December 17, 2024

కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గతంలో టీడీపీ ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని అభిప్రాయపడింది.

మనదేశంలో రిజర్వేషన్ల మీద ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంటోంది. ఎవరో ఒకరు కోర్టుల ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ మీద చర్చ లేపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బ తింటోందని, క్రీమిలేయర్ విధానం తీసుకురావాలని ఇలా ఎన్నో వాదనలను, చర్చను లేవదీసే ప్రయత్నం న్యాయస్థానాల ద్వారా ముందుకు తెస్తున్నారు. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధమే అని ఇప్పుడు కేంద్రం తేల్చింది. ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం తేల్చి చెప్పింది. కొన్నినెలల క్రితం కాపు రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లో లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన జీవీఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, వారికి రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఏపీ జనాభాలో 18శాతం ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని రాష్ట్ర అభివృద్ధిలో కాపులు విశేషంగా కృషి చేశారని ఆయన చెప్పారు.  బ్రిటిష్ పాలనలో, 1915 జిఓ నెం.67 ప్రకారం కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారన్నారు. నిజానికి బ్రిటీషు కాలంలో ముస్లిములకు కూడా రిజర్వేషన్లు ఉండేవి. వాటిని తర్వాత రద్దు చేశారు. ఈ విషయం గురించి ఏ ఒక్క నేత కూడా మాట్లాడడం ఎన్నడూ జరగదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం మలుపు తిప్పవచ్చు. వ్యూహాత్మకంగానే బీజేపీ ఎం.పి. జివియల్ నరసింహరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశం రాష్ట్రపరిధిలోకి వస్తుందని కేంద్ర తేల్చి చెప్పిన తర్వాత రాజకీయంగా చంద్రబాబు, జగన్ ఇరకాటంలో పడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు ఇది మరింత ఇబ్బంది. ఎందుకంటే, అగ్రవర్ణ పేదలకు కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో ప్రకటించారు. దీంతో బీసీలు వైసీపీ వైపు వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని జగన్మోహన రెడ్డి కేంద్రం నిర్ణయానికి నెట్టేశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమించారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగలబెట్టే వరకు ఆ ఉద్యమం వెళ్ళింది. అప్పుడు బీసీ రిజర్వేషన్లపై మంజునాథ్ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అప్పటి నుంచే ఈ సమస్య కేంద్రం వద్ద పెండింగులోనే ఉంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ సమస్యను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు. గత ఎన్నికల్లో గెలుపోటములు కాపు రిజర్వేషన్ల సమస్యపైనే ఆధారపడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశం టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు కూడా ఇబ్బందికరమైన అంశమయ్యింది. అగ్రవర్ణ పేదలన్నది చాలా పెద్ద సముదాయం. ఇందులో బ్రాహ్మణులు మాత్రమే కాదు వైశ్యులు, రాజులు, కమ్మ, రెడ్డి తదితర కులాలు మాత్రమే కాదు ముస్లిములు కూడా ఈ పరిధిలోకి వస్తారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ సముదాయాలు కేవలం కాపులకు మాత్రమే 5 శాతం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తాయి. మరోవైపు బీసీలు కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై అభ్యంతరాలు చెబుతారు. ఇది రాజకీయంగా రెండు పార్టీలను ఇరుకున పెట్టిన అంశంగా మారుతుంది.

