December 19, 2024

(జమాఅతె ఇస్లామీ హింద్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జమాఅత్ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ చేసిన ప్రసంగ పాఠాన్ని పాఠకులకు అందిస్తున్నాము)

ఆయన నూహ్ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే (ముహమ్మద్‌ (సఅసమ్‌) ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము  దానినే మేము ఇబ్రాహీమ్‌కు, మూసాకు, ఈసాకు బోధించాము  ఈ ధర్మాన్ని స్థాపించండి అనీ, దానిని గురించి విభేదాలకు లోను కాకండి అనీ తాకీదు చేస్తూ. ఈ విషయం ఈ బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది  దాని వైపునకే (ముహమ్మద్‌ (సఅసమ్‌) నీవు వారిని ఆహ్వాని స్తున్నావు. అల్లాహ్ తాను కోరిన వారిని తనవారుగా చేసుకుంటాడు. ఆయన తన వైపునకు మరలేవారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. (షూరా: 13)

అస్సలాము అలైకుమ్. (మీ అందరికీ శాంతి కలుగుగాక)

ఏప్రిల్ 16, 2022 నాటికి జమాఅతె ఇస్లామీ హింద్ 75 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకోవలసిన సందర్భం ఇది. ఎలాగైతే ప్రయాణంలో మైలురాళ్ళ ద్వారా మన ప్రయాణం ఏ గమ్యం వైపు ఎలా కొనసాగుతుందో అంచనా వేస్తామో అదేవిధంగా చరిత్రలోని వివిధ మైలురాళ్ళు, మలుపులను పరిశీలించడం ద్వారా మనం ఎక్కడున్నామో తెలుసుకోగలం. జమాఅతె ఇస్లామీ హింద్ 75 సంవత్సరాలు పూర్తవ్వడమే కాదు, ప్రస్తుత చతుర్వర్ష ప్రణాళి కూడా పూర్తికానుంది. అందువల్ల 75వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా రెండుపనులు చేపట్టాలని నిర్ణయించాము. అందులో మొదటిది అంతర్గతమైనది. అంటే జమాఅత్ తో సంబంధమున్న ప్రతి వ్యక్తి కేంద్రస్థాయి నుంచి ప్రాంత స్థాయి వరకు ప్రతి ఒక్కరు తాను ఏం చేస్తున్నాడో సమీక్షించుకోవడం. ఈ సమీక్ష ఆధారంగా మరింత మెరుగ్గా పనిచేయాలని సంకల్పించడం. ఇది మొదటి పని. ఇక రెండవ పని బాహ్యమైనది. అంటే ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, ముస్లిమేతర సోదరులకు అందరికీ జమాఅతె ఇస్లామీ హింద్ ఏమిటనేది పరిచయం చేయడం.

ముందుగా నేను 75 సంవత్సరాల జమాఅత్ చరిత్రను క్లుప్తంగా ప్రస్తావించాలనుకుంటున్నాను.

అసలు జమాఅతె ఇస్లామీ హింద్ అంటే ఏమిటి?

జమాఅతె ఇస్లామీ హింద్ అసలు గుర్తింపు, అసలు ప్రత్యేకత ఈ సంస్థ ఉద్దేశ్య లక్ష్యాలు. జమాఅత్ ఒక ఇస్లామీ ఉద్యమం. ధర్మసంస్థాపనం దీని లక్ష్యం. జమాఅత్ ఏదో ఒక ప్రత్యేక జాతి, ప్రత్యేక సముదాయం, ప్రత్యేక కమ్యునిటి ప్రయోజనాల కోసం లేదా వారి ప్రాపంచిక వ్యవహారాల కోసం పనిచేసే సంస్థ కాదు. అలాగే జమాఅత్ ఏదో రాజకీయ ప్రతిపక్షం కాదు, తాత్కాలికంగా తలెత్తిన ప్రతిఘటనోద్యమమూ కాదు. ఒక ప్రత్యేక ముస్లిం పంథా వైపునకు పిలిచే సంస్థ కూడా కాదు. ఎవరో ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి ఆలోచనలు సిద్ధాంతాల వైపునకు పిలిచే సంస్థ కూడా కాదు. ఇది ఇస్లామీ ఉద్యమం. సంపూర్ణ ఇస్లామీయ బోధనలు, మౌలిక విలువలు, ఇస్లాం ప్రసాదించిన జీవనవ్యవస్థ ఇదే మా ఐడియాలజీ. దీనిని స్థాపించడమే మా లక్ష్యం. ఈ వైపునకు పిలవడమే సంస్థ చేసే అసలు పని.

ఈ ఆలోచన, ఈ సంకల్పమే సంస్థకు ప్రాణం. ఇదే సంస్థ గుర్తింపు కూడాను. ఈ ఉద్దేశ్యలక్ష్యాలతోనే నేటికి 75 సంవత్సరాలు పూర్వం, అంటే దేశస్వాతంత్ర్యం తర్వాత వెనువెంటనే అప్పటి మన పెద్దలు జమాఅతె ఇస్లామీ హింద్ పేరుతో 1948 ఏప్రిల్ 16వ తేదీన పునర్వ్యవస్థీకృతమై పనిచేయడం ప్రారంభించారు. అప్పటి పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైనవి. దేశవిభజన గాయాలు పచ్చిగా ఉన్నాయి. ఈ దేశంలో ముస్లిముల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులవి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధర్మసంస్థాపనం కోసం ఏకమై పని చేయాలని సంకల్పించడం మామూలు విషయం కాదు. అలహాబాద్ ఇజ్తిమాలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అప్పటి పరిస్థితుల్లో చాలా సాహసోపేతమైనది. అప్పటి మన పెద్దలు పరిస్థితులకు భయపడి కూర్చోవాలని అనుకోలేదు. నిరాశా నిస్పృహలకు గురై, దేశం వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా వారిలో రాలేదు. అలాగే దేశంలో నిస్పహాయ బాధిత వర్గంగా కూలబడాలని కూడా భావించలేదు. వారు ఔన్నత్యం, ఆత్మగౌరవాల మార్గం ఎంచుకున్నారు. ముస్లిం సముదాయానికి, ముస్లిముల ధార్మిక గుర్తింపునకు శోభించే మార్గం అది. ఈ రాత్రి తన చీకటి పంజాలు ఎంత విసిరినా, నల్లధూళిలా బతకడం నాకిష్టం లేదని కవి చెప్పినట్లు మన పెద్దలు ఆత్మగౌరవంతో కూడుకున్న సముచిత నిర్ణయం తీసుకున్నారు. ధర్మసంస్థాపనం కోసం వాళ్ళు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం స్వతంత్ర భారతదేశంలో ఇస్లామీయ ఉద్యమ పునరుజ్జీవనంపై అసాధారణ ప్రభావం వేసింది. నిరాశనిస్పృహలకు, భయాందోళనలకు గురైన ముస్లిం సముదాయంలో ఆత్మవిశ్వాసం సృష్టించింది. తమ ధర్మాన్ని పాటిస్తూ ఈ దేశంలో జీవించగలమనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ముస్లిములకు ఇచ్చింది.

