December 20, 2024

లక్నో పోలీసులు లులు మాల్ లో నమాజు చేసిన వారిని అరెస్టు చేశారు. జులై 12వ తేదీన లులు మాల్ లో నమాజు చేస్తూ ఒక వీడియోలో కనబడిన వారికి సంబంధించిన కేసు ఇది. వారిపై భారత శిక్షాస్మృతి లో విభిన్న వర్గాల మధ్య వైరాన్ని పెంచడం, మతభావాలను గాయపరచడం తదితర సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు. నమాజు చేయడం మతభావాలను ఎలా గాయపరుస్తుందన్న ప్రశ్నకు జవాబు కోర్టు చెప్పాలి.

అబూదాబీకి చెందిన యూసుఫ్ అలీ అనే బిలియనీర్ లక్నోలో లులు మాల్ ప్రారంభించాడు. ఈ మాల్ ను స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు. భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా లులు మాల్స్ ఉన్నాయి. కోచీ, త్రిసూర్, బెంగుళూరు, తిరువనంతపురాల్లో మాల్స్ ఉన్నాయి. స్వయంగా యూసుఫ్ అలీ కూడా భారతసంతతికి చెందిన వ్యక్తి. మాల్ ప్రారంభమయ్యింది జులై 11వ తేదీన. జులై 12వ తేదీన కొందరు లులు మాల్ లో నమాజు చదివిన సంఘటన, దాని వీడియో బయటకు వచ్చాయి. ఆ వెంటనే హంగామా మొదలయ్యింది. లులు మాల్ లో నమాజు చదివితే, బహిరంగప్రదేశాల్లో నమాజుకు అవకాశం ఇస్తే అక్కడ తాము సుందరకాండ చదువుతామని, హనుమాన్ చాలిసా చదువుతామని హెచ్చరికలు జారీ చేసింది. అఖిల భారతీయ హిందూ మహాసభ. అంతేకాదు, మాల్ లో 70 శాతం ఉద్యోగులు ముస్లిములనీ, కేవలం 30 శాతం మాత్రమే హిందువులనీ కూడా మాల్ ఉద్యోగుల మతపరమైన వివరాల రహస్యాన్ని కూడా బయటపెట్టింది. కేసు నమోదయ్యింది. నమాజు చేసిన వారు లులు ఉద్యోగులనీ కూడా ఈ సంస్థ ఆరోపించింది. లులు ఆడ్మినిస్ట్రేషన్ వెంటనే ప్రతిస్పందిస్తూ మాల్ లో ప్రార్థనలకు ఎవరికీ అవకాశం, అనుమతి ఇవ్వమని చెప్పుకుంది. అంతేకాదు మాల్ ఉద్యోగుల్లో 80 శాతం హిందువులేనని ప్రకటించింది.

లులు మాల్ తరఫు నుంచి ఈ వివరణ వచ్చిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు అంబాసిడర్ గా పనిచేసిన నవదీప్ సూరీ ఒక ట్వీటు చేస్తూ, భారతదేశంలో యూసుఫ్ అలీ స్థాపించిన లులు గ్రూప్ పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందనీ, తమ హైపర్ మార్కెటు కోసం భారతదేశం నుంచి 3 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసుకుంటుందనీ, వేలాది ఉద్యోగాలు కల్పించిందనీ, అలాంటి సంస్థ ఇప్పుడు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల మతపరమైన వివరాలు చెప్పుకోవలసి రావడం అత్యంత విషాదకరమైన సంఘటన అని రాశారు.

అరెస్టులు జరిగినప్పటికీ కర్నీసేన, హిందూమహాసభ తదితర సంస్థలు తమ ఆందోళన కార్యక్రమాలు తగ్గించలేదు. లులు మాల్ ను బాయ్ కాట్ చేయాలని ఉద్యమమే ప్రారంభించారు.