దేశంలో అనేక ప్రాంతాల్లో రిజర్వేషన్ల చిచ్చు రేగుతోంది. రిజర్వేషన్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించి రెండు కీలక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఆ రాష్ట్రంలో 76 శాతం రిజర్వేషన్లవుతాయి. చత్తీస్‌ గఢ్‌లో షెడ్యూల్‌ తెగలకు 32శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ఇతర వెనుకబడిన కులాలకు 27శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇక షెడ్యూల్‌ కులాలకు 13శాతం రిజర్వేషన్లను చత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం కల్పించింది. జనాభా ప్రాతిపదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతోంది. నిర్ధిష్టమైన సమాచారం లేకుండానే ఈ రిజర్వేషన్లు కల్పించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో చెప్పింది. సుమారు మూడేళ్ల కిందట రిజర్వేషన్ల వాటాను 82శాతానికి పెంచుతూ ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాజ్యాంగం విరుద్ధం అంటూ ఛత్తీస్‌గఢ్ హై కోర్టు వాటిని కొట్టి వేసింది. ఆ తరువాత పాత రిజర్వేషన్ వ్యవస్థను కూడా ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ ఈ ఏడాది సెప్టెంబరు 19న హై కోర్టు తీర్పునిచ్చింది. ఇలా రిజర్వేషన్లను కోర్టు నిలిపివేయడంతో ఇంజినీరింగ్, పాలిటెక్నికట్, బీఈడీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ వంటి కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఈ కోర్సులకు సంబంధించి సుమారు 46,500 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నిలిచి పోయింది. 12వేల టీచర్ల ఖాళీలు కూడా ఇందులో ఉన్నాయి. మెడికల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొందరు కోర్టుకు వెళ్లారు. ఆదివాసీలు ప్రతిరోజూ రిజర్వేషన్ల మీద నిరసనలకు దిగుతున్నారు. కొందరు రోడ్ల మీద రాకపోకలను అడ్డుకుంటూ ఉండే ఇంకొందరు ధర్నాలు చేస్తున్నారు. మరికొందరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ముఖ్యమంత్రి భూపేష్ బఘలే దిష్టిబొమ్మను తగులబెట్టారు.

రిజర్వేషన్ల కోసం అనేక వర్గాలు ఉద్యమిస్తూ వస్తున్నాయి. ఒబి.సి. రిజర్వేషన్ల కోసం జాట్ వర్గం ప్రారంభంచిన ఉద్యమం మూలంగా హర్యానా రణ రంగంగా మారింది. పోలీసుకాల్పుల్లో పది మంది వరకు మరణించటంతో సైన్యాన్ని దించి ఫ్లాగ్ మార్చ్ చేయిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు. గుజరాత్‌లో హర్దిక్ పటేల్ పటేల్ తమ వర్గాన్ని బి.సి జాబితలో చేర్చాలంటూ ఉద్యమం జరిపి  దేశ విద్రోహ నేరం కింద జైలుకు కూడా వెళ్ళాడు. రాజస్తాన్‌లో మీనాలు, జాట్‌లు బి.సి రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేశారు. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్, 2012లో రిజర్వేషన్లను 50శాతం నుంచి 58శాతానికి పెంచారు. ఇందుకోసం రిజర్వేషన్ల చట్టం-1994లోని సెక్షన్-4కు సవరణ చేశారు. ఎస్టీల రిజర్వేషన్ 20శాతం నుంచి 32శాతానికి పెంచగా ఎస్సీల రిజర్వేషన్ 16శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. ఓబీసీలకు ఉన్న 14శాతం రిజర్వేషన్‌ను అలాగే ఉంచారు. రమణ్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు హై కోర్టుకు వెళ్లారు. ఆ తరువాత 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఆగస్టు 15న కొత్త రిజర్వేషన్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త వ్యవస్థలో ఎస్సీల రిజర్వేషన్ 12శాతం నుంచి 13శాతానికి పెంచారు. ఓబీసీల రిజర్వేషన్ 14శాతం నుంచి 27శాతానికి తీసుకెళ్లారు. దీనికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10శాతం రిజర్వేషన్ కలుపుకొని ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం రిజర్వేషన్ల వాటా 82శాతానికి చేరింది. భూపేశ్ బఘేల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంతో కొత్త రిజర్వేషన్ల విధానాన్ని ఆపివేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత 2012లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని కూడా కోర్టు నిలిపి వేసింది. మరొక ఏడాదిలో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు రానున్నాయి. దీంతో రిజర్వేషన్ల సమస్య చుట్టూ రాజకీయ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సమస్యకు కారణం మీరంటే మీరు అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఒకరిని మరొకరు నిందించుకుంటున్నాయి.

తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6శాతంగా ఉన్న రిజర్వేషన్‌నే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా పెంచుతామంటూ సీఎం కేసీఆర్‌ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగా 2017లోనే రాష్ట్ర శాసనసభ, గిరిజన రిజర్వేషన్‌ పెంపు బిల్లునుఆమోదించి కేంద్రానికి పంపించింది. తెలంగాణ శాసన సభ అమోదించిన బిల్లులో 6 నుంచి 10 శాతానికి పెంచడంతోపాటు ముస్లింలకు అప్పటి దాకా ఉన్న 4 శాతం రిజర్వేషన్‌ను కూడా 12 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది. అయితే ఈ మొత్తం కలిపి 62 శాతానికి చేరడం, రిజర్వేషన్ల మొత్తం 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. మరోవైపు ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్‌పై గతంలోనే ఉన్నత న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు కావడంతో స్టే ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్ల వాటా 46 శాతం మాత్రమే అమల్లో ఉన్నట్లవుతోంది. తాజాగా ఎస్టీలకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్‌ను పెంచడం ద్వారా తిరిగి 50 శాతం కానుంది. దీంతో ఇప్పటికిప్పుడు న్యాయపరంగా కూడా అడ్డంకులు రావన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.

త‌మిళ‌నాడులో మొత్తం రిజ‌ర్వేష‌న్లు 1994లో 50 శాతాన్ని దాటి 69 శాతానికి పెరిగిపోయిన అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశీలించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 28ఏళ్ళుగా త‌మిళ‌ నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల్లోనే ఉన్నాయి. త‌మిళ‌నాడులో పెరిగిన రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చ‌డం ద్వారా కేంద్రం రాజ్యాంగ బ‌ద్ధ‌త క‌ల్పించింది. తమిళనాడు మాదిరి తెలంగాణలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని ప‌దేప‌దే తెలంగాణ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలోను ఇదేసమస్య. నిజానికి 50 శాతం రిజర్వేషన్లను మించి అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లున్నాయి. హర్యానాలో 70 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా 68 శాతం రిజర్వేషన్లున్నాయి. ఝార్ఖండ్ లో 60 శాతం, రాజస్థాన్ లో 54 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం, తెలంగాణాలో 50 శాతం, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో ఎస్టీలకు 80 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

కేసీఆర్ చేసిన గిరిజన రిజర్వేషన్ పెంపు ప్రకటనపై ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల్లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ లంబాడాలు సంబురాలు జరుపుకుంటుంటే మరోపక్క ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. రిజర్వేషన్‌ పెంపు ప్రకటనను తుడుం దెబ్బ నాయకులు ఖండిస్తున్నారు. ఆదివాసుల పొట్టకొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమానికి నడుం బిగించారు.

