January 2, 2025
image description

కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆర్థిక మంత్రులకు లేఖలు రాసింది. ప్యాక్ చేసిన, లేబుల్ అతికించిన ఆహారధాన్యాలపై జియస్టీ విధించవద్దని కోరింది. ఈ పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

గోవాలోని పనాజీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ హయాంలో ధరలు, అవినీతి రెండు పెరుగుతున్నాయని విమర్శించారు.

కేరళ ఆర్థిక మంత్రి కే.ఎన్. బాలగోపాల్ మాట్లాడుతూ చిన్న చిన్న దుకాణాల్లో అమ్మే నిత్యావసరాలపై జియస్టీ తాము విధించేది లేదని అన్నారు. నిత్యావరసరాలపై అధిక పన్నులను ప్రతిపక్ష నేతలంతా విమర్శిస్తున్నారు.

బియ్యం, పిండి, పప్పుల వంటి నిత్యావరసరాలు పాకేజిలో ఉంటే వాటిపై జియస్టీ పడుతుంది. ఈ జియస్టీ వెంటనే ఉపసంహరించాలని కేరళ ముఖ్యమంత్రి పిన్నరాయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. జియస్టీ కొత్త మార్పులు చాలా కుటుంబాలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం వల్ల తల్లడిల్లుతున్న పేద కుటుంబాలకు ఇది భరించరాని భారం అవుతుంది.

ప్యాకేజి చేసిన ఆహారంపై పన్నులను విధించే ముందు రాష్ట్రాలతో మాట్లాడి, రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాతనే విధించామంటున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సితారామన్. అయితే ఈ ప్రతిపాదనను తాము అప్పుడే వ్యతిరేకించామని కేరళ అంటోంది. అంతేకాదు విలాసవస్తువులను అత్యధిక జయస్టీ శ్లాబులోకి తీసుకురావాలని కోరిన విషయాన్ని కూడా కేరళ ఆర్థికమంత్రి చెప్పారు. కాని ఎన్నికలకు ముందు విలాసవస్తువులపై పన్ను 18 శాతం నుంచి 12 శాతం తగ్గించారని ఆయన అన్నారు.

లోక్సభలోను, రాజ్యసభలోను జియస్టీని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదల, జియస్టీపై చర్చ జరగాలని పట్టుపట్టాయి.

జియస్టీ కౌన్సిల్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు జులై 18 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ నిర్ణయాల ప్రకారం ఇప్పుడు ప్యాకేజి చేయబడిన ఆహారం అంటే పెరుగు, లస్సీ, మజ్జిగలపై జియస్టీ పడుతుంది. ప్రస్తుతం టాక్సు నుంచి మినహాయింపు ఉన్న చౌక హోటళ్ళలో, అంటే హోటలు రూము తీసుకుంటే రోజుకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ చార్జీ చేసే హోటళ్ళపై ఇప్పుడు 12 శాతం జియస్టీ పడుతుంది. బ్యాంకు చెక్కుబుక్కులపై జియస్టీ పడుతుంది. ప్రింటు చేయబడిన మ్యాపులపై, పోస్టాఫీసు సర్వీసులపై కూడా జియస్టీ పడుతుంది. ఎల్ యీ డీ ల్యాంపులు, సర్క్యూట్ బోర్డులు, ప్రింటింగు ఇంకు, పెన్సిళ్ళు, బ్లేడులు, చెంచాల వగైరాపై కూడా జియస్టీ పడుతుంది. అన్నింటి ధరలు పెరిగాయని కాదు. సరదాగా విహారానికి వెళ్ళినప్పుడు రోప్ వే పైకి ఎక్కితే అయ్యే ఖర్చు ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే జియస్టీ దానిపై తగ్గించారు. ట్రక్కులు, గూడ్స్ క్యారేజీ వాహనాల ఖర్చు తగ్గుతుంది. ఆర్థోపెడిక్ పరికరాల ఖర్చు తగ్గుతోంది. ఇలాంటి చాలా మార్పులు ఈ సారి జియస్టీలో వచ్చాయి.