నేడు 75 సంవత్సరాల తర్వాత జమాఅతె ఇస్లామీ హింద్ చరిత్రను పరిశీలిస్తే స్వతంత్ర భారతదేశంలో ముస్లిముల చరిత్ర ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాల చరిత్రగా మన ముందుకు వస్తుంది. దేశవిభజన తర్వాత ఇక్కడ ముస్లిములకు చోటు లేదనే వాతావరణం ఏర్పడింది.  ఇక్కడ ముస్లిములు తమ ధర్మాన్ని పాటిస్తూ, తమ ధార్మిక గుర్తింపును కాపాడుకుంటూ జీవించడం సాధ్యం కాదనే పరిస్థితులు తలెత్తాయి. దేశవిభజనకు కారణమైన శక్తులు ఈ అభిప్రాయాలు బలపడేలా శాయశక్తులా ప్రయత్నించాయి. దేశవిభజన తర్వాత మతహింస, మారణకాండల భయంకర సంఘటనల వల్ల కూడా భయాందోళనలు అలుముకున్నాయి. కాని ముస్లిములు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మాతృదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ ధర్మం, తమ సంస్కృతి, తమ గుర్తింపులను కాపాడుకుంటు, దేశానికి, సమాజానికి విలువైన సేవలందిస్తూ దేశంలోనే స్థిరపడ్డారు. ఆ విధంగా భారతదేశంలో ఇక ముస్లిములకు చోటు లేదనే అభిప్రాయాలు తప్పని నిరూపించారు. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేక నిరాశాజనక పరిస్థితులు కూడా ముందుకు వచ్చాయి. నేడు విద్యా, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇంకా అనేక రంగాల్లో ముస్లిముల ప్రాతినిథ్యం చాలా తగ్గిపోయింది. వెనుకబడిన సముదాయంగా మిగిలిపోయారు. దౌర్జన్యాలు, అన్యాయాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సవాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ భారతదేశంలో ముస్లిం సముదాయం చరిత్ర అనేక విధాలుగా గొప్ప చరిత్రగా కనబడుతుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్న భారత ముస్లిములు తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. ముస్లిములకు సంబంధించిన అనేక సామాజిక, సంస్కరణాత్మక, సైద్ధాంతిక సంస్థలు, రాజకీయ, సామాజిక నేతలు ఇందులో తమదైన పాత్ర పోషించారు. భారత ముస్లిముల ఈ పూర్తి చరిత్రలో జమాఅతె ఇస్లామీ హింద్ పాత్ర కూడా మౌలికమైనది. అత్యంత కీలకమైనది.

జమాఅత్ కు మానవవనరులు చాలా తక్కువ. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇద పరిస్థితి ఉంది. కాని బలమైన సైద్ధాంతిక పునాదుల వల్ల, మీడియా ద్వారా, సాహిత్యం ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న సంస్థాగత నెట్వర్క్ ద్వారా, ప్రజాసంబంధాల ద్వారా, ముస్లిం సముదాయానికి సంబంధించిన వివిధ కార్యెక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా జమాఅతె ఇస్లామీ హింద్ భారత ముస్లిముల సామూహిక ఆలోచనా సరళిని ప్రభావితం చేసింది. వారి వైఖరులపై, వారి ఆచరణలపై ప్రభావం వేసింది.

దేశవిభజన జరిగిన వెనువెంటనే జమాఅతె ఇస్లామీ హింద్ ఆ కాలంలో ముస్లిం సముదాయానికి సంబంధించిన ఇతర ధార్మిక సంస్థలు, నేతలు, మేధావులతో కలిసి ముస్లిముల్లో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. భారతదేశంలో ఇక్కడి పౌరులుగా తమ కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వర్తించేలా ప్రోత్సహించింది. ఆ కాలం నాటి జమాఅత్ పత్రికలను చదివితే, అప్పటి జమాఅత్ నాయకుల వ్యాఖ్యలను పరిశీలిస్త జమాఅత్ ఈ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అర్థమవుతుంది. ముస్లిముల్లో తాము ఈ దేశంలో గౌరవప్రదంగా, తమ ధార్మిక గుర్తింపును నిలబెట్టుకుంటూ జీవించగలమనే నమ్మకాన్ని సృష్టించడం, మరోవైపు నష్టదాయకమైన మతతత్వ వైఖరులను నివారించడం పట్ల జమాఅత్ అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. ఉదాహరణకు జమాఅతె ఇస్లామీ హింద్ ఏర్పాటు వెనువెంటనే అప్పటి జమాఅత్ అధ్యక్షులు మౌలానా అబుల్ లైస్ ఇస్లాహీ నద్వీ చెప్పిన మాటలు జిందగీ ప్రతికలో అచ్చయ్యాయి. ఆయన స్పష్టంగా ముస్లిములను ఉద్దేశించి మాట్లాడారు. ఈ దేశంలో సమానస్థాయి పౌరులుగా నివసించాలని, అనవసరపు అనుమానాలకు దూరంగా ఉండాలని, మతతత్వ పోకడలకు దూరంగా ఉండాలని, ఇస్లామీయ విశ్వజనీన విలువలకు ప్రతీకలుగా జీవించాలని, దేశశ్రయోభిలాషులుగా గుర్తింపుపొందాలని బోధించారు. నేడు కూడా మనం ఇలాగే వ్యవహరించవలసి ఉంది. ఇవే పనులు మనం చేయవలసి ఉంది. ముస్లిముల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సృష్టించడం, ముస్లిమేతర సోదరులకు ఇస్లామ్ గురించి పరిచయం చేయడం. మతతత్వ వైఖరులను ఎదుర్కోవడం.