ఇటీవల ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీయాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొలబద్ధను వినియోగించడం న్యాయసమ్మతమేనన్న విషయంలో న్యాయ మూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయ మూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయబద్ధతను తిరస్కరించారు. ఈ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సీపీఎం ఆహ్వానించింది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శాతం రిజర్వేషన్లు కల్పించినపుడు సీపీఐ(ఎం) సమర్థిం చింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెంటులో 103 రాజ్యాంగ సవరణను సమర్థించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించి పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లను సమర్థించిన తర్వాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని ఇందులో 27 శాతం ఓబిసీలకు, 15 శాతం షెడ్యూల్డ్ కులాలకు, 7.5 శాతం షెడ్యూల్డ్ తెగలకు వర్తిస్తాయని, ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు కల్సిస్తున్న 10 శాతం రిజర్వేషన్లు ఓబిసీల రిజర్వేషన్లను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. దాంతోపాటు ఆయన కులాలవారి జనగణన చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఒకే పార్టీలో కూడా వివిధ నేతలు వేరువేరుగా మాట్లాడడం వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోను, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లోను ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ తీర్పును స్వాగతించారు. కాని తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యులు ఈ తీర్పు పట్ల అంత సంతృప్తి కలిగి లేరు. ఢిల్లీకి చెందిన కాంగ్రెసు నాయకుడు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు సుప్రీంకోర్టు అగ్రవర్ణ మనస్తత్వాన్ని ప్రదర్శించిందని కూడా వ్యాఖ్యానించారు. శివగంగ నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు చిదంబరం ఈ తీర్పును స్వాగతించలేమని అన్నారు. తమిళనాడుకు చెందిన మరో కాంగ్రెసు ఎం.పీ జోతిమణి మాట్లాడుతూ సామాజిక న్యాయ పోరాటానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగా వర్ణించారు. తమిళనాడులో డిఎంకే పార్టీ ఈ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడులో డిఎంక, కాంగ్రెసు పార్టీలు రెండు కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. కాని కాంగ్రెసులో ఇతర నేతలు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. లోక్ సభలో కాంగ్రేసుకు 53 మంది సభ్యులున్నారు. ఇందులో 8 మంది తమిళనాడుకు చెందినవారు. తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కాంగ్రెసు పార్టీలో జైరాంరమేష్ వంటి నేతలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన క్రెడిట్ తమదే అని చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ప్రక్రియ వల్లనే నేడు ఈ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన కమీషన్ 2010లో తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత అనేక చర్చలు జరిగాయి. చివరకు 2014లో బిల్లు సిద్ధమయ్యిందని జైరాంరమేష్ అన్నారు. కాని మోడీ ప్రభుత్వం ఈ చట్టం చేయడానికి ఐదేళ్ళ సమయం తీసుకుందని తప్పుపట్టారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ప్రధాని నరేంద్రమోడీ గారి గరీబ్ కల్యాణ్ సాధించిన విజయంగా బీజేపీ నేతలు చెప్పుకున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెసు నేతలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. పత్రికలు సంపాదకీయాలు రాశాయి.

