December 21, 2024

మీడియా అనేది విస్తృతమైన పదం. వార్తాపత్రికల్లో రాతల నుంచి సినిమాల్లో దృశ్యాల వరకు అన్నీ మీడియా క్రిందికే వస్తాయి. నేడు దేశంలో మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది ఒకసారి మనం సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. పోస్ట్ ట్రూత్, మాన్యుఫాక్చరింగ్ కాన్సెంట్ వగైరాలకు మీడియా ఇస్తున్న సహకారం ఏమిటన్నది కూడా దీని వల్ల మనం అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల వచ్చిన కొన్ని వార్తలను ఈ సందర్భంగా చూద్దాం. శ్రద్ధా వాకర్ హత్య జరిగింది. అత్యంత దారుణమైన హత్య. తన ప్రేయసిని హతమార్చి ముక్కలు చేసి పారేసిన ఉన్మాది పేరు ఆఫ్తాబ్. ఈ పేరు ముస్లిం పేరుగా కనబడగానే మీడియా ఎలా వ్యవహరించింది?

అలాగే శ్రద్ధా హత్య తర్వాత వచ్చిన మరో వార్త, పూనమ్ తన మొదటిభర్త కుమారుడితో కలిసి తన రెండో భర్తను చంపి ముక్కలు చేసి పారేసిన హత్య. భర్త పేరు అంజన్ దాస్. ఈ వార్త పట్ల మీడియా ఎలా వ్యవహరించింది?

కశ్మీర్ ఫైల్స్, కేరళస్టోరీ వంటి సినిమాలు ఎలాంటి సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి?

ఈ ప్రశ్నల గురించి సమాజసంక్షేమం కోరేవారందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.

న్యూస్ మీడియా:

శ్రద్ధావాకర్ హత్య అత్యంత దారుణమైనది. అమానుషమైనది. ఈ హత్య కేసులో దోషిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుర్మార్గులు ప్రతి సముదాయంలోను ఉంటారు. కాని ఈ హత్య కేసులో దోషి పేరు అఫ్తాబ్, అతను ముస్లిం. ఈ వివరాలు బయటకు రాగానే మీడియా దీనికి లవ్ జిహాద్ పేరు పెట్టింది. ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు అత్యంత నీచంగా ప్రారంభమయ్యాయి. కరోనా దేశంలో ప్రబలుతున్నప్పుడు కూడా మీడియా ఇదే వైఖరి ప్రదర్శించింది. తబ్లీగీ జమాఅత్ ఇజ్తిమాను, ముస్లిములను లక్ష్యంగా చేసుకుని విద్వేషాన్ని సమాజంలో ప్రచారం చేయడమే పనిగా వ్యవహరించింది.

శ్రద్ధావాకర్ హత్య తర్వాత జాతీయ టీవీలో యాంకర్లు రెచ్చిపోయారు. బీజేపీ నాయకులు మతోన్మాద రాజకీయాలు నడపడం ప్రారంభించారు. మొత్తానికి అందరూ కలిసి సమాజంలో ముస్లిం విద్వేషమబ్బులు కబ్బుకునేలా చేశారు. ముస్లిం పురుషులు మహిళలపై హింసకు పాల్పడతారనే అభిప్రాయాన్ని, మాన్యుఫాక్చరింగ్ కాన్సెంట్, తయారు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బీజేప పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా మాట్లాడుతూ లవ్ జిహాద్ కు పాల్పడే వార శ్రధ్ధావాకర్ హత్యలాంటి హత్యలు చేస్తారని చెప్పింది.

