుశ నియంతలకు వ్యతిరేకమైనా సరే లక్ష్యపెట్టలేదు.

ఇలా ఆయన మొదట తలపడింది పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన బుట్టోతో. తూర్పు పాకిస్తాన్ లో అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన సైనికదాడులను తీవ్రంగా విమర్శిస్తూ, స్వంత ప్రజలనే చంపుకున్న సైన్యంగా ఘాటుగా పాకిస్తాన్ సైన్యాన్ని విమర్శించాడు. అది నజ్మ్. గజలు కాదు. పాకిస్తాన్ సైనికులను ప్రొఫెషనల్ కిల్లర్స్ అని పిలిచాడు. వారంటు కూడా లేకుండా ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పడేశారు. విచారణ లేదు, జైలే. ప్రముఖ కవయిత్రి కిశ్వర్ నాహిద్, ప్రముఖ గాయని నూర్జహాన్ తదితరులు చాలా కష్టపడి ఆయన్ను జైల్లోంచి విడుదల చేయించారు. ఈ అనుభవం తర్వాత మరొకరైతే భయపడి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుని ఉండేవారు. కాని ఫరాజ్ అలా బెంబేలు పడే మనిషి కాదు. పంజాబ్ సూఫీ కవుల పంథాపై నడిచే మనిషి. ఫైజ్, జాలిబ్ వంటి ఆధునిక తిరుగుబాటు కవులను అనుసరించే వ్యక్తి. ఆయన్ను జైల్లో పెట్టవచ్చు, దేశభహిష్కరణ విధించవచ్చు, ఉద్యోగం ఊడపీకించవచ్చు కాని ఆయన గొంతును మూయించలేరు. ఆయన రాతలను ఆపలేరు. ఏదైనా చెప్పేదయితే ముక్కుసూటిగా చెప్పేవాడు. ప్రతీకాత్మకంగా నర్మగర్భంగా చెప్పడం కూడా ఉండేది కాదు. భుట్టోతో తలపడిన తర్వాత నియంతగా పేరుమోసిన జియావుల్ హక్ తోను అలాంటి అనుభవమే ఎదురైంది. ఫరాజ్ తలవంచంలేదు. జియావుల్ హక్ ను విమర్శించి తుదకు దేశం వదిలి పోవలసి వచ్చింది. ఫరాజ్ పలస్తీనా వెళ్ళిపోయాడు. ఫైజ్ కూడా పాకిస్తాన్ వదిలి బీరుట్ వెళ్ళాడన్నది గమనించాలి. పాకిస్తాన్ కు చెందిన మరో స్త్రీవాద కవయిత్రి ఫహ్మీదా రియాజ్ పాకిస్తాన్ వదిలి భారతదేశానికి వచ్చింది.

గమనించవలసిన విషయమేమంటే, ఆయన కవిత్వంలో సామాజికాంశాలు సామాజిక పరిస్థితులపై విమర్శలు ఎక్కువైన కాలంలోనే ఆయన వ్యక్తిగతంగా కూడా రాజ్యాన్ని ఎదిరించాడు. ప్రాణానికి కూడా తెగించాడు. ముషర్రఫ్ కాలంలోను ఆయన ముషర్రఫ్ ను విమర్శించి, సైనిక నియంతృత్వాన్ని విమర్శించి కష్టాలపాలయ్యాడు.

ఉర్దూలో ఫైజ్, ఫిరాక్, సాహిర్ వంటి కవులు ముఖ్యంగా దేశస్వాతంత్ర్యానికి ముందు కాలం నాటి కావులు. దేశవిభజనకు ముందు కాలం నాటి కవులుగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. దేశవిభజన తర్వాత కూడా గొప్ప కవితలు వారు రాసినప్పటికీ వారి గుర్తింపు ముఖ్యంగా దేశవిభజనకు ముందునుంచే ఉంది. ఫరాజ్ అలా కాదు. ఫరాజ్ సామాజికాంశాలతో రాసింది దేశవిభజన తర్వాతనే. అప్పటికి భారతదేశంలో ఉర్దూ తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాలం. అయినా ఫరాజ్ కవిత్వం భారతదేశంలోను గొప్పగా ప్రజాదరణ పొందిందంటే ఆయన గొప్పదనాన్ని అర్ధం చేసుకోవచ్చు. గాయకులు ఆయన గజల్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.

ఎల్లలెరుగని కవిగా అహ్మద్ ఫరాజ్ భారత ఉపఖండంలో హిందీ ఉర్దూ కవిత్వ అభిమానుల ఆదరణ పొందారు.