8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారి లెక్కలు చూస్తే దేశంలో దాదాపు 95 శాతం ప్రజలు ఈ ఆదాయపరిమితి పరిధిలోకి వస్తారు. అంతేకాదు, ఏడాదికి 8 లక్షలు సంపాదించే కుటుంబం జాతీయ సగటు కన్నా కాస్త పైస్థాయిలో ఉన్నట్లే అని కూడా చాలా మంది పేర్కొన్నారు. అలాగే దేశంలోని భూయాజమాన్యం లెక్కలు చూస్తే దాదాపు 86 శాతం మంది ఐదెకరాల కన్నా తక్కువ కలిగిన వారు. అలాగే దేశంలో 80 శాతం వరకు ప్రజలు 500 గజాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్లలోనే నివసిస్తున్నారు. కాబట్టి అగ్రవర్ణ పేదలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించడమంటే ఇతర రిజర్వేషన్ సౌకర్యాలున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసి వర్గాల్లోని పేదలకు ఇవి వర్తించవు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 23 శాతం. ఓబీసీ జనాభా 40 నుంచి 50 శాతం ఉంటుంది. అంటే ఈ ప్రజల్లో పేదలెవ్వరు అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో భాగం పొందలేరు. నిజానికి ఈ వర్గాల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ మౌలిక స్వభావం మారింది. పేదరికం ఆధారంగా కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించే కొత్త మార్పు ఇది. ఏది ఏమైనా చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పును స్వాగతించాయి. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మజ్లిస్, డిఎంకే పార్టీలు మాత్రమే పార్లమెంటులో వ్యతిరేకించాయి. విచిత్రమేమిటంటే కులప్రాతిపదికన రిజర్వేషన్లను సైద్ధాంతికంగా కోరుకునే పార్టీలు కూడా ఈ రిజర్వేషన్లను సమర్థించాయి. 2019లో బహుజనసమాజ్ పార్టీ ఈ నిర్ణయాన్ని సమర్థించింది. సమాజవాది పార్టీ, జనతాదళ్ యునైటెడ్ వగైరా పార్టీలు కూడా దీన్ని సమర్థించాయి. దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలవుతున్నాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో రిజర్వేషన్లు ఎన్నడూ భాగం కాదు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని పారద్రోలడానికి ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. రిజర్వేషన్ల ఉద్దేశ్యం వేరు. వివక్ష కారణంగా వెనుకబడిన సముదాయాల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి. రిజర్వేషన్లు ఇంతవరకు కులప్రాతిపదికన ఉండేవి. ఇప్పుడు కుటుంబ ఆర్థిక స్థితి కొత్త ప్రాతిపదికగా వచ్చి చేరింది. కులప్రాతిపదికన ఇస్తున్నరిజర్వేషన్లపై వీటి ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటే ఈ పదిశాతం రిజర్వేషన్లు జనరల్ కోటా నుంచి కేటాయిస్తామంటున్నారు. కాని జనరల్ కోటా నుంచి పదిశాతం అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించడం వల్ల జరిగేదేమిటి? నిజానికి అగ్రవర్ణ ప్రాతినిథ్యం ప్రభుత్వ ఉద్యోగాల్లోను, విద్యాసంస్థల్లోను వారి జనాభాశాతానికి మించి ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు 8 లక్షల ఆర్థిక పరిమితితో అగ్రవర్ణ పేదలకు కేటాయించిన రిజర్వేషన్లు ఈ సముదాయాల్లోని మధ్యతరగతికి ఉపయోగపడడం వల్ల వాటి ప్రాతనిథ్యం పెరుగుతుంది. అయినప్పటికీ మండల్ పార్టీలుగా, అంబేద్కర్ పార్టీలుగా పేరుపడిన వారు కూడా వీటికి మద్దతిస్తున్నారు.

తొంభయ్యవ దశకంలో మండల్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఓబిసిలకు రిజర్వేషన్ల సమస్య ముందుకు వచ్చింది. మండల్ పార్టీలు, అంబేద్కర్ పార్టీలు ముందుకు వచ్చాయి. కులప్రాతిపదికన రాజకీయ సమీకరణాలు కూడా ప్రారంభమయ్యాయి. కాని ఇప్పుడు ఈ పార్టీలు కూడా పదిశాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పక్షాన ఉన్నాయంటే దేశంలో మారుతున్న రాజకీయ కథనానికి ఇది నిదర్శనం. ఉదాహరణకు ఈ తీర్పు తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆర్థికంగా బలహీనవర్గాలకు రాష్ట్రీయ జనతాదళ్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని ప్రచారం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు అగ్రవర్ణాల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడుతున్నారు. వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ డ్యామేజీ కంట్రోల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పట్ల తమకు అప్పుడు కాని, ఇప్పుడు కాని అభ్యంతరం లేదని ప్రకటించింది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని వెనుకబడిన వర్గాల పార్టీగా నడిపించారు. కాని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీని ఆర్థిక పురోగతి కోసం పనిచేసే పార్టీగా ప్రజల్లో గుర్తింపు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. సామాజిక న్యాయం దశ ఇప్పుడు రాజకీయాల్లో లేదని తేజస్వీ ఒకసారి చెప్పారు. తొంభయ్యవ దశకం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో మండల్, కమండల్ రాజకీయాలు హోరాహోరిగా సాగాయి. కాని తర్వాత మండల్ రాజకీయాలు నిర్విర్యమైపోయాయి. ఇప్పుడు కేవలం కమండల్ రాజకీయాలే ఎన్నికల్లో ఉపయోగపడే పరిస్థితులున్నాయి. మండల్ పార్టీల ఓట్లను బీజేపీ కొల్లగొట్టింది. ఒక్క తమిళనాడులో మాత్రమే బీజేపీకి ఈ విషయంలో ప్రతిఘటన ఉంది. మరెక్కడా లేదు. ఒకప్పుడు కాంగ్రెసు బలంగా ఉండేది. దళితులు, బలహీనవర్గాలతో పాటు అగ్రవర్ణ హిందువులు కూడా కాంగ్రెసుతో ఉండేవారు. మైనారిటీలు కూడా కాంగ్రెసుపక్షాన ఉండేవారు. మండల్ రాజకీయాల తర్వాత కాంగ్రెసు దళిత బలహీనవర్గాల ఓట్లను మండల్ పార్టీలకు కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెసు స్థానంలో బీజేపీ దళిత, బలహీనవర్గు, అగ్రవర్ణాలు అందరి పార్టీగా మారింది. ఒక్క మైనారిటీ ఓట్లు తప్ప. కులరాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లింది. తమిళనాడులో కూడా స్టాలిన్ భాషా ప్రాతిపదికన కమండల్ రాజకీయాలను ఎదిరిస్తున్నారే కాని కులరాజకీయాలు కాదని గుర్తించాలి.