నవంబర్ 21వ తదీన ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో రషీద్ ఖాన్ అని చెప్పుకునే వ్యక్తి శ్రద్ధా వాకర్ హత్యను సమర్థిస్తూ మాట్లాడాడు. మతోన్మాద రాజకీయాలు చేసేవారు ఈ వీడియోను వైరల్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 24వ తేదీన బులంద్ షహర్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి అసలు పరు వికాస్ కుమార్ (రషీద్ ఖాన్ కాదు). ఇలాంటి ఫేక్ వీడియోలు ముస్లింలపై విద్వషాన్ని సృష్టించడానికి అనేకం గతంలోను వచ్చాయి. కరోనా సమయంలో ఫేక్ వీడియోలు ఎలా వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రద్ధావాకర్ హత్య తర్వాత కూడా ఇదే జరుగుతోంది.

సుదర్శన్ టీవీలో యుపియస్సీ జిహాద్ పై వార్త గతంలో వచ్చింది. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇలాంటి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా టీవీ చానళ్ళ వైఖరిని తప్పుపట్టింది. శ్రధ్దా వాకర్ హత్య తర్వాత ఆజ్ తక్ లో సుధీర్ చౌదరి ఏమన్నాడంటే, ప్రేమలో పడే ముందు సామాజిక, ధార్మిక నేపథ్యాలు కూడా చూసుకోవాలట. ఎందుకంటే, మహిళలను వాడిపారసే వస్తువులుగా చూసూ మతనేపథ్యం ఉన్న వ్యక్తయితే మహిళకు తగిన గౌరవం ఇవ్వడట.  శ్రద్ధావాకర్ కేసులో కూడా ఇదే జరిగిందట. హింసను చూస్తూ పెరిగే సామాజిక, మతనేపథ్యంలో పెరిగిన వ్యక్తి మైండ్ సెట్ తుకడే… తుకడే… ప్రవృత్తితోనే ఉంటాటడ. ఇది ఆజ్ తక్ వంటి ప్రముఖ జాతీయ చానల్ చెప్పిన మాట. ఇక్కడ మతనేపథ్యం అంటూ ఎవరిని ఎవరిపై రెచ్చగొడుతున్నాడో ఆలోచించాలి.

న్యూస్ 18లో అమన్ చోప్రా అనే యాంకర్ ఇది లవ్ జిహాద్ అని తీర్మానించేసినట్లే మాట్లాడాడు. సుదర్శన్ న్యూస్ లో సురేష్ చావన్కే ట్విటర్ లో ఒక ట్వీట్ చేశాడు. వాసయిలో ఇమ్రాన్ అనే వరుడు, దివ్య అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్న శుభలేఖను ట్వీటులో పెట్టి శ్రద్ధావాకర్ ను ముక్కలు చేసిన ఆప్తాబ్ ఏ ఊరి నుంచి వచ్చాడో అదే ఊరిలో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించాడు. నిజానికి ఈ ట్వీటు ట్విటర్ పాలసీలకు విరుద్దమైనది. కాని ట్విటరు తొలగించలేదు. ట్విటరు కూడా మీడియాలో భాగమే.

మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి అనేక సంఘటనలను వాడుకోవడం జరుగుతోంది. గురుగ్రామ్ లో ఒక సూట్ కేసులో మహిళ మృతదేహం దొరికింది. ఇది లవ్ జిహాద్ కేసే అంటూ ప్రచారం కూడా మొదలయ్యింది. తర్వాత తెలిసిందేమిటంటే ఈ కేసులో నిందితుడు హిందువే. ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్ లో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఆరాధనా ప్రజాపతి అనే మహిళ శవం ఒక బావిలో దొరికింది. ఇది కూడా లవ్ జిహాద్ అనే ప్రచారం మొదట ప్రారంభమయ్యింది. న్యూస్ 18 ఇది మరో ఆప్తాబ్ కేసంటూ తీర్మానించేసింది.  చివరకు ఈ కేసులో పోలీసులు అరెస్టుచేసిన నిందితుడి పేరు ప్రిన్స్ యాదవ్. ఈ వివరాలు బయటకు వచ్చిన తర్వాత లవ్ జిహాద్ అని ప్రచారం చేసే కోణం లేదు కాబట్టి మీడియాకు ఈ వార్త పై చర్చలు పెట్టవలసిన అవసరం కనబడలేదు.

