December 18, 2024

ఈ సారి ఫుట్ బాల్ ప్రపంచకప్పు పోటీలు ఖతర్ దేశంలో జరుగుతున్నాయి. ఖతర్ ముస్లిం దేశం, గల్ఫ్ దేశం. ఒక గల్ఫ్ దేశంలో ఫుట్ బాల్ ప్రపంచకప్పు పోటీలు జరగడం ఇదే మొదటిసారి. ఈ అవకాశాన్ని ఖతర్ అందిపుచ్చుకుంది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఫుట్ బాల్ అభిమానులు తమ అభిమాన టీముల ఆటను చూడడానికి ఖతర్ తరలివస్తున్నారు. ఇందులో చాలా మందికి ఒక గల్ఫ్ దేశం ఎలా ఉంటుందో తెలియదు. ముస్లిం దేశం ఎలా ఉంటుందో తెలియదు. ముస్లిములు ఎలా జీవిస్తారో, వారి సమాజం ఎలా ఉంటుందో తెలియదు. ఇస్లాం గురించి, ముస్లిముల గురించి విన్నకథనాలు మాత్రమే వారికి తెలుసు.

వరల్డ్ కప్ పోటీలు నిర్వహించే అవకాశాన్ని ఖతర్ ఇస్లాం గురించి అవగాహన పెంచే అవకాశానికి కూడా ఉపయోగించుకోవడం గమనార్హమైన విషయం. వరల్డ్ కప్ పోటీలు చూడడానికి వస్తున్న వందలాది అభిమానులకు ఇస్లాం అంటే ఏమిటో, ముస్లిములు ఎలా జీవిస్తారో, వారి సమాజం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా పరిచయం చేసే కార్యక్రమాలు ఖతర్ చేపట్టింది. ఇస్లాం గురించి అపార్థాలు, అపోహలు దూరమయ్యేలా, వారి ఆలోచనలు మారేలా కొన్ని సందర్భాల్లో వారు ఇస్లాముకు దగ్గరయ్యేలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి.

ఒక ముస్లిం దేశంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు ఇదే మొదటిసారి. నిజానికి సౌదీ వంటి దేశాల్లో ఫుట్ బాల్ అభిమాన క్రీడగా కొనసాగుతోంది. ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించే అవకాశం దొరికిన ఖతర్ సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్న ధనికదేశం. అద్భుతమైన, అందమైన, గంభీరమైన మస్జిదులతో సందర్శకులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇస్లామీయ వాతావరణం అక్కడ కనిపించింది. ఇస్లాం గురించి ఆసక్తి వారిలో కలుగజేసింది. దోహాలోని కతారా కల్చరల్ డిస్ట్రిక్ట్ లోని ఒక మస్జిదు నుంచి వినిపించే అజాన్ (నమాజుకు పిలుపు) చాలా మంది సందర్శకుల్లో ఆసక్తి రేపింది. ఒట్టోమాన్ శైలిలో కట్టబడిన ఈ మస్జిదు మరో ఆకర్షణగా నిలిచింది.

దోహాలోని ఈ మస్జిదును నీలిమస్జిదుగా పిలుస్తారు. ఈ మస్జిదు గోడలపై ఉన్న నీలి, పర్పుల్ రంగుల్లోని టైల్స్ అద్భుతమైన ఆకర్షణ. అక్కడకు వచ్చిన సందర్శకులను అక్కడి గైడులు మస్జిదులోనికి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే షాండ్లియర్ తో విశాలంగా ఉన్న ప్రార్థనా హాలు సందర్శకులను ఆలోచనల్లో నెట్టివేస్తోంది. చాలా మంది సందర్శకులకు ఇదే ఇస్లాంతో మొదటి అనుభవం. ఇస్లాం అంటే మధ్యయుగాల మతం అని, ముస్లిములంటే వెనుకబడిన వారని అప్పటి వరకు ఉన్న అపోహలు, అపార్థాలు మొదటి చూపులోనే చాలా మందిలో పటాపంచలైపోయాయి. తమకు ఇంతవరకు ప్రత్యక్షంగా ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం లభించలేదని, విన్నమాటల వల్లనే ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నామని చాలామంది చెప్పారు.