సుప్రీంకోర్టు తీర్పు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశం. పాటిదార్లు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. 2015లో పాటిదార్ అనామత్ అందోళన ద్వారానే హార్తిక్ పటేల్ రాజకీయాల్లోకి వచ్చాడు. పాటిదార్ ఆందోళనకు ముందు రాజస్థాన్ లో గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. గుజరాత్ లో పాటిదార్లు 20 శాతం ఉన్నారు. 1995 నుంచి 2017 వరకు గుజరాత్ లో బీజేపీ గెలుపు వెనుక పాటిదార్లే ఉన్నారు. పాటిదార్ల రిజర్వేషన్ల సమస్య తర్వాత సౌరాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ తర్వాత బీజేపీ పాటిదార్లను బుజ్జగించడం ప్రారంభించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాటిదార్లు బీజేపీ కి పూర్తి మద్దతు ఇస్తారు. హార్దిక్ పటేల్ కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మహారాష్ట్రలో కూడా రాజకీయాలు మారుతున్నాయి. మరాఠాలు రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో మరాఠాలతో పాటు ముస్లిములకు కూడా రిజర్వేషన్ల హక్కు లభించింది. అనేక అసమానతలతో కూడిన భారత్ లో రిజర్వేషన్లకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. భారతదేశ చరిత్రలో అసమానతను సమాధి చేస్తూ సమానతకి_పునాది వేసి ఛత్రపతి సాహు మహారాజ్ తొలిసారిగా 1902 జులై 26 న వెనుకబడిన వర్గాల వారికి తన కొల్హాపూర్ సంస్థానంలో విద్య ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసాడు. బ్రిటీషు కాలంలోను రిజర్వేషన్లు ఉన్నాయి. 1909లో బ్రిటీషు రాజ్ రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. 1932లో బ్రిటీషు వారు కమ్యునల్ అవార్డు ప్రకటించారు. ఇవి కూడా రాజకీయ రిజర్వేషన్లు. ముస్లిములకు, సిక్కులకు, భారత క్రయిస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కల్పించిన రిజర్వేస్లు ఇవి.

ఆ తర్వాత భారతదేశం స్వతంత్రం పొందింది. యస్సీ, యస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు కాని బ్రిటీషువారు ముస్లిములకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేశారు. తర్వాత మండల్ కమీషన్ వచ్చింది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయి. కాని ఎవ్వరు ముస్లిముల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇందులో ముస్లిములకు కూడా అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కాని ఎంతవరకు ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయో వేచి చూడాలి. కాని ఒకటి మాత్రం నిజం భారతదేశంలో రిజర్వేషన్ల స్వరూప స్వభావాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి

ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం కుంపట్లు రేపుతోంది. వివిధ సామాజిక వర్గాల మధ్య మనస్పర్థలకూ కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం ఎలాంటి రాజకీయ మలుపులకు కారణమవుతుందో వేచి చూడాలి.