April 24, 2024

ఇటీవల వచ్చిన రెండు వార్తలు దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆ రెండు వార్తల్లో మొదటిది, ప్రముఖ గాయకుడు షాన్ గా పిలువబడే శంతను ముఖర్జీకి సంబంధించింది. ఆయన ఒక హిందువు. కాని ఆయన్ను అభిమానించే వారిలో అన్ని మతాల వారు ఉన్నారు. ఇటీవల ఈద్ పండగ తర్వాత ఆయన ఈద్ శుభాకాంక్షలు తన ఇన్ స్టాగ్రాం పోస్టులో పెట్టాడు. మూడేళ్ళ క్రితం తీసిన ఒక మ్యూజిక్ వీడియోలో స్క్రీన్ షాట్ ను దానికి జత కలిపాడు. ఆ ఫోటోలో ఆయన తలపై ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు. ఈద్ శుభాకాంక్షలు చెప్పడం, అది కూడా తలపై టోపీతో శుభాకాంక్షలు చెప్పడం మతతత్వ శక్తులకు నచ్చలేదు. ఆయనపై దాడులు మొదలయ్యాయి. దారుణమైన ట్రోలింగ్ మొదలయ్యింది.

ఈ ట్రోల్స్ కు షాన్ జవాబిచ్చాడు. ఈద్ శుభాకాంక్షలకు తగిన ఫొటో అనిపించింది కాబట్టి తన మ్యూజిక్ వీడియో నుంచి ఆ ఫోటో తీసి పెట్టానని చెప్పాడు. తాను అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్ళినప్పుడు తలపై కప్పుకుని వెళ్ళానని, అప్పుడు కూడా ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశానని, అలాగే రామనవమి శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా తగిన ఫోటో పెట్టానని అప్పుడు లేని అభ్యంతరాలు, అప్పుడు లేని విమర్శలు ఇప్పుడెందుకు వస్తున్నాయని నిలదీశాడు. ఈద్ శుభాకాంక్షలు చెబితే తప్పేమిటని ప్రశ్నించాడు. ఈద్ శుభాకంక్షలు చెప్పడమే తప్పయిపోయిందా?

ఇక రెండవ వార్త

ఈ వార్త త్రిపుర నుంచి వచ్చింది. బీజేపీ నేతలు ఒక యువకుడిని చావబాదుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఎందుకు ఆ యువకుడిని కొట్టారంటే, కారణం భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు చక్కని ఉదాహరణ.

ఆ యువకుడి పేరు బపన్ నంది. పేరును బట్టి తెలుస్తుంది ఆయన హిందువు అని. ఉదయ్ పూర్ కు చెందిన బపన్ నంది కంటెంట్ రైటర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. అతని వీడియో బ్లాగులు చాలా మంది మెచ్చుకుంటారు. బపన్ నంది అనేక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. సామాజిక చైతన్యం ప్రధానంగా తీసిన వీడియోలు కూడా పెడుతుంటాడు. ఇటీవల ఈద్ పండగ సందర్భంగా 4 నిముషాల వీడియో తీసి పెట్టాడు. ఈద్ పండుగ గురించి ఒక పాటతో పాటు ఈద్ శుభాకాంక్షలు చెప్పిన వీడియో అది. ఈ వీడియో చూసి బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారట.

స్థానిక బీజేపీ నాయకుడు, పంచాయతి ఉప ప్రధాన్ అను మురా సింగ్ ఈ యువకుడిని రమ్మని తన వద్దకు పిలిచాడు. బపన్ నంది రాగానే అతడిని పట్టుకుని చావబాదడం మొదలు పెట్టారు. ఒక మహిళా బీజేపీ నేత అతడి షర్టు పట్టుకుని లాగి చింపేసిందని కూడా తెలుస్తోంది. వీడియోలో ఒక ముస్లిం యువకుడిగా నటించి హిందూమతానికి కళంకం తెస్తావా అని ఆమె మండిపడిందట. తనను వదిలిపెట్టమని ఆ యువకుడు ఎంత వేడుకున్నా వాళ్ళు కనికరించలేదు. చావగొట్టి, ఇదంతా వీడియో కూడా తీశారు. అంతటితో ఆగలేదు, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పట్టుకువెళ్ళి ప్రశ్నించడం మొదలయ్యింది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు ఈ సంఘటనపై మండిపడడం కూడా ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ మాదిరి పరిస్థితులు త్రిపురలో కూడా వచ్చాయని చాలా మంది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సంఘటన తర్వాత బపన్ నంది తనపై దాడి చేసినవారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు కొత్తేమి కాదని సిపిఎం నేత, శాసనసభ్యుడు జితేంద్ర చౌదరీ అన్నారు.

మనం ఎలాంటి సమాజంలో నివసిస్తున్నామన్నది ఇప్పుడు ఆలోచించవలసిన ప్రశ్న.

తన ఈద్ శుభాకాంక్షల సందేశంపై మతతత్వ శక్తుల వ్యాఖ్యల తర్వాత గాయకుడు షాన్ చెప్పిన మాటలు ఇక్కడ గమనార్హమైనవి. ఆయనేమన్నాడంటే –

‘‘చిన్నప్పటి నుంచి నాకు మా పెద్దలు అన్ని మతాలను గౌరవించడం నేర్పారు. అన్ని పండుగలను గౌరవించడం నేర్పారు. అదే నేను నమ్ముతున్నాను. అదే ఎప్పుడూ చేస్తాను. ప్రతి భారతీయుడు ఇలాగే ఆలోచించాలని అనుకుంటున్నాను. నేను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడినైనా, మొదట నేను భారతీయుడిని. అందుకే నేను ప్రతి పండుగలో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను’’ అన్నాడు.

అన్ని మతాలను గౌరవించాలని పిల్లలకు చెప్పే పెద్దలు, తల్లిదండ్రులు సమాజంలో ఉంటే మతవిద్వేషాలకు చోటు ఉండదు. అలాంటి సమాజాన్ని నిర్మించుకుందాం.