December 18, 2024

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పదిహేను సంవత్సరాల విద్యార్థి టీచర్లు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయాడని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దిల్షాన్ అనే విద్యార్థి కన్నౌజ్ లోని మదయా గ్రామంలో చదువుతున్నాడు. కన్నౌజ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విద్యార్థి టీచర్లు కొట్టడం వల్లనే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. దిల్షాన్ తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోసం జులై 23వ తేదీన ఆ స్కూలుకు వెళ్ళాడు. దిల్షాన్ చేతివాచీ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శివకుమార్ అనే టీచర్ అతన్ని తరగతి గదిలోకి లాక్కెళ్ళినట్లు విద్యార్థి తండ్రి జహంగీర్ ఆరోపిస్తున్నాడు. శివకుమార్ తో పాటు ప్రభాకర్, వివేక్ అనే మరో ఇద్దరు టీచర్లు కలిసి దిల్షాన్ ను విచక్షణారహితంగా కొట్టారని తండ్రి ఆరోపిస్తున్నాడు. గాయాల పాలైన విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో దిల్షాన్ మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.