June 9, 2024

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.  భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, సరఫరాపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. గతంలో వచ్చిన కరోనా వేవ్ లో ఆక్సిజన్ లభ్యత లేక, సరఫరా కొరత కారణంగా ఆసుపత్రుల్లో ఎంతో మంది కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు.

చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికులకు ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ అని తెలితే, వారిని క్వారంటైన్ కు తరలించాలని కేంద్ర మంత్రి కీలక సూచనలు చేశారు. దేశ‌వ్యాప్తంగా హాస్పిట‌ళ్లలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒక‌వేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి హాస్పిట‌ళ్లు అన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారికంగా డిసెంబర్ 20న మూడు కేసులను గుర్తించగా, డిసెంబర్ 26న 12 కేసులు నమోదయ్యాయి.  అవన్నీ హైదరాబాద్‌లో గుర్తించినవే. హైదరాబాద్‌లోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది.

కోవిడ్-19 భయాందోళనల మధ్య, భారత ప్రభుత్వం 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించిందని పేర్కొంటూ వైరల్ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ వార్తలలో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొంది ఇవన్నీ పుకార్లేనని, ప్రభుత్వం అటువంటి చర్యల దిశగా ఆలోచనలు చేయడం లేదని పేర్కొంది.

కరోనా పుట్టిల్లు చైనాలో మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. మూడేళ్లుగా జీరో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తోన్న పొరుగు దేశం.. అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తేసి ఎటువంటి కట్టడి చర్యలు అమలు చేయడం లేదు. దీంతో వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తోంది. చైనాలో మొత్తం నాలుగు వేరియంట్‌లు వ్యాప్తిలో ఉన్నాయని కేంద్ర కోవిడ్ ప్యానెల్ చీఫ్ ఎన్‌కే అరోరా అన్నారు. చైనాలో డిసెంబరు నెల మొదటి 20 రోజుల్లో 248 మిలియన్ల మంది లేదా జనాభాలో దాదాపు 18 శాతం మందికి వైరస్ సోకినట్టు చైనా జాతీయ హెల్త్ కమిషన్ సమావేశంలో అంచనాకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అలాగే చైనా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని, పిట్టల్లా జనం రాలిపోతున్నారనే వార్తలు కూడా కనిపించాయి. కాని బిబిసీ వెబ్ సైటులో వచ్చిన కథనం ప్రకారం అధికారికంగా డిసెంబరు 21 వరకు చైనాలో ఏడు కోవిడ్ మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అయితే చైనా అనేక విషయాలను దాచి పెడుతుంది కాబట్టి అధికారికంగా చైనా చెప్పిన మాటలను నమ్మలేం అంటున్నారు. షాంఘైలో 2,30,000 ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉంచినట్లు వార్త.

ఇండియాటుడే పత్రిక ప్రతినిధి చైనాలో ఉంటున్న డా.అభిషేక్ కుందుతో మాట్లాడారు. కోవిడ్ ఆంక్షలను చైనా ఎత్తేసిన తర్వాత టెస్టులు కూడా తగ్గిపోయాయి. చైనాలో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ గురించి ఆయన మాట్లాడుతూ చాలా త్వరితగతిన విస్తరిస్తుంది కాని మరణాలు తక్కువే అన్నారు.

చైనాలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేశారు. దానివల్ల కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ కు గురికాని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే సహజంగా కోవిడ్ వైరస్ ను తట్టుకునే శక్తి చాలా మందికి లభించలేదు. హఠాత్తుగా కోవిడ్ ఆంక్షలను ఎత్తేయడం వల్ల ఇలాంటి వారందరు వైరస్ బారిన పడుతున్నారని ఒక విశ్లేషణ వచ్చింది. కాని మరోవైపు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో భయంకరమైన పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హఠాత్తుగా దేశంలో కోవిడ్ పై చర్చ ఎక్కువయ్యింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సూఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి రాసిన లేఖ చర్చనీయాంశం అయ్యింది. భారత్ జోడో యాత్రలో కరోనా ప్రొటోకాల్ పాటించాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. గుజరాత్ లో ప్రధాని మోదీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం, రాజస్థాన్ లో బీజేపీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ యాత్ర గురించి రాహుల్ గాంధీ లేవనెత్తారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీ యాత్రలను నిర్వహిస్తోందని… కానీ కేంద్ర ఆరోగ్యమంత్రి మాత్రం తమకే లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు.  నిజానికి బీజేపీ కూడా యాత్రలు చేస్తోంది. రాజస్థాన్ లో బీజేపీ నేతలు చేపట్టిన జన్ ఆక్రోశ్ యాత్రను కరోనా కారణంగా రద్దు చేసినట్లు తెలిపిన నాయకులు గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపారు. రాజస్థాన్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో డిసెంబర్ 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు. తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున యాత్రను రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. బీజేపీకి ప్రజలే ముఖ్యం అని, ఆ తర్వాతే రాజకీయాలు.. ప్రజల భద్రత వారి ఆరోగ్యమే తమ ప్రాధాన్యం అని వివరించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా మాట్లాడుతూ యాత్రను రద్దు చేయట్లేదని వెల్లడించారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ముగిసింది. తమ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి భయపడి ఆ యాత్రను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి.. బీజేపీ ఓర్వలేకపోతోందని.. అందుకే కోవిడ్ పేరుచెప్పి.. అడ్డుకునేందుకు చూస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఎందుకు రోడ్‌షోలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతోంది. అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ భారీ ర్యాలీ నిర్వహించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టుతోంది. మీ నేతలకు చెప్పి.. ఆ తర్వాత మా గురించి మాట్లాడాలని చురకలంటించింది.

రాజస్థాన్ లో దేశంలోనే ప్రముఖ ఆర్థిక నిపుణుడు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ స్వయంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని నడిచారు. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలను ఆయన తూర్పారపట్టారు. ఈ యాత్ర రాహుల్ కు కాంగ్రెస్ కు మేలు చేస్తుందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు కుట్ర పన్నుతోందని. అందుకే సడెన్ గా కోవిడ్ నిబంధనలు తెరపైకి తెచ్చిందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండ‌వీయ రాసిన‌ లేఖపై మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న భారీ స్పంద‌న నేప‌థ్యంలోనే యాత్ర‌ను ఆపివేయ‌డానికి ఇలా కేంద్రం క‌రోనా వైర‌స్ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చింద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. కుట్రతోనే ‘కోవిడ్ -19′ వైరస్ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది” అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మూడేళ్ల క్రితం కరోనా వినాశనం సృష్టించినప్పుడు, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుజ‌రాత్ కు ఆహ్వానించి, అతని గౌరవార్థం లక్షలాది మందిని సమీకరించింది మీరే’ అని కేంద్రంలోని బీజేపీ తీరును సామ్నా సంపాదకీయం ఎండ‌గ‌ట్టింది. భారత్ జోడోలో భారీ సంఖ్యలో  ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తుండ‌టంతో మోడీ ప్రభుత్వం భయపడినందునే ఈ లేఖ రాశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆరోపించింది. త్రిపురలో ప్రధాని మోడీ ర్యాలీలు నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కూడా పశ్చిమ బెంగాల్లో ప్రధాని భారీ ర్యాలీలు నిర్వహించారని అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు.