లులు మాల్ నమాజు సంఘటనకు సంబంధించి మరో వివాదం ముందుకు వచ్చింది. అసలు నమాజు చేసిన వారికి నమాజు అంటే ఏమిటో తెలియదనీ, వివాదం సృష్టించడానికి హడావిడిగా నమాజు చేసినట్లు నటించి దాన్ని చిత్రీకరించారని, మాల్ ను అప్రతిష్ఠపాలు చేసే కుట్రగా కొత్త కోణాన్ని కొందరు బయటపెట్టారు. స్వయంగా అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ శ్రీవాత్సవ కూడా ఇదే మాట చెప్పారు. అక్కడ నమాజు చదివిన వారికి నమాజు గురించి ఏమీ తెలియదనిపిస్తోందన్నారు.

కాని అరెస్టయిన వారి కుటుంబాల కథనం వేరేగా ఉంది.

లులూ మాల్ లో సెక్యూరిటీ గార్డుల అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు నమాజు చేశారని కుటుంబసభ్యుల కథనం. నమాజు చేసినందుకు అరెస్టయిన వారిలో ఆతిఫ్ ఖాన్ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని తమ్ముడు రీహాన్ ఖాన్ మదరసాలో చదువుతున్నాడు. స్క్రోల్ సంస్థ ప్రకారం వీళ్ళంతా విద్యార్థులు. బక్రీద్ పండుగకు ముందు లభించిన సెలవులో మాల్ చూడ్డానికి వెళ్ళారు. వైరల్ అయిన వీడియో కేవలం 18 సెకన్లు మాత్రమే ఉంది. ఆతిఫ్ ఖాన్, రిహాన్ ఖాన్ల బంధువులు మాట్లాడుతూ అసలు నమాజు చేయడం వారికి తెలియదనే మాట అబద్దమని, అసలు మొత్తం వీడియో ఎవరైనా చూశారా, కేవలం 18 సెకన్ల క్లిప్పు చూసి వ్యాఖ్యానిస్తున్నారు, వీడియోలే కనిపిస్తుంది కేవలం నమాజు తర్వాత చేసే దువా మాత్రమే అని అన్నాడు. నమాజు చేసినందుకు అరెస్టవుతామనే విషయం కూడా వారికి తెలియదని అంటున్నారు.

నమాజు సమయం అయితే దగ్గరలో మస్జిదు లేకపోతే కాస్త ప్రశాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడే నమాజు చేయడం ముస్లిములు చాలా మంది చేసేదే. భారత సంస్కృతిలో ఇలా ప్రార్థనలు చేసినందుకు అరెస్టయిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అని చాలా మంది విమర్శిస్తున్నారు. రైళ్ళలో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూర్చున్న చోటనే నమాజు వేళ అయితే నమాజు చేసుకోవడం, స్వంత కారులో ప్రయాణిస్తున్నా, దారిలో నమాజు సమయం అయితే రోడ్డు ప్రక్కన కాస్త శుభ్రంగా ఉన్న ప్రదేశం కనిపిస్తే కారు రోడ్డు పక్క ఆపి నమాజు చేసుకోవడం ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

లూలూ మాల్ లో జరిగిన సంఘటనకు ముందు కూడా నమాజు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో నమాజు చేసినందుకు అరెస్టులు జరిగాయి. కాని న్యాయనిపుణుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థించడం అనేది దానికదే నేరం కాదు. వివిధ సముదాయాల మధ్య విద్వేషం, వివాదాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యాలు స్పష్టంగా కనిపించకపోతే నేరంగా పరిగణించలేము. అంతేకాదు, దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు కొత్త కాదు. దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక సముదాయం ప్రార్థనపై మాత్రమే చర్యలు తీసుకోవడం వివక్ష క్రిందికే వస్తుందని పలువురి అభిప్రాయం. ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే మాట్లాడుతూ ముస్లిం ఉద్యోగులు ఒకవేళ నమాజు చేయాలనుకున్నా, చేసినా అది నేరం కాదని అన్నారు. ఏ పనయినా ఇతరులకు నష్టం కలిగిస్తేనే నేరమవుతుందని అన్నారు.