ఈ జియస్టీ గురించి మాట్లాడుతూ కాంగ్రెసు సీనియర్ నాయకుడు చిదంబరం జియస్టీ అమలులో కేంద్రప్రభుత్వం విఫలమైందని అన్నారు. జియస్టీ చట్టంలోనే చాలా లోపాలున్నాయని, గత ఐదేళ్ళుగా జియస్టీ మరింత లోపాలపుట్టగా మారిందని విమర్శించారు. యుపియే ప్రభుత్వం కోరుకున్న జియస్టీ ఇది కాదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో చక్కని సుహృద్భావం సాధించే జియస్టీ తాము కోరుకున్నామని అన్నారు. జియస్టీ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తోందని కాంగ్రెసు విమర్శించింది. కాంగ్రెసు కోరుకున్న సిపుల్ టాక్సును గబ్బర్ సింగ్ టాక్సుగా మార్చేశారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు ఈ జియస్టీ వల్ల కుదేలయ్యాయని కాంగ్రెసు నాయకుడు జైరాం రమేష్ అన్నారు.

జులై 1వ తేదీన జియస్టీ వ్యవస్థ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. జియస్టీ 2017లో అమలులోకి వచ్చింది. స్వతంత్రం తర్వాత భారత పన్నుల వ్యవస్థలో వచ్చిన పెను మార్పు ఇది. జియస్టీ వల్ల అనేక పరోక్ష పన్నులన్నీ ఒకే ఛత్రం కిందికి వచ్చేశాయి. సేవలు, ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఒకే పన్ను విధించడానికి ఒప్పుకున్నాయి. జియస్టీ వల్ల ఆర్థిక ప్రగతి పరుగులు తీస్తుందని అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాని చెప్పిన మాటలు నీటి మూటలై పోయాయి. ఆర్థిక ప్రగతి పరుగులు పెట్టడం కాదు, జియస్టీ తర్వాత వెంటనే మందగించింది. ఎందుకంటే జియస్టీ వల్ల అసంఘటిత రంగం కుదేలయ్యింది. అనేక ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి.

ఒకే పన్నులో ఉండవలసింది సరళమైన వ్యవస్థ. కాని జియస్టీ అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థగా తయారైంది. ఎనిమిది శ్లాబులతో గందరగోళంగా మారింది. ఈ టాక్సులను కట్టే క్రమంలో, లెక్కలు వేసేవాళ్ళ కోసం, లెక్కలు రాసేవాళ్ళ కోసం చిన్న పరిశ్రమలు చేసే ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు రాష్ట్రాలు జియస్టీ పరిహారం గడువు పెంచాలని కోరుతున్నాయి. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా, ఉదాహరణకు ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా జియస్టీ పరిహారం గడువు ఇంకా పెంచాలని కోరింది.

మొదటి నుంచి రాష్ట్రాలు జియస్టీకి వ్యతిరేకత కనబరిచాయి. అరుణ్ జైట్లీ 2016లో రాష్ట్రాలకు నచ్చచెప్పి జియస్టీకి ఒప్పించారు. అందుకోసం అనేక రాజీ సూత్రాలు కనుగొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కాహాల్ పై ఎక్సయిజ్ సుంకాలను జియస్టీ పరిధికి ఆవల ఉంచారు. రాష్ట్రాలకు జియస్టీ రెవిన్యూ తగ్గితే పరిహారం చెల్లిస్తామని హామీలు ఇచ్చారు.

2018 వరకు పరిహారం సక్రమంగా రాష్ట్రాలకు చెల్లించారు. కాని ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం జియస్టీ రేటులు తగ్గించింది. మరోవైపు ఆర్థికమాంద్యం అలుముకుంది. ఆ తర్వాత చాలా ఆలస్యంగా రాష్ట్రాలకు చెల్లించవలసిన పరిహారం చెల్లించారు. ఆ తర్వాత కోవిడ్ కాలంలో జియస్టీ పూర్తిగా పడిపోయింది. రాష్ట్రాలను ఆదుకోవలసిన కేంద్రం, ప్రకృతి విపత్తుకు ఏం చేయగలమని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు జియస్టీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం వేస్తోంది. మరోవైపు పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెటుపై ప్రభావం వేస్తోంది.

విచిత్రమేమిటంటే ప్యాకేజి ఆహారంపై జియస్టీ మినహాయింపును తీసేసి జియస్టీ విధించారు, హెల్త్ ఇన్సూరెన్స్ పై 18 శాతం జియస్టీ విధించారు. కాని వజ్రాలపై మాత్రం కేవలం 1.5 శాతం మాత్రమే జియస్టీ. చివరకు జియస్టీ వల్ల సాధించిందేమిటి?