ఈ నీలిమస్జిదు నిర్వహణను ఖతర్ అతిథి కేంద్రం చూస్తోంది. ఈ టోర్నమెంటు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఇస్లామీయ బోధకులను నీలి మస్జిదుకు ఖతర్ సెంటర్ ఆహ్వానించింది. ఇస్లాం గురించి అతిథులకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యతలు అప్పగించింది. మస్జిదు బయట వివిధ భాషల్లో ఇస్లాం గురించి తెలియజేసే చిరుపుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇస్లాం గురించి, ప్రవక్త ముహమ్మద్ (స) గురించి తెలియజేసే పుస్తకాలతో పాటు అరబ్బు కాఫీ, ఖర్జూరాల రుచి కూడా చూపించే ఏర్పాటు చేశారు.

వరల్డ్ కప్ లక్షలాది మందికి ఇస్లాంను పరిచయం చేసే అవకాశంగా చాలా మంది వాలంటీర్లు అన్నారు. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది ఇస్లాంను తీవ్రవాదంతో కలిపి ఆలోచిస్తున్నారని, అపార్థాలు, అపోహలు అత్యధికంగా ఉన్నాయని, ఈ టోర్నమెంటు సందర్భంగా ఈ అపార్థాలను తొలగించే అవకాశం లభించిందని చాలా మంది స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా నైతిక ప్రమాణాలు, కుటుంబజీవనం ప్రాముఖ్యత, కుటుంబ సంబంధాల ప్రాధాన్యత, పొరుగువారి హక్కులు, ముస్లిమేతరుల హక్కులు, వారి పట్ల గౌరవాదరాలు తదితర అంశాలకు సంబంధించి ఇస్లామీయ విలువల గురించి అతిథులకు తెలియజేస్తున్నారు.

ఫుట్ బాల్ మహిళా అభిమానులకు ఇస్లాం గురించి తెలియజేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చాలా మంది అతిథులు పరదా గురించి, బహుభార్వత్వం గురించి అడుగుతున్నారని, ఇస్లాంలో మహిళల అణిచివేత ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారని అక్కడి వాలంటీర్లు తెలియజేశారు. వరల్డ్ కప్ సందర్భంగా ఖతర్ చాలా రోజులుగా చర్చల్లో ఉంది. అనేక వివాదాలు వచ్చాయి. ఏది ఏమైనా అతిథులకు ఇస్లామును పరిచయం చేసే కార్యక్రమం ద్వారా అపార్థాలు తొలగించే ప్రయత్నం ఖతర్ తీసుకున్న ఒక నిర్మాణాత్మక నిర్ణయం. ఇస్లాంను తెలియజేసే వర్చువల్ రియాలిటీ టూర్ ఏర్పాట్లు కూడా చేశారు. అత్యుత్తమ నైతికతను బోధించే ప్రవక్త ముహమ్మద్ (స) సూక్తులు గోడలపై దర్శనమిస్తున్నాయి. ఇస్లామీయ బోధనలు తెలియజేసే అడ్వర్టయిజ్ మెంట్లు మాల్స్ వద్ద కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ సందర్భంగా ఇస్లామోఫోబియాను తగ్గించడానికి ప్రయత్నాలు జరగాలని చాలా మంది పిలుపునిచ్చారు.

చాలా మంది అభిమానులు ఇస్లాం స్వీకరించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాని ఖతర్ ధార్మిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంగా తమ లక్ష్యం ఇస్లామును పరిచయం చేయడం మాత్రమేనని, మతమార్పిడులు కాదని ప్రకటించింది. ఇస్లాం ప్రకారం మతం విషయంలో బలవంతం లేనేలేదు.