December 21, 2024

మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుపొందిన విద్యాసంస్థ. ఆ సంస్థకు సంబంధించిన ఒక వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఒక విద్యార్థి తన అధ్యాపకునితో వాదిస్తున్న దృశ్యం ఉంది. ఇస్లామోఫోబియా, మతతత్వం మామూలైపోయిన ప్రస్తుత కాలంలో ఈ వీడియో అనేక నిజాలను ఆవిష్కరిస్తోంది.

ఈ వీడియోలో ఉన్న విద్యార్థి ముస్లిం. అధ్యాపకుడు ఆ విద్యార్థిని ’కసబ్‘ అని సంబోధించినట్లు తెలుస్తోంది. ఈ కుళ్ళుజోక్ ను ఆ విద్యార్థి స్వీకరించడానికి సిద్ధపడలేదు. అధ్యాపకుడిని నిలదీశాడు. తాను ఒక ముస్లిం అయినందుకు తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అవమానకరమైన జోకులు వేయడం తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పాడు. ఆ విద్యార్థి మాట్లాడుతున్నప్పుడు బహుశా పక్కన ఉన్నవారు వీడియో తీసినట్లున్నారు. అంతకు ముందు అధ్యాపకుడు ఏం చెప్పాడన్నది వీడియోలో లేదు. ఆ విద్యార్థి చాలా స్పష్టంగా తన మాటలు చెప్పాడు. తనకు తరగతిలో ఎవరైనా మద్దతుకు వస్తారేమో అని ఎదురుచూడలేదు. నిజానికి ఎవరూ మద్దతుగా నిలబడనూ లేదు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, ఎవరూ ఆ విద్యార్థిని మాట్లాడకుండా అడ్డుకోవడం కూడా జరగలేదు. తాను ముస్లిం అయితే తనను ఒక టెర్రరిస్టు పేరుతో ఎలా పిలుస్తారని అతను నిలదీశాడు. చివరకు తన తండ్రి అయినా సరే ఇలా తన గురించి మాట్లాడితే తాను సహించలేనని అన్నాడు. ఈ మాటలు అతను చెబుతున్నప్పుడు క్లాసులో మిగిలిన విద్యార్థులు నవ్వుతున్న శబ్దం వినిపించింది. అధ్యాపకుడు తానేదో సరదాకు చెప్పానని అన్నప్పుడు ఆ విద్యార్థి తీవ్రంగా ఖండించాడు. ముంబయి దాడులు సరదా కాదు, ఈ దేశంలో ముస్లింగా ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం సరదా కాదు. సరదాకు అన్నానని చెప్పడం బాగాలేదని అన్నాడు.  చివరకు అధ్యాపకుడు సారీ చెప్పినా, విద్యార్థి మాత్రం మరో నిజాన్ని చెప్పకుండా ఆగలేదు. మీరు సారీ చెబితే ఏమిటి? మీరెలా ఆలోచిస్తున్నారన్నది మీ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది కదా అని నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

ఆ విద్యార్థి భయపడలేదు. తాను ముస్లింగా తన గుర్తింపును దాచుకోనూ లేదు. కసబ్ అని తనను పిలిస్తే సిగ్గుతో చితికపోనూ లేదు. తాను చెప్పవలసిన జవాబు స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి సంఘటనలు చాలా మంది ముస్లిములు చాలా సందర్భాల్లో ఎదుర్కుంటున్నవే. సరదాగానో, జోకు పేరుతోనో ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు వినడం మామూలైపోయింది. ఇలాంటి జోకులను ఇప్పుడెవరు పట్టించుకోవడం కూడా లేదు. ముస్లిం పిల్లలు విద్యాసంస్థల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నిత్యకృత్యంగా మారింది. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు పిల్లలు ఎప్పుడైనా బాధపడితే తల్లిదండ్రులు వారికి నచ్చచెప్పడం, అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దని చెప్పడం కూడా మామూలే. ఇదే దేశంలో ముస్లిములు ఎదుర్కుంటున్న పరిస్థితి. చాలా మంది క్రయిస్తవులకు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు. ఈ వీడియో చాలా మంది ముస్లిములకు తాము ఎదుర్కున్న ఇలాంటి అనుభవాలను గుర్తు చేస్తోంది. ముస్లిములంతా తిరకాసు, అన్ని వ్యతిరేకంగా చేస్తుంటారన్న వ్యాఖ్య చాలా మంది వినే ఉంటారు. నిజానికి ముస్లిములు చేస్తున్న దానికి తిరకాసుగా వ్యతిరేకంగా మీరు చేస్తున్నారనే ఆలోచన రాదు. ఇలాంటి వ్యాఖ్యలను సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. అనవసరంగా చిన్న మాటను పెద్ద రాద్దాంతం చేయడం దేనికని అనుకుంటారు. కాని ఇవే చిన్న చిన్న విషయాలు, మనస్తత్వాలు దేశంలో మతతత్వ వాతావరణానికి కారణమయ్యాయి.

కెనడాలో నలుగురు ముస్లిం కెనడియన్ వ్యక్తుల హత్య తర్వాత అక్కడి ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెప్పిన మాటలు ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన జీవితాల్లో సర్వసాధారణమైపోయిన ఇస్లామోఫోబియా వల్లనే ఈ హత్యలు జరిగాయని ట్రూడో నిర్మొహమాటంగా చెప్పారు. ఈ మాటలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చెప్పారు. హత్యలను ఖండించడానికి, ముస్లిములకు సంఘీభావం ప్రకటించడానికి నిర్వహించిన ప్రత్యేక పార్లమెంటరీ సమావేశం అది. కెనడా పార్లమెంటు కూడా నిజమే అని ఒప్పుకుంది. ఇలాంటి దృశ్యం మనం ఇక్కడ ఊహించగలమా? ఇక్కడ ఎన్ని మూకహత్యలు జరగలేదు.

మణిపాల్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాని వీడియో బయటకు వచ్చిన తర్వాత అక్కడి అధికారులు ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తామని, ఆ అధ్యాపకుడిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థికి కౌన్సెలింగ్ అంటే అర్థమేమిటో తెలియదు. కాని ఆ ముస్లిం విద్యార్థి తన గుర్తింపు విషయంలోను, ఒక ముస్లింగా తనకు లభించవలసిన సమానగౌరవమర్యాదల విషయంలోను రాజీ పడేది లేదని స్పష్టంగా ప్రకటించడం ద్వారా తన విధి నిర్వర్తించాడు. అందరికీ సమాన గౌరవాదరాలు, సమాన మర్యాద, సమానహక్కులు, సుహృద్భావ శాంతియుత సహజీవన విలువలను నిలబెట్టడానికి సమాజం ఎంత వరకు తన విధి బాధ్యతలు నిర్వర్తిస్తుందో వేచి చూడాలి.