స్వాతంత్ర్యం తర్వాత అప్పటి పరిస్థితుల్లో జమాఅత్ ఇతర సంస్థలు, నేతలతో కలిసి ముస్లిముల ధార్మిక విద్యాశిక్షణల ద్వారా సాంస్కృతిక అతివాదాలను ఎదుర్కుంటూ, ముస్లిముల ధార్మిక గుర్తింపును కాపాడే ప్రయత్నం చేసింది. దేశంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలమనే ధైర్యాన్ని సృష్టించింది. దానికి కావలసిన దారి కూడా చూపించింది. భారత ముస్లిములకు సంబంధించి సాముదాయిక జీవితంలోని కొన్ని రంగాల్లో జమాఅతె ఇస్లామీ హింద్ సేవలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి.

కాబట్టి ఈ 75 సంవత్సరాల మైలురాయి దాటిన సందర్భంగా మనం రూపొందించుకున్న కార్యక్రమంలో ఈ విషయాలను అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది.  జమాఅతె ఇస్లామీ హింద్ మధ్యతరగతి విద్యావంతులైన ముస్లిముల్లో ధార్మిక చైతన్యాన్ని సృష్టించింది. ధర్మం కోసం , దేశం కోసం, ముస్లిం సముదాయం కోసం పనిచేసేలా వారిని ప్రోత్సహించింది. ప్రతి సమాజంలోను మధ్యతరగతి విద్యావంతులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. మధ్యతరగతి ప్రాధాన్యత కాదనలేనిది. ప్రజాస్వామిక సమాజాల్లో మధ్యతరగతి ఆ సమాజానికి గుండె వంటిదని అంటారు. సామాజిక మార్పులకు అవసరమైన వనరులన్నీ మధ్యతరగతి ప్రజల్లోనే ఉన్నాయి. చైతన్యవంతులైన మధ్యతరగతి ప్రజలుంటే సమాజం చురుగ్గా ఉంటుంది. ముస్లిముల్లోని ఈ మధ్యతరగతి విద్యావంతులైన వారిపై జమాఅత్ గొప్ప ప్రభావాన్ని వేసింది. యూనివర్శిటీల్లో, కాలేజీల్లో విద్యావంతులైన వారిలో ధార్మిక స్పృహను జమాఅత్ జాగరుకం చేసింది. జమాఅత్ సాహిత్యం పోషించిన చారిత్రాత్మక పాత్రను ముస్లిం సముదాయంలో విద్యాధికులు, మేధావులందరూ గుర్తిస్తారు.

మౌలానా అబుల్ హసన్ నద్వీ ఏం రాశారంటే, ఇరవయ్యోశతాబ్ధం ప్రారంభదశలో మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూదీ తన పత్రిక తర్జుమానుల్ ఖుర్ఆన్ లో రాసిన వ్యాసాల ద్వారా ముస్లిముల్లోని మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ వ్యాసాలు పాశ్చాత్య సైద్ధాంతిక, తాత్విక, సాంస్కతిక వైఖరులను తీవ్రంగా విమర్శించిన వ్యాసాలు. అంతేకాదు, పాశ్చాత్య ప్రభావం వల్ల తలెత్తిన ఆధునికవాదం, దానికి జవాబుగా తలెత్తిన వాదాలకు జవాబులు కూడా రాశారు.  వాటితో పాటు ఇస్లామీయ షరిఅత్, ఇస్లామీయ చట్టాలపై ఆధునికవాదుల ప్రశ్నలకు జవాబులు కూడా రాశారు. ఉదాహరణకు సూద్ (వడ్డీ), పరదా, జిహాద్, ఖుర్బానీ, బానిసత్వం, హదీస్ వ సున్నత్, కుటుంబచట్టాలు వగైరా గురించి రాశారు. ఈ వ్యాసాలు తర్వాత పుస్తకరూపంలో అచ్చయ్యాయి. ఈ వ్యాసాల ద్వారా, రచనల ద్వారా, పత్రికల ద్వారా ఆధునిక విద్యావంతుల్లో ఇస్లాం గురించి, ఇస్లామీయ ఆలోచనల గురించి, ఇస్లామీయ విలువల గురించి విశ్వాసం బలపడేలా చేశారు. వారిలో ఇస్లాం గురించి ఇస్లామీయ బోధనల గురించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని సృష్టించారు. అప్పటి వరకు ఉన్న న్యూనతా భావం నుంచి బయటపడేలా చేశారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఉండడం సాధ్యం కాదు. అందువల్లనే అప్పట్లో చాలా మంది మేధావులు ఆయన్ను ఇస్లామీయ తత్వవేత్తగా (ముతకల్లిమె ఇస్లాం)గా పిలిచేవారు.

