December 20, 2024

అగష్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం ఆనందంగా జరుపుకున్నాము. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్రమోడీ ఈ సందర్భంగా చేసిన ప్రసంగాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి మోడీ మాట్లాడారు. నోట్లరద్దుతో అవినీతి అంతమైపోతుందని అన్నారు. కాని అలా జరిగిందా? ఈ ప్రశ్న అడిగే మీడియా ఇప్పుడు కనబడడం లేదు. వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉందా? ఈ ప్రశ్న గురించి ఆలోచించేవారు కనబడడం లేదు.

రానున్న పాతిక సంవత్సరాల్లో ఇండియాను ఎలా చూడాలనుకుంటున్నారో ప్రధాని మోడీ తన ప్రసంగంలో చెప్పారు. కాని ఆయన ప్రసంగంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగావకాశాల గురించి ప్రస్తావన లేదు. అలాగే పెరుగుతున్న ధరల గురించి ఆయన మాట్లాడలేదు. ఉత్తరభారతదేశంలో ఈ సారి రుతుపవనాలు కరుణించలేదు. రైతులు కష్టాల పాలవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. భారత రూపాయి చిక్కి శల్యమవుతోంది. ఈ ప్రస్తావన కూడా ఆయన ప్రసంగంలో లేదు.

ఇంతకు ముందు స్వతంత్రదినోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ చాలా వాగ్దానాలు చేశారు.  చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలేమయ్యాయో ఈ సారి ప్రసంగంలో ఆయన చెప్పలేదు. అందరికీ కాంక్రీటు నివాసగృహాలు, టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తామని చేసిన వాగ్దానం ఏమయ్యింది? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమయ్యింది? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఏమయ్యింది? నల్లధనాన్ని రూపుమాపేస్తామన్న మాట ఏమయ్యింది?

ఈ సారి ప్రధాని మోడీ తన ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట్లాడకపోయినా, సేంద్రీయ వ్యవసాయం గురించి మాత్రం మాట్లాడారు. సేంద్రీయ వ్యవసాయం మన తక్షణ కర్తవ్యం అన్నారు. రసాయనాల నుంచి వ్యవసాయాన్ని విముక్తం చేయాలన్నారు. సేందరీయ వ్యవసాయం స్వయం సమృద్ధికి మార్గమన్నారు. ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలసారం పతనమవుతుంది. సేంద్రీయవ్యవసాయం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ప్రజారోగ్యానికి ప్రమాదాలు లేని పద్ధతి ఇది. కాని శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయం విషయంలో అంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నదిన కూడా మనం మరిచిపోరాదు. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం వల్ల ఫలసాయం తగ్గిపోతుంది. ఆహారభద్రత దెబ్బతింటుంది. రుతుపవనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల ఇప్పటికే అనేక సమస్యలున్నాయి.

సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రధాని కన్నా ముందు ఆర్థికమంత్రి నిర్మలా సితారామన్ చాలా గొప్పగా చెప్పారు. జులై నెలలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ జీరోబడ్జెట్ సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమైపోతాయని చెప్పారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ లేదా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే పద్ధతిని విదర్భకు చెందిన సుభాష్ పాలేకర్ అనే సాంఘీక కార్యకర్త ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఆవుపేడ, ఆవుమూత్రం, వేప మొదలైన వాటితో ఎరువులు, క్రిమిసంహారక మందులు తయారు చేయాలని అన్నాడు. రసాయనిక ఎరువులు వాడడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇలాంటి పద్ధతుల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని సీతారామన్ గారు కూడా చెప్పారు. కాని ఈ పద్ధతి ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పే శాస్త్రీయ అధ్యయనాలేవీ లేవు. నిజానికి రసాయన అనే పదం పట్ల వెగటు, అసహ్యం అనేవి ఇటీవల పెరుగుతున్నాయి. సాంప్రదాయిక, ప్రాచీన పద్ధతుల పట్ల ప్రేమ మరింత పెరుగుతోంది.