చాలా మందికి కథువా బాలికపై అత్యాచారం అమానుష హత్య కేసు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మధుకిశ్వర్ ఒక కొత్త రాగం అందుకుంది. రోహింగ్యా జిహాదీలనే కొత్త పాట ప్రారంభించారు. కథువా కేసులో కూడా రోహింగ్యా జిహాదీలున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. పోస్టుకార్డు న్యూస్ అనే వెబ్ సైటులో ఇలాంటి విద్వేష ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటుంది. పోస్టు కార్డు న్యూస్ స్థాపించిన విక్రమ్ హెగ్డే అప్పట్లో ఒక సిద్దాంతం కూడా ప్రతిపాదిచాడు. అదేమిటంటే, 94 శాతం రేపిస్టులు ముస్లిములేనట. ఈ విద్వేషాన్ని యధేచ్ఛగా కొనసాగించే వాతావరణం ఎలా ఏర్పడింది? ఒక నేరంలో ముస్లిం పేరు కనబడగానే విద్వేషప్రచారం ప్రారంభించడం, ఏదన్నా హింసాత్మక లైంగిక నేరం జరగ్గానే అది ముస్లిముల పనే అన్న వాతావరణం సృష్టించడం, నిందితులు ముస్లిములు కాదని రుజువులు దొరికిన తర్వాత మరో అవకాశం కోసం కాచుకుని కూర్చోవడం. ఇది నేటి మీడియా చేస్తున్న పని.

నిందితుడు ముస్లిమేతరుడైన నేరాల్లో మీడియా వాడే పదాలు వేరు. అలాంటి సందర్భాల్లో మతం ప్రసక్తి తీసుకురావడం జరగదు. కాని అదే నిందితుడు ముస్లిం పేరు కనబడగానే మతసముదాయం మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నాలు మొదలవుతాయి. పశువుల పట్ల అమానుషంగా వ్యవహరించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారు అన్ని మతాల్లోను ఉంటారు. కాని ఇలాంటి సందర్భాల్లో కూడా ముస్లిం పేరు కనబడితే మీడియాకు మేత దొరుకుతుంది నెమరు వేయడానికి.

కొందరు ప్రముఖ జర్నలిస్టులు ఈ వైఖరిపై ఏమన్నారన్నది గమనించాలి. వైర్ వార్తా సంస్థ ఈ ఎడిటర్లతో మాట్లాడింది. సీనియర్ జర్నలిస్ట్ శ్రవాణ్ గార్గ్ మాట్లాడుతూ హిందీ పాఠకులను హిందీ మీడియా ఒక భావజాలం వైపు నెట్టేస్తోంది. ఒక న్యూస్ పేపరు పాత్రికేయ విలువలకు నిలబడుతూ నిజాయితీగా కరోనా వార్తలు అందించింది. అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు కూడా గుర్తించాయి. ఆ పత్రిక పేరు నేను చెప్పను. కాని తర్వాత ఆ పత్రికపై ఒత్తిడది పెరిగింది. యి.డి. ఐటి దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆ పత్రిక కూడా తన పద్ధతి మార్చుకుంది. మిగిలిన పత్రికల మాదిరిగానే ఇప్పుడు వ్యవహరిస్తోంది. రామజన్మభూమి ఆందోళన కాలం నుంచి హిందీ మీడియా ఇదే వైఖరి అవలంబిస్తోంది. హిందూ ముస్లిం విభజనకు చాలా వరకు ఇదే కారణమయ్యింది. దీనివల్ల వారికి లాభాలున్నాయి. రాజకీయాలకు లాభాలున్నాయి.

నీనా వ్యాస్ అనే మరో సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడేనా, ఏ సముదాయంలో అయినా నేరస్తులు, దుర్మార్గులు, క్రూరులు కొందరు ఉంటారు. ఒక అమానుషమైన నేరానికి మొత్తం సముదాయంపై బురద జల్లడం నాన్సెన్స్. ఇలాంటి వైఖరి వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనమూ లేదు.