మధ్యతరగతి విద్యావంతుల్లో ధర్మం పట్ల విశ్వాసాన్ని సృష్టించడంతో పాటు దేశం పట్ల, సముదాయం పట్ల తమ బాధ్యతను గుర్తించేలా చేసింది. దశాభివృద్ధికి, ముస్లింసముదాయం అభివృద్ధికి అవసరమైన నిర్దిష్టమైన ఆచరణాత్మక కార్యక్రమాలను రూపొందించింది. ప్రతి ముస్లిము ధర్మసందేశ ప్రచారం చేయవలసిన ధార్మిక బాధ్యత ఉందని జమాఅత్ గుర్తు చేసింది. అలాగే ఇస్లామీయ బోధనల వెలుగులో మానవ సమస్యలను పరిష్కరించడానికి, ప్రగతి వికాసాలకు చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహించింది. ఇది ముస్లిముల ధార్మిక బాధ్యతగా నొక్కి చెప్పింది. భారతదేశంలోని ప్రజాస్వామిక సమాజం ఈ నిర్మాణాత్మక ప్రయత్నాలకు అవసరమైన అవకాశాలను, స్వేచ్ఛలను అందిస్తుంది. కాబట్టి, ఒక సుదీర్ఘకాలం జమాఅత్ చరిత్రను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా జమాఅత్ స్టడీ సర్కిళ్ళు, ఇజ్తిమాలు బలమైన ప్రభావాన్ని వేశాయి. నిర్మాణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా నేడు విద్య, ఆర్థిక, సామాజిక తదితర రంగాల్లో అమూల్యమైన సేవలందిస్తున్న వారు అనేకమంది కనిపిస్తారు. ఇందులో చాలా మందికి జమాఅత్ తో నిర్దిష్టమైన సంబంధాలేమీ లేవు. కాని వారి ఆలోచనను జమాఅత్ బలంగా ప్రభావితం చేసింది.

విద్యారంగానికి సంబంధించి ఈ ప్రభావాన్ని పరిశీలిస్తే, ప్రాపంచిక విద్య, ధార్మిక విద్య అనే తేడాను తొలగించడం. ధార్మిక బోధనల మార్గదర్శకత్వంలో ఆధునిక విద్యాబోధనల వ్యవస్థ. ఆర్థిక రంగంలో వడ్డీరహిత రుణాల వ్యవస్థ. రాజకీయాల్లో నైతిక ప్రమాణాలు, శాంతి,న్యాయాల ఇస్లామీయ నియమాలకు ప్రాధాన్యత. ముస్లిమేతర సోదరులతో సంబంధాలు, ధర్మసందేశాన్ని వారికి తెలియజేయడం. ఆధునిక పద్ధతుల్లో ఇస్లామీయ పరిశోధనలు, ఆధునిక విధానాలతో ఇస్లామీయ సాహిత్యం సృజన. ఇస్లామీయ నియమాల పునాదులపై దేశంలోని సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే డిస్కోర్స్. ఇలాంటి అనేక ప్రయత్నాలు మన ముందుకు వస్తాయి. జమాఅత్ ప్రయత్నాలను ప్రారంభకాలంలో చాలా మంది అర్థంకాని ప్రయత్నాలుగా కూడా భావించారు. కాని జమాఅత్ ప్రయత్నాలు ఒక తరాన్ని ప్రభావితం చేశాయి. ఈ విద్యశిక్షణల ఫలితంగా కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలకు చోటు లభించింది. నేడు ఈ విద్యాశిక్షణలు పొందిన ఒక తరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమూల్యమైన సేవలందిస్తోంది.

జమాఅతె ఇస్లామీ హింద్ భారత ముస్లిముల్లో దృఢమైన, నిర్మాణాత్మకమైన, సమతుల్యమైన ఆలోచనా సరళిని ప్రోత్సహించింది. కఠిన పరిస్థితులు చాలా తీవ్రమైన వైఖరులకు దారితీస్తాయి. అందువల్లనే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్న ముస్లిములు సంయమనాన్ని వదలరాదని అల్లాహ్ ఆదేశించాడు. దేశ స్వాతంత్ర్యం తర్వాత భారత ముస్లిములు అనేక సందర్భాల్లో అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. విభజన గాయాల బాధను భరించవలసి వచ్చింది. మతకలహాల మారణకాండలను సహించవలసి వచ్చింది. ముస్లిముల సామాజిక పరిస్థితులు శరవేగంగా పతనమయ్యాయి. బాబరీమస్జిద్ కూల్చివేతను చూశారు. ఉగ్రవాదం పేరుతో అమాయకులపై దౌర్జన్యాలను భరించారు. ఈ కఠిన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ భారత ముస్లిములు సంయమనాన్ని వదిలిపెట్టలేదు. ఈ వైఖరి వెనుక అనేక కారణాలతో పాటు జమాఅత్ అందించిన ఆలోచనల ప్రభావం కూడా చాలా ఉంది. దేశం పట్ల పాజిటివ్, నిర్మాణాత్మక ఆలోచనలను జమాఅత్ ప్రోత్సహించింది. నిర్మాణాత్మక వైఖరి వైపు మార్గదర్శనం చేయడంతో పాటు నెగిటివ్ ఆలోచనలను, తీవ్రవాద ధోరణులను నిర్మూలించడం కూడా జరిగింది.

