December 18, 2024

అరబ్బులకు పలస్తీనాతో సంబంధమేమిటి? దాని స్వరూప స్వభావాలేమిటి? ఈ ప్రశ్నలపై ప్రపంచం పునరాలోచించేలా చేశాయి ఖతర్ లో జరుగుతున్న ఫుట్ బాల్ పోటీలు. గత సంవత్సరం ఇటలీలో ఇటలీకి, మొరక్కోకు మధ్య స్నేహపూర్వక ఫుట్ బాల్ పోటీలు జరిగాయి. వేలాది మంది మొరక్కో ఫుట్ బాల్ అభిమానులు అక్కడ అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడ మొరక్కో అభిమానులు పలస్తీనా కోసం పాటలు పాడారు. పలస్తీనా సంప్రదాయిక దుస్తులు ధరించారు. పలస్తానా జెండా రంగుల్లో ఉన్న దుస్తులు ధరించారు. పలస్తీనా అరబ్బులకు స్వంత సమస్య. పలస్తీనా పట్ల అరబ్బులకు సంఘీభావం మాత్రమే ఉందనుకుంటే పొరబాటు. పలస్తీనా సమస్య తమ స్వంత సమస్యగా వాళ్ళు భావిస్తున్నారు. అది వారి నిత్యజీవితంలో భాగంగా మారిన సమస్య. వారి నరనరాల్లో పలస్తీనా ప్రవహిస్తుందని చాలా మంది అభిమానులు చెప్పడం కూడా గమనించాలి.

పలస్తీనా అరబ్బులకు ఎంత ముఖ్యమైనది అనే ప్రశ్నపై అనేక అధ్యయనాలు జరిగాయి. అరబ్బు భూభాగాల్లో సాధారణ ప్రజలు ఇస్రాయీల్ తో సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే విషయం అనేక సార్లు స్పష్టమయ్యింది. ఖతర్ ప్రపంచకప్పు పోటీల్లో ఈ విషయం మరోసారి స్పష్టమయ్యింది. ఇస్రాయీల్ గొప్పగా చెప్పుకునే ఇంటిలిజెన్స్ సంస్థలు అరబ్బు సాధారణ ప్రజల ఈ వైఖరిని అర్థం చేసుకోవడంలో చతికిలబడుతున్నాయి. ఇస్రాయీల్, పలస్తీనాల మధ్య ఘర్షణ కేవలం ప్రభుత్వాల మధ్య ఘర్షణ మాత్రమే ప్రజలకు ఈ ఘర్షణతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని సృష్టించాలనుకుంటున్న వారికి అరబ్బు సాధారణ ప్రజల్లో కూడా పలస్తీనా పట్ల ప్రేమ, ఇస్రాయీల్ దాష్టికాల పట్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి.

ప్రస్తుతం అరబ్బు దేశాల్లో తీవ్రమైన రాజకీయ విభేదాలున్నాయి. కాని ఇస్రాయీల్ పట్ల ఆగ్రహం విషయంలో, పలస్తీనాపట్ల ప్రేమ విషయంలో అరబ్బు సాధారణ ప్రజలు, ఏ దేశం వారయినా ఒకేవిధంగా ప్రతిస్పందిస్తున్నారని ఖతర్ నుంచి రిపోర్టు చేసిన ఇస్రాయీల్ పాత్రికేయులే చెబుతున్నారు. సాధారణ అరబ్బులకు ఇస్రాయీల్ అంటే పాశ్చాత్య వలసవాదానికి ప్రతీక. సైనిక దురాక్రమణకు, జాతివాదానికి ఇస్రాయీల్ మారుపేరుగా సాధారణ అరబ్బులు భావిస్తున్నారు. అరబ్బు ప్రభుత్వాలు ఇస్రాయీల్ తో ఎలా వ్యవహరిస్తున్నప్పటికీ సాధారణ ప్రజల అభిప్రాయాలు ఇలాగే ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. బలవంతంగా ఇళ్ళ నుంచి గెంటేయబడ్డ పలస్తీనా ప్రజలను వారు రోజు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అమానుషంగా హత్యకావించబడిన పలస్తీనా యువతనువారు మరిచిపోవడం లేదు. అరబ్బులకు, పలస్తీనా ప్రజలకు మధ్య ఉన్న ఈ సంబంధం చాలా మంది పాశ్చాత్యులకు అర్థం కాని విషయం. అరబ్బు దేశాలు చాలా వరకు సంపన్న దేశాలు. అరబ్బు ప్రజలు సంపన్న జీవితాలే గడుపుతున్నారు. అయినా వారి మనోమస్తిష్కాల్లో పలస్తీనా పెనవేసుకుని ఉంది.

ఖతర్ వచ్చిన అరబ్బు ఫుట్ బాల్ అభిమానులు పలస్తీనా జెండాలను ప్రదర్శించడం దీనికి నిదర్శనం. మొరక్కో ఆటగాడు కెనడాపై గెలిచిన తర్వాత పలస్తీనా జెండాను చేతుల్లో పట్టుకుని విజయాన్ని ప్రదర్శించాడు. మొరక్కో అభిమానులు పలస్తీనా కోసం, మొరక్కో కోసం పాటలు పాడారు. వారికి పలస్తీనా ఒక వేరే దేశం కాదు. మొరక్కో ఎలాగో పలస్తీనా కూడా అలాగే.

ఖతర్ ఫుట్ బాల్ పోటీలు చాలా విషయాలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాయి. సాధారణ అరబ్బుల్లో పలస్తీనా పట్ల ఉన్న ప్రేమను పరిచయం చేశాయి. ముస్లిముల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేశాయి. ఇస్లామీయ విలువలను పరిచయం చేశాయి. ఇస్లామీయ నాగరికతను పరిచయం చేశాయి. ఖతర్ ఈ పోటీల్లో సాధించిన పెద్ద విజయం ఇది. అరబ్బు ప్రపంచం గురించి పాశ్చాత్య భావాలను, అభిప్రాయాలను తల్లకిందులు చేసాయి ఈ పోటీలు.