కరోనా రెండు అలలు దేశాన్ని కుదిపేశాయి. రెండవ అల వచ్చినప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంధ్రప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. మొదటి లాక్ డౌన్ విధించిన పద్ధతిని తుగ్లక్ లాక్ డౌన్ అన్నారు. చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం వంటి వ్యూహాలను విమర్శించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ మన దేశాన్ని వణికించింది. అంతకు ముందు  తీవ్ర లాక్ డౌన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రపంచలో అత్యంత కఠినంగా లాక్ డౌన్ అమలైన దేశాల్లో భారత్ కూడా ఉంది. అసంఖ్యాకంగా వలసకూలీలు కాలినడకన ఇంటిముఖం పట్టారు. వారి విషాదగాధలు అందరినీ కలిచి వేశాయి. కరోనా మొదటిసారిగా డిసెంబర్‌ 8వ తేదీ 2019లో చైనాలో గుర్తించబడింది. కోవిడ్‌ 19 వైరస్‌ అతికొద్ది కాలంలోనే ప్రపంచమంతా పాకింది. మనదేశంలో 2020 జనవరి 30న తొలిగా గుర్తించబడింది. అతికొద్ది కాలంలోనే దేశమంతా విపరీతంగా విస్తరిస్తూ రోజుకు సుమారుగా రెండు లక్షల మందికి సోకే స్థాయికి చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్దం ముగిసిందంటూ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ కుదుపు ప్రారంభం అయ్యింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదటివేవ్ కాలంలో కూడా తబ్లీగీ జమాఅత్ వల్లనే ఇదంతా జరిగిందనే ప్రచారం మొదలైంది. కరోనాకు మతతత్వ రంగు పులిమే ప్రయత్నాలు జరిగాయి. రెండవ వేవ్ కాలంలో కుంభమేళా జరిగింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం అనేకవిధాలుగా విఫలమైంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో అనుమతించకుండా కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది. వ్యాక్సిన్లు కొరత మొదలయ్యాక విదేశాలకు అనుమతిచ్చినా వెంటనే స్టాక్‌ రాలేదు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతుందని ఎప్పుడైతే గుర్తించారో అప్పుడే ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇచ్చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం, పోలింగ్ పేరుతో విచ్చలవిడిగా జనం రోడ్లపైకి రావడం మొదలుపెట్టేశారు. ఉపఎన్నికల్లో సైతం విపరీతమైన కరోనా కేసులు వెలుగుచూశాయి. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్‌లకు దాదాపు 1.3 లక్షల మందిని అనుమతించారు. దీంతో అక్కడ భారీగా కేసులు రావడం మొదలుపెట్టాయి. సెకండ్‌ వేవ్ ఉందని తెలిసీ లెక్క చేయకుండా కుంభమేళాకు అనుమతులివ్వడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో సమర్దించాయి. గత సంవత్సరం జనవరిలో, కరోనా మహమ్మారిపై విజయం సాధించామని మోడీ ప్రకటించారు. జనవరి 29న దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో మోడీ ప్రసంగిస్తూ, కరోనాపై భారత్‌ సాధించిన పురోగతిని ప్రశంసించారు. భారత్‌ కోవిడ్‌ను సమర్ధవంతంగా కట్టడి చేయడం ద్వారా విపత్తు నుండి ప్రపంచాన్ని కాపాడిందని అన్నారు. ”ఇప్పటి వరకు, భారత్‌లో తయారైన రెండు వ్యాక్సిన్లు వున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయి. దీనివల్ల మనం ఇతర దేశాలకూ వేగంగా, పెద్ద ఎత్తున సాయపడగలుగుతాం.” అని మోడీ ప్రకటించారు.  గత సంవత్సరం ఫిబ్రవరిలో, కోవిడ్‌ పై భారత్‌ సాగించిన పోరాటంతో ప్రపంచ దేశాలు స్ఫూర్తి పొందాయన్నారు. మార్చి 11న జరిగిన క్వాడ్‌ సదస్సు ద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో భారత్‌ మహత్తర పాత్ర పోషించడానికి అవకాశం వచ్చిందన్నారు. భారత్‌కు ఈ బాధ్యతను బైడెన్‌ అప్పచెప్పారు. అదే సమయంలో భారత్‌కు వ్యాక్సిన్‌ ముడి పదార్ధాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించింది. మార్చి ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ, భారత్‌ కోవిడ్‌ మహమ్మారి ఆట కట్టించిందని ప్రకటించారు. దేశంలో ఒక పక్క కోవిడ్‌ కేసులు పెరుగుతుండగా మంత్రి ప్రకటన వెలువడింది. ఒకవైపు ప్రభుత్వం విజయం సాధించామని చెప్పుకుంటుంటే మరోవైపు కోవిడ్ రెండో అల ముంచుకు వచ్చింది.

కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు తెలుగురాష్ట్రాల్లో మారుమోగిన పేరు ఆనందయ్య. ఇప్పుడు విందామ‌న్నా ఆయ‌న పేరు వినిపించ‌డం లేదు. ఒకప్పుడు అన్ని ఛానెల్స్‌లోనూ ఆయ‌నే బ్రేకింగ్ న్యూస్‌. ఇప్పుడు చూద్దామ‌న్నా ఆయ‌న టీవీల్లో క‌నిపించ‌ట్లేదు. క‌రోనాను జ‌యించే సంజీవ‌నిలాంటి మందును తయారు చేశారంటూ ఊరూరా ప్రచారం. కృష్ణట్నంలో జాత‌ర‌. కాని ఇప్పుడు ఆయ‌న మందు త‌యారు చేస్తున్నారో లేదో తెలీదు.. అస‌లెవ‌రైనా ఆనంద‌య్య మందు తీసుకుంటున్నారో లేదో తెలీదు.. అస‌లిప్పుడు ఆనంద‌య్య ఊసే లేదు.. ఆనందయ్య మందు నిజంగా పనిచేస్తుందా? ఆ మందు పనిచేసేదయితే ఎందుకు పంపిణీ జరగడం లేదు? వగైరా ప్రశ్నలు అడిగేవారు లేరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అవసరమని ప్రభుత్వాలు కూడా భావించడం లేదు. ఆయుర్వేద మందు కరోనాను నివారిస్తుందని రుజువుచేసే ప్రయోగాలు జరిగిన సూచనలు కూడా లేవు. ఈ ప్రయోగాల కోసం ప్రభుత్వం ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. కేవలం ఒక ప్రచారం మాత్రమే జరిగింది. కరోనా మొదటి వేవ్ కాలం నుంచి ప్రచారాలే జరుగుతున్నాయి. మొదటివేవ్ కు కారణం తబ్లీగీ జమాఅత్ సమావేశం అన్న ప్రచారం జరిగింది. వాళ్ళే కరోనాను వ్యాపింపజేస్తున్నారన్న ప్రచారం భారీఎత్తున నడిచింది. రెండో వేవ్ రావడానికి ముందు కరోనాపై విజయం సాధించేశామన్న ప్రచారం జరిగింది. రెండోవేవ్ వచ్చిన తర్వాత ఆనందయ్య మందు అన్న ప్రచారం మొదలైంది.

కరోనా భారతదేశంలో కూడా తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించిందన్నది కాదనలేని వాస్తవం. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాలా సభలో పాల్గొన్న వారిని చూపిస్తూ చూడండి మనమెవ్వరం ఇప్పుడు మాస్కులు ధరించడం లేదు. నేను కూడా మాస్కు పెట్టుకోలేదు. రెండు రోజుల క్రితం చైనాలో ఒక నగరంలో లాక్ డౌన్ పెట్టినట్లు వార్త వచ్చింది. కాని ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మనం ఇక్కడ భారీ సభలు కూడా పెట్టుకునే చక్కని పరిస్థితి ఉంది. మోడీజీ ఈ సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించారని గర్వంగా చెప్పుకున్నారు. గుజరాత్ ఎన్నికలై పోయాయి. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చేస్తోంది, కోవిడ్ ఆంక్షలన్న ప్రచారం మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కోవిడ్ నిబంధనలు పాటించాలని లేకపోతే యాత్ర ఆపేయాలని కేంద్రమంత్రి లేఖ రాశారు. కరోనా వైరస్ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కోవిడ్ వచ్చి మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మూడేళ్ళలో చాలా నేర్చుకున్నాం. కోవిడ్ దానికి సంబంధించిన వేరియంట్లు ఇక వస్తూ పోతూ ఉండడం మామూలే. వ్యాక్సిన్లు, సహజమైన వ్యాధినిరోధకశక్తి, బూస్టర్ డోసులతో కోవిడ్ లక్షణాల తీవ్రత తగ్గుతోంది. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోవిడ్ తో కలిసిమెలిసి జీవించడం నేర్చుకున్నాయి. లాక్ డౌన్లు విధించి కష్టనష్టాలకు గురయ్యే ఆలోచనల్లో లేవు. ఒక అంటువ్యాధి విస్తరిస్తున్నప్పుడు వస్తున్న ప్రమాదాలను గుర్తించి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మంచిదే. కాని కోవిడ్ పరిస్థితి ప్రమాదకరంగా మారిందనే హెచ్చరికలు ఎప్పుడు వస్తున్నాయన్నది గమనించాలి. ఇందులోని రాజకీయాలను కూడా చూడాలి.