శ్రద్దా వాకర్ కేసు విషయానికి వస్తే, శ్రద్ధాకు మద్దతు పేరుతో హిందూ ఏకతా మంచ్ ఒక మహాపంచాయత్ ఏర్పాటు చేసింది. ఇది బేటా బాచావో మహాపంచాయత్. ఈ మహాపంచాయత్ లో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇందులో జరిగిన ఒక సంఘటన వైరల్ అయ్యింది. ఆ సంఘటన ఏమిటంటే, మహాపంచాయత్ లో ఒక మహిళ వేదికపై వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించి, తన చెప్పు తీసి పక్కన నిలబడిన వ్యక్తిని కొట్టింది. ఆ మహిళ కూతురిని ఆ వ్యక్తి కొడుకు బలవంతంగా ఎత్తుకుపోయాడని ఆరోపణ. ఆమె పోలీసుల చుట్టు తిరిగి విసిగిపోయింది. మహాపంచాయత్ లో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను అడ్డుకున్నారు. ఆమె చివరకు ఆ వ్యక్తిపై దాడి చేసిందని వివరాలు వచ్చాయి. ఆ మహిళ పేరు రాలేదు. ఆ వ్యక్తి పేరు రాలేదు. కాని వారిద్దరు ముస్లిములు కాదని చెప్పవచ్చు. ఎందుకంటే హిందూ ఏక్తా మంచ్ ఏర్పాటు చేసిన వేదిక అది. వీడియోలో ఆ మహిళ నుదుట స్పష్టంగా బొట్టు కనిపిస్తున్నది. బేటీ బచావో, శ్రధ్ధాకు మద్దతు అని మాట్లాడేవారు ఆ మహిళకు ఎందుకు న్యాయం చేయలేదు. ఆ మహిళ కేసుపై టీవీల్లో చర్చలు ఎందుకు జరగడం లేదు? ఇలాంటి అనేక కేసులపై మీడియాలో చర్చలు జరగవు. ఎందుకంటే, ఈ కేసుల్లో ముస్లిములపై విద్వేషం వెళ్ళగ్రక్కే అవకాశం లేదు కాబట్టి.

సినిమాలు:

న్యూస్ మీడియాతో పాటు ఇప్పుడు సినిమాలు కూడా ఈ పాత్ర చాలా బలంగా పోషిస్తున్నాయి. నిజానికి దేశంలో రాజకీయాలు మతతత్వ రాజకీయాలైపోయాయి. వ్యాపారాల్లో కూడా మతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముస్లిముల వ్యాపారాలు బాయ్ కాట్ చేయాలన్న పిలుపులు తరచు వినిపిస్తున్నాయి. విద్యారంగంలోను మతతత్వ ధోరణలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్టెయిన్ మెంట్ కు ప్రధానమార్గమైన సినిమా మీడియా కూడా మతం రంగు సంతరించుకుంది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని ప్రచారం చేయడంలో మునిగిపోయింది. హిందీ సినిమాల్లో ఒకప్పుడు ముస్లిము పాత్రలు సాధారణ పాత్రల్లాగే ఉండేవి. ఇప్పుడు కేవలం దుర్మార్గులు దుష్టుల పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ఇస్లామోఫోబియాను క్రమంగా చాపకింద నీరులా విస్తరించేలా చేస్తున్నారు. పద్మావత్, లిప్ స్టిక్ అండర్ మై బురఖా, తన్హాయీ, కశ్మీర్ ఫైల్స్, హమ్ దో హమారే బారా ఇలా అనేక సినిమాల పేర్లు చెప్పవచ్చు.