కాని దేశంలో అదే జరుగుతోంది. హరిద్వార్ లో బహిరంగ ప్రదేశంలో నమాజు చేస్తున్నందుకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రయాగరాజ్ రైల్వే స్టేషను వెయిటింగ్ ఏరియాలో కొందరు నమాజు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వెంటనే పోలీసులు వారిని వెదకడం ప్రారంభించారు. అలీఘర్ లో ఒక కాలేజీ ప్రొఫెసర్ నమాజు వేళకు లాన్ లో నమాజు చదివినందుకు అతన్ని సెలవుపై వెళ్ళమన్నారు. మే నెలలో నలుగురు టూరిస్టులు తాజ్ మహల్ లోపల ఉన్న మస్జిదులో నమాజు చదివినందుకు అరెస్టయ్యారు. అంతకు ముందు బెంగుళూరు రైల్వే స్టేషను వెయిటింగ్ రూములో నమాజు చదువుతన్న వారిని అక్కడి హిందుత్వ సంస్థ అడ్డుకుంది. ఇదంతా దేశభద్రతకు ప్రమాదమని, అధికారులు వెంటనే నమాజు ఆపాలని డిమాండ్ చేశారు. అక్కడ గత 30 సంవత్సరాలుగా అనేకమంది నమాజు చదవడం జరుగుతోంది. అంతేకాదు, అక్కడ గడి, క్రయిస్తవుల ప్రార్థనహాలు కూడా ఉన్నాయి. కాని నమాజు చదవడం మాత్రం దేశభద్రతకు ప్రమాదమని ఈ సంస్థల అభిప్రాయం. లులూ మాల్ సంఘటన తర్వాత ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్ ట్వీట్ చేస్తూ కవారియా యాత్రికులపై పోలీసులు పూలవర్షం కురిపించడం, మరోవైప నమాజు చేసిన వారిని అరెస్టు చేయడాన్ని నిలదీసి ప్రశ్నించారు. ఇది పూర్తిస్థాయి వివక్ష అన్నారు.

దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, మతకార్యక్రమాలు జరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లోనే అనేక మతకార్యక్రమాలు జరుగుతుంటాయి. ఊరేగింపులు, భజనల వంటి కార్యక్రమాలు పబ్లిక్ రోడ్లపై, పార్కుల్లో జరగవా అని హెగ్డే ప్రశ్నించారు. గణేష్ పండాల్, హోలీ ఊరేగింపులు, కవారియా యాత్ర, రామ్ లీలా ఉత్సవాలు ఇలాంటివి అనేకం చాలా మంది ఉదాహరిస్తున్నారు. 2018లో సుప్రీంకోర్టులో ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. దేశ ప్రధాని కొత్త పార్లమెంటు భవనంలోని కొత్త జాతీయ చిహ్నం ప్రారంభోత్సవానికి ముందు ప్రార్థన చేసిన విషయాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఇస్లామోఫోబియా వల్ల దేశప్రగతి వికాసాలకు విఘాతం కలుగుతుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

గురుగ్రామ్ లో శుక్రవారం నమాజులపై జరిగిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. గురుగ్రామ్ లో ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గురుగ్రామ్ లో ఒక హిందూ వ్యాపారి అక్షయ్ యాదవ్ తన ప్రయివేటు ప్రాపర్టీలో  నమాజు చేసుకోవచ్చని చాలా మందిని ఆహ్వానించి నమాజుకు స్థలమిచ్చాడు. ఆ తర్వాత ఒక గురుద్వారా ముందుకు వచ్చింది. గురుద్వారా బేస్ మెంట్ లో నమాజు చదువుకోవచ్చని ఆహ్వానించారు. సోనా చౌక్ గురుద్వారా అధ్యక్షుడు షేర్ దిల్ సింగ్ సిందూ మాట్లాడుతూ జరుగుతున్నదంతా తమాషా చూడలేమని అన్నాడు. ఇవి రెండు సంఘటనలే కావచ్చు. కాని భారతదేశంలోని మతసామరస్యాన్ని చాటి చెప్పే సంఘటనలు. భారతీయతను నిలబెట్టే ఇలాంటి సంఘటనల్లోనే అసలైన ఇండియా ఉంది.