నిజానికి గ్రీన్ రివాల్యుషన్ లేదా హరిత విప్లవానికి ముందు కాలంలో చాలా మంది రైతులు ఏదో ఒక పద్ధతిలో ప్రకృతి వ్యవసాయమే చేస్తూ వచ్చారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల గొప్ప ఫలితాలున్నట్లయితే అసలు మనకు హరిత విప్లవం అవసరమే ఉండేది కాదు. సేంద్రీయవ్యవసాయం వల్ల ఫలసాయం తగ్గిపోతుందనే చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయం.

జీరో బడ్జెట్ అని చెప్పినప్పటికీ సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన ఎరువులు తయారు చేసుకోడానికి ఖర్చు తప్పనిసరి. ఈ ఖర్చు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలకు అయ్యే ఖర్చు కన్నా కనీసం 40 శాతం తక్కువ ఉండవచ్చు. అంతే తప్ప అస్సలు ఖర్చు లేని వ్యవసాయం కానే కాదు. కాని ఈ పద్ధతి వల్ల దాదాపు 30 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం.

కాని వినియోగదారులు ఆర్గానిక్ అనే లేబుల్ కనిపిస్తే చాలు అధికధర పెట్టి కొనడానికి సిద్ధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాని ఈ ఆకర్షణ ఎంత కాలం ఉంటుంది. ఉత్పత్తులు పెరిగితే, వినియోగదారుల్లో అసంతృప్తి పెరిగితే మార్కెట్ లో డిమాండ్ మళ్ళీ తగ్గిపోవచ్చు. ఏది ఏమైనా నిపుణుల అభిప్రాయాలు సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి విభిన్నంగా ఉన్నాయి.

హరిత విప్లవం పుణ్యమా అని భారతదేశంలో రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అవసరానికి కన్నా ఎక్కువ ఉంది. మిగులు ఎక్కువ ఉంది. అరవైలలో హరిత విప్లవం సాధించిన విజయం ఇది. వరి, గోధుమల దిగుబడి దీని వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అరవైలలో ఆహారధాన్యాల ఉత్పత్తి 82 మిలియన్ టన్నులు మాత్రమే. 2014 నాటికి 264 మిలియన్ టన్నులకు పెరిగింది. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఉపయోగించడం, దానితో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు వాడడం వల్ల సాధించిన విజయాలివి. సైన్సు ద్వారా సాధించిన విజయాలివి.

కాని సైన్సు రెండువైపులా పదునున్న కత్తి వంటిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలను వాడడం వల్ల నేలలో భారలోహాలు (కేడియం, సీసం, ఆర్సెనిక్ వంటివి) పెరిగాయి. చాలా ప్రాంతాల్లో నేలలో క్షారగుణాలు పెరిగాయి. సాగుకు ఉపయోగపడే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు అంతరించాయి. నేల సారం పతనమయ్యింది. మరోవైపు పంజాబ్ వంటి హరితవిప్లవ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రైతులు పొలాల్లో పంట కోత తర్వాత మిగిలిన అవశేషాలను తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది.

ఈ సమస్యల పరిష్కారానికి సేంద్రీయవ్యవసాయం మార్గమని కొందరి అభిప్రాయం. రసాయనాలను వాడడం అనేది ఉండదు కాబట్టి సహజంగానే నేల సారంపై ప్రభావం ఉండదు. అలాగే సేంద్రీయ వ్యవసాయం వల్ల పర్యావరణానికి కూడా నష్టం ఉండదని నిపుణులు అభిప్రాయం. రైతులు కేవలం సేంద్రీయ ఉత్పత్తులు అంటే ఆవుపేడ, ఆవుమూత్రం వంటివి మాత్రమే ఉపయోగిస్తారు.

సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు భారతదేశంలో పెరుగుతోంది. దేశంలోని సాగునేలలో ఇప్పుడు దాదాపు 2.5 శాతం సేంద్రీయ వ్యవసాయపద్ధతుల్లో సాగుబడి అవుతోందని అంచనా.

కాని సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీకుమార్ ది వైర్ వార్తాసంస్థకు చెప్పిన మాటల ప్రకారం, సేంద్రీయవ్యవసాయం వల్ల వాటిల్లే నష్టాలు ఉన్నాయి.

