December 21, 2024

గుజరాత్ ఘోరకలి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అనేకమంది అమాయక ముస్లింలను హతమార్చిన కేసులు కూడా చాలా మందికి గుర్తుండే ఉంటాయి. అందులో ఒకటి నరోదా పాటియా కేసు. ఇందులో 97 మంది ముస్లింలను అల్లరి మూకలు అమానుషంగా హత్య చేశాయి. ఈ అల్లర్ల కేసులో 16 మంది దోషుల్లో మనోజ్ కుక్రాని ఒకడు. ఇప్పుడు మనోజ్ కుక్రానీ కుమార్తె  పాయల్ కుక్రానీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది.

నరోడా పాటియా అల్లర్ల కేసులో మనోజ్ కుక్రానీతో పాటు మరో 15 మంది దోషులని గుజరాత్ హైకోర్టు 2018లో సమర్థించింది. ఫిబ్రవరి 28, 2002న అహ్మదాబాద్‌లోని నరోదా పాటియా ప్రాంతంలో కనీసం 97 మంది ముస్లింలు చంపబడ్డారు. ముష్కరుల గుంపు వారిని హత్య చేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన మూక హింసలో ఈ ఘటన అత్యంత దారుణమైనది.

పాయల్ కుక్రానీ గత 5-6 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తోంది.  2017లో థావని తరపున ప్రచారం చేసింది. ఆమె తల్లి రేష్మా కుక్రాని స్థానిక బిజెపి కార్పొరేటర్, తన కుమార్తెకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎన్నికల్లో గెలిపించేలా చూస్తామన్నారు. ఆమె తండ్రిపై కేసు శిక్షల గురించి పాయల్ మాట్లాడుతూ, “ఇది నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము… ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.‘‘ అంది.