మొదట్లో కోవిడ్ గురించి దేశంలో ఎక్కడా ఎలాంటి హెచ్చరికలు లేనప్పుడు తబ్లీగీ జమాఅత్ ఇజ్తిమా జరిగింది. కోవిడ్ ఈ లోగా వచ్చి బీభత్సం సృష్టించింది. కోవిడ్ పాపాన్ని తబ్లీగీ జమాఅత్ నెత్తిన వేసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరిగాయి. మరోవైపు షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలు అప్పుడు మొదటిసారి అమల్లోకి వచ్చాయి. కఠినమైన లాక్ డౌన్ విధించారు. అప్పట్లో ఇండియాలో 500 కోవిడ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

ఆ తర్వాత 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ వైరస్ బీభత్సం సృష్టిస్తున్నప్పటికీ ఎన్నికలు జరిగాయి. కోవిడ్ ఆంక్షలు ఎవరు పట్టించుకున్నారప్పుడు? 2022లో కూడా కోవిడ్ గురించిన ఆందోళనలు పెరిగాయి. కాని అప్పుడు కూడా ఎన్నికలున్నాయి. కర్నాటక, రాజస్థాన్లలో యాత్రలు చేస్తున్న బీజేపీ నేతలకు కేంద్రమంత్రి ఎలాంటి లేఖలు రాయలేదు. కోవిడ్ ఆంక్షల రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇవి నిదర్శనాలు కాదా? పక్షపాతాలు, వివక్షలు మన ముందుకు రావడం లేదా?

ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కోవిడ్ నిబంధనలు పాటించాలని లేఖ రాశారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి 3,500 కి.మీ. పాదయాత్ర ప్రారంభించారు. పప్పు అంటూ బీజేపీ వెటకారాలు, హేళనలు చేసినా ఆయన పట్టించుకోలేదు. పప్పు అని రాహుల్ గాంధీని హేళన చేయడం వల్ల తమకే ఎదురుదెబ్బలు తగలవచ్చన్న భయం వల్ల కాబోలు ఇప్పుడు పప్పు అనే పదం ఎక్కువగా వినబడడం లేదు. భారత్ జోడో యాత్రలో ప్రజలు భారీసంఖ్యలో పాల్గొంటున్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో కోవిడ్ నిబంధనలు పాటించాలన్న లేఖను చూడాలి. అలాగే బీజేపీ వారి జనఆక్రోశ్ యాత్ర విషయంలో ఇలాంటి లేఖలు ఎందుకు పంపలేదన్నది కూడా గమనించాలి. కోవిడ్ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో గ్రహించాలి.

భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెసు పునరుజ్జీవనం జరుగుతుందా? లేక ఇది తాత్కాలికమా? ఉనికి కాపాడుకోడానికి చేస్తున్న ప్రయత్నమా? అనేప్రశ్నలు ఎలాగూ ఉన్నాయి. భారత్ జోడో యాత్ర ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేము. విద్వేషాల విపణిలో ప్రేమాభినాల దుకాణం తెరుస్తానని రాహుల్ చెప్పిన మాటలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నది కూడా చెప్పలేం. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వయంగా 2002 గుజరాత్ ఘోరకలిని ప్రస్తావిస్తూ గుణపాఠం నేర్పామంటూ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత లోతుగా మతతత్వం పాతుకుపోయిందో స్పష్టం చేస్తున్నాయి. విద్వేషానికి వ్యతిరేకంగా దేశప్రజలను కలపాలనుకుంటున్న భారత్ జోడో యాత్ర ఏం సాధిస్తుందో వేచి చూడాలి.

షాహీన్ బాగ్ నిరసనలను కోవిడ్ నిబంధనలు అడ్డుకున్నాయి. రైతుల నిరసనల్లో కూడా కోవిడ్ రాజకీయాలు పనిచేశాయి. భారత్ జోడో యాత్రలో కోవిడ్ రాజకీయలు కనిపిస్తున్నాయి.