December 19, 2024

(నిజనిర్ధారణ: ఆల్ట్ న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. Posted by Aritraa Dey)

………………………………………………………………………………………………………………

ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో కొంతమంది పురుషులు ఒకే రకమైన చారల యూనిఫాంలు వేసుకొని ఉన్నారు. మరికొంత మంది ఫార్మల్స్‌లో ఉన్నారు. చివరి వరుసలో ఎడమవైపు నుంచి ఐదవ వ్యక్తి మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం గాంధీ బ్రిటిష్ సైన్యంలో రిక్రూట్ అయిన కాలం నాటిదని, ఆయనకు అనేక పతకాలు కూడా లభించాయని ఈ చిత్రంలో పేర్కొన్నారు.

నిజనిర్ధారణ:

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా అదే ఇమేజ్‌ని ఉపయోగించిన Livemint కథనాన్ని మేము (అల్ట్ న్యూస్) కనుగొన్నాము. 1893-1915 మధ్యకాలంలో దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియాలో రెండు ఫుట్‌బాల్ క్లబ్‌లను ఏర్పాటు చేశారని కథనం పేర్కొంది. హెన్రీ థోరో, లియో టాల్‌స్టాయ్‌ల రాజనీతిశాస్త్రం స్ఫూర్తితో  ఈ జట్లకు “ది పాసివ్ రెసిస్టర్స్” అని పేరు పెట్టారు. ఈ చిత్రం దక్షిణాఫ్రికాలో సుమారు 1913లో తీసింది.

గాంధీ బ్రిటీష్ సైన్యంలోనే ‘సేవ’ చేశారన్న మాట నిజం కాదు.  2008లో, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైనిక్ సమాచార్ పత్రికలో ఈ వాదన కనిపించినప్పుడు, చరిత్రకారుడు రామచంద్ర గుహ ఇలా పేర్కొన్నారు, “గాంధీని బ్రిటిష్ దళాలు ఎన్నడూ నియమించలేదు. ఆయన బ్రిటిష్ దళాలకు వైద్య సహాయం అందించడానికి పూర్తిగా పోరాట యోధులు కాని వారితో కూడిన స్వచ్ఛంద అంబులెన్స్ కార్ప్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశాడు. అతను బ్రిటిష్ సైన్యానికి సేవ చేశాడని చెప్పడం సరికాదు. భారత జాతీయ ఉద్యమంపై నిపుణుడు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర, గాంధీ బ్రిటిష్ సైన్యంలో ఎప్పుడూ భాగం కాదని, స్వచ్ఛంద అంబులెన్స్ కార్ప్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారని చెప్పారు. వారి ప్రకటనలను హిందుస్థాన్ టైమ్స్ 2008లో నివేదించింది.