దేశ స్వాతంత్ర్యం తర్వాత జమాఅత్ రూపొందించిన పాలసీ ప్రోగ్రాములో మతతత్వాన్ని నిర్మూలించడం ఒక లక్ష్యంగా ప్రకటించింది. మెజారిటీ కమ్యునలిజం మాత్రమే కాదు, మైనారిటీ కమ్యునలిజాన్ని కూడా నిర్మూలించడం ఒక కార్యక్రమంగా స్పష్టంగా పేర్కొంది. నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న తీవ్రవాద వైఖరులను పరిశీలిస్తే, భారత ముస్లిములు ఈ వైఖరులకు చాలా దూరంగా ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాస్తవాన్ని ప్రధానస్రవంతి మీడియా, ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకుంటారు. భారత ముస్లిముల్లో ఈ సంయమనాత్మక వైఖరికి ప్రధాన కారణం ముస్లిములు దివ్యఖుర్ఆన్ తో దృఢమైన సంబంధం కలిగి ఉండేలా జమాఅత్ ప్రోత్సహించడం. వివిధ పంథాలు, గ్రూపులు, మస్లకులు, ఫిర్కాల్లో విభజితమై ఉన్న ముస్లిం సముదాయాన్ని దివ్యఖుర్ఆన్ ప్రాతిపదికగా ఒక్కటయ్యే పిలుపునిచ్చింది. ముస్లిం సముదాయంలో పంథా పరమైన, మస్లక్ లేదా ఫిర్కా పరమైన విభేదాలు సముదాయం సమైక్యతకు అడ్డంకులు కానే కావనే వాస్తవం అవగాహనకు వచ్చేలా చేసింది. దీని కోసం జమాఅత్ విస్తృతంగా దివ్యఖుర్ఆన్ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నిజానికి దివ్యఖుర్ఆన్ అవగాహనా కార్యక్రమాలు జమాఅత్ ప్రత్యేక గుర్తింపుగా కూడా మారిపోయాయి. దైవకృపవల్ల నేడు ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాల్లోను దివ్యఖుర్ఆన్ అవగాహనా ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. ప్రారంభ కాలం నుంచి జమాఅతె ఇస్లామీ హింద్ దివ్యఖుర్ఆన్ అనువాదాలు, వివరణలు, భాష్యాలు ముద్రించే కార్యక్రమం చేపట్టింది. అన్ని ప్రాంతీయభాషల్లోను దివ్యఖుర్ఆన్ అనువాదాలను ముద్రించడం జరిగింది. నేడు ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాల్లోను, మస్లకుల్లోను దివ్యఖుర్ఆన్ అవగాహనా ప్రయత్నాలనేవి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. దివ్యఖుర్ఆన్ అవగాహనా ప్రయత్నాలతో పాటు జమాఅత్ చేపట్టిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే, ముస్లిం సముదాయంలో వివిధ పంథాలు, వర్గాలు, మస్లకుల మధ్య ఉన్న విభేదాలు చాలా స్వల్పమైనవని, వాటి ప్రాముఖ్యత ద్వితీయ స్థాయికి చెందినది మాత్రమేనన్న వాస్తవాన్ని అవగతం చేయడం. ఈ విభేదాలు ఉన్నప్పటికీ ధర్మానికి సంబంధించిన మౌలికాంశాలు పునాదిగా అందరూ సమైక్యం కావచ్చనే ఆలోచనలను ప్రోత్సహించింది. అందరు కలిసి ముస్లిములుగా తమ ధార్మిక బాధ్యతలను నిర్వరించవచ్చనే ప్రేరణ ఇచ్చింది. ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామీ హింద్ సంస్థాగతంగా ఒక ఉదాహరణగా కూడా నిలిచింది. జమాఅత్ లో అన్ని ప్రముఖ మస్లకుల వారు ఉన్నారు. వారు తమ తమ పంథాను అనుసరిస్తూనే ఒకే జమాఅత్ సభ్యులుగా, ఒక సంస్థాగత వ్యవస్థలో భాగంగా కొనసాగుతున్నారు. ఈ ఆచరణాత్మక నమూనా జమాఅత్ అందరి ముందు ప్రతిపాదించింది. ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలు, మస్లకులు, సంస్థలు, సంఘాలు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి కీలకపాత్ర పోషించింది. జమాఅతె ఇస్లామీ హింద్ సాముదాయిక జీవితం గడిపే పద్ధతి, సంస్థాగత, వ్యవస్థాగత విధానాలను ప్రోత్సహించింది.

జమాఅతె ఇస్లామీ హింద్ ఏర్పాటుకు ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పట్లో ఒక జమాఅత్ అంటే మహత్యాలున్న ఒక ధార్మికగురువు లేదా ముర్షద్ ను మారుమాటాడకుండా అనుసరించే అనుచరుల గ్రూపుగా మాత్రమే భావించేవారు. వారసత్వం ప్రాతిపదికగా నాయకత్వం ఉండేది.  సాముదాయిక నిర్ణయాలనేవి కేవలం నామమాత్రంగానే ఉండేవి. ధార్మిక గురువు చెప్పిందే తుది నిర్ణయంగా మారేది. అలాంటి వాతావరణంలో జమాఅతె ఇస్లామీ హింద్ నియమబద్దమైన పద్ధతిలో, రాతపూర్వకమైన సంవిధానం ప్రాతిపదికన సంస్థను ఏర్పాటు చేసే ఒక ట్రెండ్ సృష్టించింది. అలాంటి సంస్థను ఏర్పాటు చేయడమే కాదు దశాబ్దాలుగా విజయవంతంగా ఈ సంస్థ నడుస్తూంది. గత ఏడు దశాబ్దాలుగా అత్యంత క్రమశిక్షణతో సమయబద్దంగా జమాఅతె ఇస్లామీ హింద్ ఎన్నికలు జరుగుతు వస్తున్నాయి. జమాఅత్ సంస్థాగత విభాగాలన్నీ జమాఅత్ సంవిధానానికి నిబద్దమై పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా వారసత్వం ప్రాతిపదికన నాయకత్వం లేదా పదవీ బాధ్యతలు కట్టబెట్టడం జమాఅత్ లో కనబడదు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక సందర్భాల్లో జమాఅత్ లో అనేక సమస్యలపై భేదాభిప్రాయాలు కూడా తలెత్తాయి. కాని జమాఅత్ లో ఉన్న దృఢమైన సలహామండలి వ్యవస్థ, సంస్థాగత నిర్మాణం ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించుకునే గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించింది. భారత చరిత్రలో ముక్కలు చెక్కలకు గురికాకుండా కొనసాగుతున్న సంస్థ జమాఅతె ఇస్లామీ హింద్. సంస్థను ఏర్పాటు చేసే సామర్థ్యం, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడడం అనేది కేవలం సంస్థాగత వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాలేదు. జమాఅత్ తో సంబంధమున్న అందరిలోను ఈ వైఖరిని, విలువలను, సామర్థ్యాలను ప్రోత్సహించింది. ఫలితంగా జమాఅత్ తో సంబంధమున్న వారి నిర్వహణలో అనేక సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. ఈ సంస్థలు, సంఘాల్లోను ఇదే స్ఫూర్తి మనకు కనిపిస్తుంది. ఈ సంస్థలు, సంఘాలు తమ తమ సంవిధానానికి లోబడి క్రమశిక్షణతో పనిచేయడం కనిపిస్తుంది. ఎన్నికలు జరుగుతుంటాయి, చాలా మామూలుగా నాయకత్వం మారుతుంది. సలహామండలి వ్యవస్థ అనేది సంస్థాగత ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు, స్వేచ్ఛగా సమీక్షించడం, విమర్శించడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామిక పద్ధతులు ఇవన్నీ జమాఅత్ ప్రోత్సహించింది. సుదీర్ఘకాలంగా ఈ విలువలను పాటిస్తూ ఒక ఉదాహరణగా నిలిచింది. పటిష్టమైన ప్రజాస్వామిక పద్దతులను పాటించడంలో జమాఅత్ అన్ని సంస్థలను, సామాజిక సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు ఏవైనా గాని అందరినీ అధిగమించి కనిపిస్తుంది. జమాఅత్ లో ఎన్నికలు జరిగే ప్రజాస్వామిక పద్ధతి, నాయకత్వం చాలా మామూలుగా మారిపోయే దృశ్యాలు, సలహామండలి ద్వారా నిర్ణయాలు తీసుకునే సంఘటనల వంటి ఉదాహరణలు దేశంలో బహుశా మరెక్కడా కనిపించవు.