కశ్మీర్ ఫైల్ సినిమా విద్వేష రాజకీయాలకు ఊతమిచ్చే సినిమా అని అనేకమంది విమర్శించారు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో న్యాయనిర్ణేతల జ్యూరీ హెడ్, ఇస్రాయీల్ కు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు నాదవ్ లాపిడ్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీవ్రంగా విమర్శించాడు. ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్ లో అనుమతించడం దిగ్భ్రంతికరమని అన్నారు. ఇది ప్రాపగాండ కోసం తయారు చేసిన సినిమా అని నిర్మొహమాటంగా వేదికపై తన అభిప్రాయాలు చెప్పాడు. ఆ తర్వాత సహజంగానే గగ్గోలు చెలరేగింది. ఈ సినిమాను సమర్థించుకునే ప్రయత్నాలు జరిగాయి. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజం నోరు నొక్కడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని రా మాజీ అధినేత దుగ్గల్ కూడా చెప్పారు. ఇది ప్రాపగాండ సినిమా అన్నారు. కాని ఈ సినిమా ధియేటర్లలో గొప్పగా ఆడుతుంది. ముస్లిం విద్వేష నినాదాలు ధియేటర్లలో వినిపిస్తున్నాయి. ప్రధాని ఈ సినిమాను ప్రశంసించారు.

ముస్లిములను టెర్రరిస్టులుగా గెడ్డం, టోపీలతో చూపించే సినిమాలు కొత్త కాదు. కేరళ స్టోరీ అలాంటి మరో సినిమా. ఈ సినిమాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అమ్మాయిలను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేసి ఐసిస్ లో భర్తీ చేసి విదేశాలకు తరలిస్తున్నారన ఒక పుక్కిటి కథ ఈ సినిమా. ఇలాంటి మహిళలు ముప్పయిరెండు వేలమంది ఉన్నారని ఒక బురఖా తొడుక్కున్న మహిళ చెబుతున్న ట్రయిలర్ వచ్చింది. ఇది నిజం కాదని చాలా మంది స్పష్టమైన ఆధారాలతో మాట్లాడారు. ఇప్పుడు సినిమాల్లో ఇస్లామోఫోబియా కంటెంట్ ఉంటే చాలు హిట్టవుతుందనే ధోరణి ప్రబలింది.

ఇటీవల హిజాబ్ బ్యాన్ వార్తలు చాలా మంది చదివే ఉంటారు. దేశంలో ముస్లిం అమ్మాయిలు చదువుకోవాలంటే, వారికి ఇష్టమైన దుస్తులు ధరించి చదువుకోవడం కుదరని వాతావరణం సృష్టించారు. ముస్లిములను విలన్లుగా చూపించడానికి న్యూస్ మీడియాలో ఇప్పుడు సినిమా కూడా పోటీ పడుతుంది. కేరళ స్టోరీ వంటి సినిమాలు లవ్ జిహాద్ అనే కట్టుకథను ప్రజలు నమ్మే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. త్వరాలో రాబోతున్న మరో సినిమా హమ్ దో హమారే బారా. ముస్లిములు అధిక సంతానాన్ని కలిగి ఉంటారని, దేశంలో జనాభా పెరుగుదలకు ముస్లిములే కారణమని, వారి జనాభా శరవేగంగా పెరిగిపోతుందనే కట్టుకథ ప్రజలు నమ్మేలా చేసే సినిమా ఇది. నిజానికి ముస్లిముల జనాభా పెరుగుదల రేటు చాలా వేగంగా పడిపోతోంది, హిందువుల జనాభా పెరుగుదల రేటుతో పోల్చితే ముస్లిముల జనాభా పెరుగుదల రేటులో తగ్గుదల చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సినిమాలు సమాజంలో నేడు నెలకొన్న విద్వేష వాతావరణాన్ని పెంచుతున్నాయి.

మీడియా ద్వారా ప్రచారమవుతున్న ఇస్లామోఫోబియా, విద్వేష వాతావరణం దేశాన్ని ఎటు తీసుకుపోతుందన్నది సమాజశ్రేయోభిలాషులు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.