సేంద్రీయవ్యవసాయాన్ని పెద్దస్థాయిలో చేపట్టాలంటే పెద్దస్థాయిలో సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. అంటే పెద్ద సంఖ్యలో ఆవులు అవసరం. కాని గమనించవలసిన విషయమేమిటంటే ఆవులు బర్రెల వంటి పశువుల వల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయన్నది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే మిథేన్, నైట్రస్ ఆక్సయిడ్ వంటి వాయువులను ఈ పశువులు ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువులు గ్రీన్ హౌస్ వాయువులు. పెద్దస్థాయిలో గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వర్షాలపై ప్రభావం పడుతుంది. అలాగే వరదల వంటి విపత్తులకు అవకాశం ఉంది.

సేంద్రీయ వ్యవసాయం వల్ల దిగుబడి తగ్గుతుంది కాబట్టి సాగుభూమి విస్తీర్ణం మరింత పెంచవలసి వస్తుంది. పైగా ఆహారధాన్యాల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల ధరలు మార్కెటులో ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అధిక సంపాదన ఉన్నవారు మాత్రమే కొనగలిగేవి.

ప్రధాని, ఆర్థికమంత్రి ఇప్పుడు ఇంతగా సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడడానికి కారణం రైతులకు ఇస్తున్న సబ్సిడీలే అని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే సబ్సిడీలకు కోత పెట్టడం ఆటోమేటిగ్గా జరిగిపోతుందని కొందరి అభిప్రాయం. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలకు కోతలు పెడుతూ వస్తోంది.

సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి శ్రీలంకలో ఏం జరిగిందో గమనించవలసిన అవసరం కూడా ఉంది. శ్రీలంక కూడా హఠాత్తుగా సేంద్రీయవ్యవసాయాన్ని అమలు చేసింది. ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయమిది. అప్పుడు మహేంద రాజపక్స ప్రభుత్వం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల దిగుమతులను నిషేధించింది. కేవలం శ్రీలంకలో ఉత్పత్తి చేసిన సేంద్రీయ ఎరువులు సరిపోతాయని భావించారు. కాని ఫలితాలు తిరగబడ్డాయి. దిగుబడి ఒక్కసారిగా దెబ్బతింది. ఉదాహరణకు వరి దిగుబడి 2021-22లో సగానికి తగ్గిపోయింది. ఎరువుగా ఉపయోగించడానికి అవసరమైన సేంద్రీయవ్యర్థాలు శ్రీలంకలో కావలసిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. శ్రీలంక భారతదేశం నుంచి 55 మిలియన్ డాలర్లు అప్పు తీసుకుని యూరియా కొనాలని భావించింది.

సేంద్రీయవ్యవసాయానికి శ్రీలంక మాదిరిగా హఠాత్తుగా మరలడం అనేది చాలా సమస్యలకు కారణం కావచ్చు. జాతీయ ఆహారభద్రతను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. క్రమేణా ప్రవేశపెట్టవలసి ఉంటుంది. మరో సమస్య ఏమిటంటే, ఒక పంటను వరుసగా వేయడం వల్ల సేంద్రీయవ్యవసాయం కూడా నేల సారాన్ని దెబ్బతిస్తుందని అంటున్నారు. కాబట్టి పెద్దస్థాయిలో ఆహారధాన్యాల దిగుబడికి సాంప్రదాయిక సేద్యమే మంచిదని, ప్రకృతిసేద్యం వల్ల అనుకున్న ఫలితాలు రావని చాలా మంది నిపుణుల అభిప్రాయం. అయితే సాంప్రదాయిక ఎరువుల సేద్యం వల్ల వాటిల్లే నష్టాలను తగ్గించడానికి, సేంద్రీయ వ్యవసాయ పద్దతులను కలిపి ఎలా ఉపయోగించాలనే అధ్యయనాలు జరగవలసి ఉంది.

ఏది ఏమైనా, ఇలాంటి నిర్ణయాలు హఠాత్తుగా తీసుకునేవి కావు. లోతయిన అధ్యయనం, శాస్త్రీయ పద్ధతుల్లో  పరిశోధనల తర్వాత తీసుకోవలసిన నిర్ణయాలివి.