భారత ముస్లిములపై జమాఅత్ బలమైన ప్రభావాన్ని వేసింది. జమాఅత్ సంస్థాగత ఏర్పాటులో గమనించవలసిన మరో వాస్తవమేమిటంటే, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేసింది. విద్యార్థి సంఘం ఎస్ఐఓ గత నలభై సంవత్సరాలుగా నిర్దిష్ట సంవిధానానికి లోబడి పనిచేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యార్థినుల సంఘాలు పనిచేస్తున్నాయి. విద్యార్థులను, మహిళలను సంఘటితం చేయడానికి జమాఅత్ అద్భుతమైన ప్రయత్నాలు చేసింది. విద్యార్థి సంఘం శాంతియుతంగా, చట్టబద్దమైన పద్ధతులను పాటిస్తూ ఇన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న తీరు దేశంలోని విద్యార్థి సంఘాల్లో ఎస్ఐఓ ప్రత్యేకతగా నిలిచింది. యావద్దేశంలో మహిళల విభాగాన్ని జమాఅత్ విజయవంతంగా నడుపుతోంది. ముస్లిం మహిళలు, ముఖ్యంగా ధార్మిక భావాలున్న ముస్లిం మహిళలు సామాజిక, సాముదాయిక కార్యక్రమాల్లో పాల్గొనలేరనే అపోహను జమాఅత్ పటాపంచలు చేసింది. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పరదా అడ్డంకిగా ఉంటుందనే అపార్థాన్ని కూడా తొలగించింది. నేడు జమాఅత్ లో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోను జమాఅత్ మహిళా విభాగాలు వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నాయి. జిఐఓ యూనిట్లు పనిచేస్తున్నాయి. అత్యధిక విద్యావంతులైన మహిళలు మొదలు సాధారణ గృహిణుల వరకు అందరూ జమాఅత్ లో ఉన్నారు. తమ ఇంటి బాధ్యతలతో పాటు ధార్మిక బాధ్యతలు, ముస్లిం సముదాయం పట్ల తమ బాధ్యతలు, సమాజం పట్ల తమ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. అమూల్యమైన సేవలందిస్తున్నారు. తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తున్నారు.

జమాఅత్ సమాజానికి చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.

సమాజంలో ధర్మం పోషించవలసిన నిర్మాణాత్మక పాత్రను జమాఅత్ చాటి చెప్పింది. భారతదేశం వంటి ధార్మిక దేశంలో సమాజం నుంచి మతాన్ని, ధర్మాన్ని తొలగించడం సాధ్యం కాదు. అందువల్ల యూరపులో ప్రాచుర్యంలో ఉన్న సెక్యులరిజం భావన ఇక్కడ ఆచరణాత్మకం కాదు. కాని మతాన్ని, రాజకీయాలను కలగాపులగం చేయడం వల్ల రక్తపాతం, హింసాకాండల సంఘటనలు ప్రపంచంలోనే కాదు, మన దేశంలోను విషాదజ్ఞాపకాలుగా మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక జీవితంలో, రాజకీయ జీవితంలో మతం పాత్ర ఏమిటనే ప్రశ్న చాలా కాలంగా మేధావులను వేధించే ప్రశ్నగా మిగిలింది. జమాఅతె ఇస్లామీ హింద్ ఏడు దశాబ్దాల చరిత్ర ద్వారా ఈ కీలకమైన ప్రశ్నకు సముచితమైన జవాబునిచ్చింది. ఇస్లామీయ నియమాల వెలుగులో, ఇస్లామ్ ప్రతిపాదించే మానవీయ విలువల వెలుగులో పనిచేసింది. ఈ విలువలను ప్రచారం చేసింది. మతం పేరిట మతతత్వం, మతవిద్వేషం, పక్షపాతం, రక్తపాతం, హింసాకాండలను తీవ్రంగా వ్యతిరేకించింది. తీవ్రంగా ఖండించింది. రాజకీయాల్లో నైతిక ప్రమాణాలు, ఇస్లామీయ విలువలను జమాఅత్ ప్రచారం చేసింది. ప్రమాణబద్ద రాజకీయాలు,  నైతిక నియమాల విషయంలో ఓటర్లకు కూడా అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. ఇతర మతాలకు చెందిన సారూప్యభావాలున్న పెద్దలతో కలిసి పనిచేసింది. వారితో కలిసి సంయుక్త ప్రయత్నాల్లో పాల్గొంది. జమాఅత్ ఒకవైపు మతం దుర్వినియోగాన్ని, మతం పేరుతో మతతత్వాన్ని, మతోన్మాదాన్ని, హింసాకాండలను ఖండించడంతో పాటు మరోవైపు వివిధ మతాల మతపెద్దలతో కలిసి, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా, అత్యున్నత నైతిక ప్రమాణాలను ప్రోత్సహించడానికి, రాజకీయాలతో పాటు సామాజిక జీవితంలోని అన్ని రంగాల్లో నిజాయితీ, మానవీయవిలువలు, న్యాయం వంటి విలువలను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. మతం పేరుతో, మతం పునాదిగా, ఇస్లామ్ రిఫరెన్సుతో ఈ ప్రయత్నాలు చేసింది. అసలు సమస్య మతం కాదని, మతాన్ని దుర్వినియోగపరచడమే అసలు సమస్య అని చాటి చెప్పింది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో జమాఅత్ ధార్మిక జనమోర్చాలు స్థాపించింది. ఈ జనమోర్చాల్లో అన్ని మతాల పెద్దలు పాలుపంచుకుంటున్నారు. అందరు కలిసి సమాజనిర్మాణానికి పనిచేస్తున్నారు. భారతదేశంలో మతం అనేది చాలా పెద్ద శక్తి. మతాన్ని సరయిన పద్ధతిలో ఉపయోగించుకుంటే, మతాన్ని దుర్వినియోగపరచడం ఆగిపోతే సమాజంలో చాలా పెద్ద నిర్మాణాత్మక మార్పును సాధిస్తుంది. విభిన్న మతాలను అనుసరించే వారి మధ్య అరోగ్యకరమైన చర్చలు, అభిప్రాయమార్పిడి జరిగే వాతావరణం కోసం జమాఅత్ ప్రయత్నించింది. భారతదేశం వంటి బహుళదేశంలో వివిధ మతవర్గాల మధ్య నిర్మాణాత్మక సంభాషణ జరగడం చాలా అవసరం. జమాఅత్ ఈద్ మిలాప్ కార్యక్రమాలను సర్వసాధారణం చేసింది. వివిధ అంశాలపై అన్ని మతాల పెద్దలు పాలుపంచుకునే డిబేట్లు, సింపోజియంలు నిర్వహించింది. ఇటీవల కూడా యావద్దేశంలో మతవర్గాల మధ్య సుహృద్భావ సంబంధాల కార్యక్రమాలు కూడా పెద్ద స్థాయిలో నిర్వహించింది. చిన్న చిన్న ఊళ్ళలో కూడా సద్భావనా మంచ్ వంటివి ఏర్పాటు చేసింది. వివిధ మతాల వారు కలిసి మాట్లాడే వేదికలుగా ఇవి ఏర్పాటయ్యాయి. విభేదాలు, వైమనస్యాలను పరిష్కరించడానికి, అభిప్రాయ మార్పిడికి ఇవి దోహదపడుతున్నాయి.

