April 25, 2024

(నిజనిర్ధారణ వెబ్ సైట్ altnews నుంచి తీసుకోవడం జరిగింది. Post by Abhishek Kumar)

____________________________________________________________

ఓ వ్యక్తి ఓ యువతిని కత్తితో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను బెదిరించడం కొనసాగించడంతో ఆమె నేరస్థుడితో వాదించడానికి ప్రయత్నిస్తుంది.  ఆ వ్యక్తి ముస్లిం అని, ఇది ‘లవ్ జిహాద్’ కేసు అని ప్రచారం చేశారు.

‘లవ్ జిహాదీ’ హిందూ అమ్మాయిలను బలవంతంగా వలలో వేసుకుంటున్నాడని పేర్కొంటూ కాజల్ హిందుస్తానీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు.

సుదర్శన్ న్యూస్ ఛానెల్ హెడ్ ముఖేష్ కుమార్ ఈ పోస్టును వ్యాఖ్యతో రీట్వీట్ చేస్తూ ఇలాంటి వ్యక్తులను కాస్ట్రేషన్ (నపుంసకులు చేయడం) చేయాలని పిలుపునిచ్చారు. దీన్ని చాలా మంది ప్రచారంలో పెట్టారు.

నిజనిర్ధారణ:

’ఇండోర్‘ అనే పదాన్ని క్లూగా మేము (ఆల్ట్ న్యూస్) ట్విట్టర్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము, ఇది నెట్‌వర్క్18 జర్నలిస్ట్ వికాస్ సింగ్ చౌహాన్ జూలై 26న చేసిన ట్వీట్‌కి దారితీసింది. ఇండోర్‌లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన సంఘటనగా ఆయన వీడియోను ట్వీట్ చేశారు. పట్టపగలు ఓ కేఫ్‌లో బాలికను కత్తితో బెదిరించిన నిందితుడి పేరు పీయూష్ అలియాస్ సాను, అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

మేము (ఆల్ట్ న్యూస్) Googleలో కీవర్డ్ సెర్చ్ చేసాము. దాడిని కవర్ చేస్తూ జూలై 27 నాటి న్యూస్18 కథనాన్ని చూశాము. నివేదిక ప్రకారం, ఈ సంఘటన ఇండోర్‌లోని MIG పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలికను కత్తితో బెదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దుండగుడు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పీయూష్ అలియాస్ సానుగా పోలీసులు గుర్తించారు, అతను కూడా నేరాన్ని అంగీకరించాడు. మహిళను బెదిరించేందుకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అతని చిత్రం కూడా కథనంలో ఉంది.

మేము (ఆల్ట్ న్యూస్) ఇండోర్‌లోని MIG పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ మీనాను కలిశాము. ఈ వ్యవహారంలో మతతత్వ లేదా ‘లవ్ జిహాద్’ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుడిని భరత్‌సింగ్‌ రావత్‌ కుమారుడు పీయూష్‌ రావత్‌గా గుర్తించారు. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ హిందువులని, నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ మీనా ధృవీకరించారు.

సారాంశం ఏమిటంటే, ఒక యువకుడు ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని కత్తితో బెదిరించి బలవంతం చేసిన వీడియోను సోషల్ మీడియాలో మతతత్వశక్తులు ఉపయోగించుకున్నాయి. వాస్తవానికి, బాధితురాలు, నిందితుడు ఇద్దరు హిందువులే, కేసులో మతపరమైన కోణం లేదు.