దేశంలో వివిధ మతవర్గాల మధ్య సంభాషణల ప్రయత్నాలు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తూ వచ్చాయి. కాని జమాఅత్ ఈ కార్యక్రమాలను దేశవ్యాప్త ఉద్యమంగా నిర్వహిస్తూ వచ్చింది. చిన్న చిన్న ఊళ్ళకు కూడా ఈ ప్రయత్నాలను విస్తరించింది. నిరంతరం ఈ ప్రయత్నాలు కొనసాగేలా జమాఅత్ జాగ్రత్తలు తీసుకుంది. దానివల్ల భారత సమాజంపై, ఇక్కడి మతతత్వవాతావరణంపై చెప్పుకోదగిన ప్రభావం పడింది. నిర్మాణాత్మక మార్పులకు కారణమైంది. భారత ముస్లిములు, ముస్లిం సంఘాలు కేవలం తమ సమస్యలు, తమ పరిస్థితులపై మాత్రమే ఆలోచించడానికి పరిమితం కారాదని, కేవలం తమ పనులకే పరిమితమైపోరాదని, మొత్తం దేశం, సమాజం మేలు కోసం ఆలోచించాలని, పనిచేయాలని జమాఅత్ ఎల్లప్పుడు కోరుతూ వస్తోంది. అందరి కోసం పనిచేయాలి. ఇస్లామీయ బోధనల వెలుగులో యావద్దేశంలో శాంతిన్యాయాలను స్థాపించడానికి ప్రయత్నించాలి. ప్రత్యామ్నయ విధానాలపై దృష్టిపెట్టాలి. ప్రతిపాదించాలి. ఇస్లామీ విలువల పునాదిగా ఒక ప్రత్యామ్నయ డిస్కోర్స్ ఉనికిలోకి వచ్చేలా చేయాలి. అందువల్లనే జమాఅతె ఇస్లామీ హింద్ నిరంతరాయంగా దేశంలోని రాజకీయ విధానాలపై, ఆర్థిక విధానాలపై, ఇతర పాలసీలపై తన అభిప్రాయాలను ప్రకటిస్తూ వచ్చింది. పెట్టుబడిదారి దోపిడిపై జమాఅత్ తన గొంతు బలంగా వినిపించింది. ఈ విషయాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. వడ్డీరహితమైన ప్రత్యామ్నయ బ్యాంకింగ్ కోసం జమాఅత్ వ్యక్తులు, సారుప్యభావాలున్న వారు చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ ప్రయత్నాలను కూడా ఆర్థిక విధానాల సంస్థలు గుర్తించాయి. ఇటీవల సచర్ కమిటీ నివేదిక తర్వాత ముస్లిం సముదాయం విద్యాశిక్షణలు, ప్రగతి వికాసాల కోసం జమాఅత్ ఒక వివరణాత్మక విజన్ ప్రతిపాదించింది. అది విజన్ 2016 పేరుతో ప్రాచుర్యం పొందింది.

ముస్లిముల్లో సంక్షేమ కార్యక్రమాలు విద్యసంస్థలను స్థాపించడం లేదా ఆర్థిక సహకారం అందించే ప్రయత్నాలు మాత్రమే జరిగేవి. కాని ముస్లిముల సంక్షేమానికి ప్రణాళికాబద్దంగా, వారి అవసరాలను గుర్తించి, ఇతర రంగాల్లోను అవసరమైన సేవలందించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉపాధి కల్పన, మైక్రోఫైనాన్స్, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం వగైరాల్లో పనిచేయవలసి ఉంది. విజన్ 2016 ప్రత్యేకత ఏమిటంటే, ఉత్తరాదిలో ముస్లిముల్లో పేదరికం ఎక్కువగా ఉంది. వెనుకబాటు ఎక్కువగా ఉంది. దక్షిణాది ముస్లిముల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కాబట్టి దక్షిణాది ముస్లిముల సామర్థ్యాలు, వారి తోడ్పాటు ద్వారా ఉత్తరాది ముస్లిముల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించడం. ఈ విజన్ మంచి ప్రభావాన్ని వేసింది. జమాఅత్ తో సంబంధమున్నవారు, సారూప్యభావాలున్న వారు ముందుకు వచ్చారు. ఉత్తరాది ముస్లిముల సంక్షేమానికి సంస్థలు ఏర్పాటు చేశారు. పని ప్రారంభించారు. విజన్ 2016 తర్వాత ముస్లిం సముదాయంలోని ఇతర దాతలను కూడా ఆకర్షించింది. దక్షిణాదికి చెందిన అనేక సామాజిక సంస్థలు, సంక్షేమ సంస్థలు ఇప్పుడు ఉత్తరాదిలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాయి. విజన్ 2016 తర్వాత ఇప్పుడు విజన్ 2026 ప్రకటించడం జరిగింది. ఇది కూడా ముస్లిం సముదాయం ప్రగతి వికాసాలకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాము.

భారతదేశం వంటి అతిపెద్ద దేశంలో కేవలం కొన్ని వేలమంది మాత్రమే ఉన్న మానవ వనరులు చాలా పరిమితమైనవి. కాని జమాఅత్ ప్రయత్నాల ప్రభావం కేవలం జమాఅత్ కార్యకర్తలు, అభిమానులకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక సామాజిక ఉద్యమంగా భారత సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేసింది. జమాఅత్ సామాజిక ప్రభావం, జమాఅత్ మానవవనరులతో పోల్చితే చాలా ఎక్కువ. ప్రొఫెసర్ జాన్ స్పాసిటో ప్రకారం జమాఅత్ ప్రభావం జమాఅత్ లోని మానవవనరులతో పోల్చితే చాలా ఎక్కువ. దీనికి కారణం జమాఅత్ లో ఉన్న క్రమశిక్షణ, సంక్షేమకార్యక్రమాలు, సామాజికశక్తి, నిజాయితికి మారుపేరనే కీర్తి.

ధర్మసంస్థాపనా మార్గాన జరిగిన ప్రయత్నాల వివరాలు ఇవి. జమాఅత్ తో సంబంధమున్న వారంతా ఈ వివరాలు తెలుసుకోవాలి. మన పెద్దలు చేసిన పని, ఆ పని వల్ల సాధించిన ఫలితాలు సాధారణమైనవి కావు. అనేక రంగాల్లో చాలా పెద్ద పెద్ద మార్పులు, ముఖ్యంగా ముస్లిం సముదాయంలో చాలా మార్పులు మన పెద్దల ప్రయత్నాల వల్ల, త్యాగాల వల్ల సాధ్యమయ్యాయి.

ఏడు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన అంశాలతో పాటు సాధించలేనివి ఏమిటన్నది కూడా మనం ఆలోచించాలి. దీనివల్ల సవాళ్ళను, సమస్యలను అర్థంచేసుకోవడం సాధ్యపడుతుంది. ముందుకు సాగే మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఈ దేశంలోని అధికసంఖ్యాక ప్రజలతో సంభాషణలో విఫలమయ్యామని నేను భావిస్తున్నాను. వారి ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభావితం చేయడమనే పనిలో వెనుకబడ్డాము. గత ఏడుదశాబ్దాలుగా యావద్దేశంలో ఇస్లాముకు సంబంధించి సామాజిక ఆలోచనల్లో ఏదైనా మార్పు వచ్చిందంటే అది చాలా వరకు నెగిటివ్ మార్పు కనిపిస్తుంది. నేడు ఒకవైపు ముస్లిములు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఇస్లాంకు దగ్గరగా ఉన్నారు. ధార్మిక జ్ఙానం నేడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ధర్మంపేరుతో బిదాత్, మూఢనమ్మకాలు, మూఢాచారాలు తగ్గాయి. కాని మరోవైపు యావద్దేశంలో అధికసంఖ్యాకుల్లో, ముస్లిమేతర సోదరుల్లో గతంలో కన్నా ఎక్కువగా ఇస్లామ్ గురించి అపార్థాలు, అపోహలు పెరిగాయి. ఇస్లాంకు సంబంధించి అనుమానాలు, విద్వేషాలు పెరుగుతున్నాయి. ఇస్లాం, ముస్లిములకు సంబంధించి సానుకూల వైఖరి తగ్గిపోయింది. ప్రతికూల వైఖరి పెరిగింది. మన ముందున్న పెద్ద సవాలు ఇదే. ప్రజాభిప్రాయాన్ని మలచడం. ఇస్లాం పట్ల శరవేగంగా విస్తరిస్తున్న అపార్థాలు, అనుమానాలు, అపోహలు, విద్వేషాలను తొలగించాలి. ప్రజాభిప్రాయం సానుకూల దిశకు మరలేలా ప్రయత్నించాలి. ఇస్లామీయ విలువలను అర్థం చేసుకునేలా ప్రయత్నించాలి. ఏవిధంగానైతే మనపెద్దల ప్రయత్నాల వల్ల ముస్లిం సముదాయంలో ఆలోచనల మార్పు వచ్చిందో అదేవిధంగా మన ప్రయత్నాల వల్ల ముస్లిమేతర సోదరుల ఆలోచనలు, అభిప్రాయాల్లో మార్పునకు మనం ప్రయత్నించాలి. ఇస్లాంకు సంబంధించి పాజిటివ్ భావాలు పెంపొందే ప్రయత్నం చేయాలి.

ఇప్పుడు చేయవలసిన పని ఇదే. జమాఅత్ శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. మన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పనిచేయాలి. జమాఅత్ అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరుల సంఖ్య పెరగాలి. వివిధ రంగాల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో జమాఅత్ గురించి తెలుసుకుని జమాఅత్ కు దగ్గరయ్యేలా చేయాలి.