December 15, 2024

కర్నాటక రాజకీయాలు రాజుకుంటున్నాయి. ఈ ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెసుకు అగ్నిపరీక్షల్లా తయారయ్యాయి.

సర్వేలేమంటున్నాయి? :

కర్నాటకలోని ఏడినా సర్వే వివరాలు ప్రకారం ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అవినీతి, అధికధరలు, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా భావిస్తున్నారు. దాదాపు 183 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. మరో 28 నియోజకవర్గాల్లో జరగవలసి ఉందని సర్వే నిర్వహించిన సంస్థ తెలియజేసింది. 68 శాతం ప్రజలు అవినీతి ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. అధికధరలు, నిరుద్యోగాల తర్వాత మహిళల భద్రత, తాగునీరు వంటి సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా బీజేపీ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కతీల్ జనవరిలో చేసిన వ్యాఖ్యలు తప్పక ప్రస్తావించుకోవాలి. మంగుళూరు బూత్ విజయ్ అభియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్డలు, గట్టర్లు, డ్రెయిన్ల వంటి చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచించరాదని లవ్ జీహాద్ గురించి ఆలోచించాలని చెప్పాడు. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, మీరు ‘లవ్ జిహాద్’ని ఆపాలనుకుంటే, మీకు బిజెపి అవసరం. లవ్ జిహాద్‌ను వదిలించుకోవడానికి, మీకు బిజెపి అవసరం, ”అని ఆయన తన ప్రసంగంలో అన్నాడు. కాని ప్రజలు మాత్రం అవినీతి, అధికధరల గురించి ఆలోచిస్తున్నారన్నది ఇప్పుడు సర్వేల వల్ల తెలుస్తోంది. మతపరమైన వివాదాలు, విద్వేషాలు రాజేసే మతోన్మాద రాజకీయాల లోగుట్టును ప్రజలు అర్థం చేసుకున్నారనే అనిపిస్తోంది.

ఈ సర్వేలో తెలిసిన మరో విషయమేమిటంటే అగ్రవర్ణాలు మాత్రమే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. 57 శాతం మంది అగ్రవర్ణాల వారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. లింగాయత్ సముదాయంలో కూడా 53 శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. యస్సీ,యస్టీ, ముస్లిం, వొక్కలిగా, కురుబా తదితర సముదాయాల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది.

లింగాయత్ ఓట్లదే కీలకపాత్ర:

లింగాయత్ ఓట్లు ఇప్పటి వరకు బీజేపీ పక్షానే పడుతున్నాయి. ఈ సర్వేలో కూడా లింగాయత్ సముదాయం బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది. కాని బీజేపీకి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. లింగాయత్ సముదాయానికి చెందిన ఇద్దరు నేతలు జగదీష్ షెట్టార్, లక్ష్మణ్ సవాడీలు బీజేపి కి రాం రాం చెప్పి కాంగ్రెసులో చేరారు. లింగాయత్ సముదాయంలో పేరుప్రతిష్ఠలున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విషయంలో బీజేపీ అధిష్ఠానం వ్యవహారసరళి కూడా చాలా మందికి నచ్చడం లేదు. ఆయన్ను బలవంతంగా గద్దె దించారనే అభిప్రాయం ఉంది. కాని కాంగ్రెసు నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్య లింగాయత్ సముదాయం ఆగ్రహానికి కారణమయ్యింది. లింగాయత్ ఓట్లను కాంగ్రెసు ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య కాంగ్రెసు ప్రయత్నాలకు తీవ్రమైన దెబ్బలా తగిలింది. లింగాయత్ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు, ఆయనే అవినీతికి మూలం అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య సహజంగానే లింగాయత్ సముదాయం ఆగ్రహానికి కారణమయ్యింది. బీజేపీ ఈ వ్యాఖ్య తర్వాత కాంగ్రెసుపై దాడి పెంచింది. కాంగ్రెసు పూర్తి లింగాయత్ సముదాయాన్ని అవమానించిందనే ప్రచారం ప్రారంభించింది. ఏది ఏమైనా ఇప్పుడు లింగాయత్ ఓట్లను కాపాడుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుంటే, లింగాయత్ ఓట్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తుంది. ఎన్నికల రాజకీయాల్లో కులం ఎంత కీలకపాత్ర పోషిస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది.

ద్విముఖ వ్యూహం:

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు నళినీ కుమార్ ఖతీల్ వ్యాఖ్య వల్ల స్పష్టంగా తెలిసిందేమిటంటే, బీజేపీ ప్రారంభం నుంచి మతతత్వ రాజకీయాల ద్వారా లభ్ధి పొందవచ్చని భావించింది. కాని సర్వేల్లో ప్రజలు అవినీతి, అధికధరలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్న విషయం స్పష్టమయ్యింది. ఇప్పుడు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. కొందరు నేతలు స్పష్టంగా మతతత్వ వ్యాఖ్యలు చేస్తుంటే మరికొందరు ఇతర సమస్యలే ముఖ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తున్న వ్యూహమే ఇది. కర్నాటకలో లింగాయత్ సముదాయం చాలా బలమైన సముదాయం. కాంగ్రెసు కాలంలో లింగాయతులకు సరయిన ప్రాముఖ్యం లభించలేదనే అసంతృప్తి ఉండేది. యడ్యురప్ప ఈ అసంతృప్తిని ఉపయోగించి లింగాయతుల్లో బీజేపీ పలుకుబడిని పెంచాడు. కాని యడ్యురప్పకు కూడా బాగా తెలిసిన వాస్తవమేమిటంటే, కర్నాటక రాజకీయాల్లో మతతత్వం వల్ల సాధించేది ఏదీ ఉండదు. అందువల్ల ఆయన సాధ్యమైనంత వరకు ఈ మతతత్వ రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. మతతత్వ రాజకీయాల్లో తనకు నమ్మకం లేదని, హిందు ముస్లిములు సోదరుల్లా ఉండాలని కూడా ఇటీవల ఆయన వ్యాఖ్యానించాడు. హిజాబ్, హలాల్ వివాదలు, కోస్తా కర్నాటకలో హిందూ ముస్లిం అల్లర్ల వంటి సంఘటనలకు కారణం యడ్యురప్ప ప్రాముఖ్యాన్ని బీజేపీ అధిష్ఠానం తగ్గించి బి.ఎల్.సంతోష్, ప్రహ్లాద్ జోషీ, నళిన్ కుమార్ ఖతీల్, అనంత్ కుమార్ హెగ్డే, తేజస్వీ సూర్య వంటి వారికి పెద్దపీట వేయడమే. ఈ నేతల ప్రభావం వల్లనే బొమ్మయ్ చివరి నిముషంలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించే నిర్ణయం తీసుకున్నాడని కొందరి విశ్లేషణ. మతరాజకీయాలపై బీజేపీ ఆధారపడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కర్నాటకలో గెలవాలంటే మతరాజకీయాలు ఉపయోగపడవు. యడ్యురప్ప వంటి నాయకుడు కావాలి. కాబట్టే మళ్ళీ యడ్యురప్పను ముందుకు తీసుకువస్తున్నారు. మతరాజకీయాలకు ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు కొందరు రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. బొమ్మయ్ ఇటీవల హిజాబ్, హలాల్ సమస్యలు ముఖ్యమైనవి కాదని వ్యాఖ్యానించారు.

మరోవైపు కర్నాటక రాజకీయాల్లో మతతత్వాన్ని కొద్దోగొప్పో రాజేయడమే మంచిదనే అభిప్రాయం కూడా అధిష్ఠానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందువల్లనే ఇటీవల అమితషా మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని అన్నారు. బెల్గావీ జిల్లాలోని టెర్డాల్ లో మాట్లాడుతూ ఆయన కాంగ్రెసు వస్తే కుటుంబ పరిపాలన వస్తుందని, కర్నాటకల అల్లర్లతో అతలాకుతలమవుతుందని చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలను పలువురు ఖండించారు. కర్నాటకలో బీజేపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తుందని అందువల్లనే అమిత్ షా నిరాశతో ఇలాంటి మతతత్వ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెసు నాయకుడు జైరాం రమేష్ అన్నారు.

రాహుల్ ప్రసంగం:

ఈ నేపథ్యంలో కర్నాటక కోలార్ లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని ఒకసారి ప్రస్తావించాలి. ప్రభుత్వ కార్యదర్శుల్లో కేవలం 7 శాతం మాత్రమే ఓబీసీ, యస్సీ, యస్టీ వర్గాలకు చెందినవారున్నారని ఆయన చెప్పారు. నిజానికి ఆయన మరికొన్ని వివరాలు కూడా చెప్పవచ్చు. భారతదేశంలో యూనికార్న్ కంపెనీలుగా స్థిరపడిన 104 కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ కూడా దళితులు, ఆదివాసీలు, ఓబీసీలది కాదు. ఇండియన్ నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో రిజీష్టరైన 50 కంపెనీల్లో ఒక్క కంపెనీ కూడా ఓబీసీ, యస్సీ,యస్టీలది కాదు. అదానీ గ్రూపు గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంటు నుంచి బహిష్కరించబడ్డారు. అదానీ గ్రూపులోని 16 ప్రధానమైన కంపెనీల్లోని 74 మంది డైరెక్టర్లలో ఒక్కడు కూడా దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన వారు కాదు. కాగా, పారిశుద్ధ కార్మికుల్లో దాదాపు 100 శాతం బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే.

దిప్రింట్ వార్తా సంస్థ ఇటీవల రాసిన వ్యాసంలో ఈ వివరాలు అందించింది. భారత జనాభాలో 75 శాతం ప్రజలు దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే. కాని దేశంలోని అత్యున్నత స్థానాల్లో, కంపెనీల్లో, ఉద్యోగాల్లో ఎక్కడా వారి ప్రాతినిథ్యం ఈ స్థాయిలో కనిపించదు. అత్యుత్తమ స్థానాలకు చేరుకోవాలంటే ముఖ్యంగా ప్రతిభ కావాలనే వాదన వినిపిస్తోంది. ప్రతిభ లేనివారు ఆ స్థానాలకు చేరుకోలేరనే వాదన కూడా చాలా మంది వినిపిస్తారు. కాని ఆలోచించవలసిన విషయమేమిటంటే, దేశజనాభాలో కేవలం 5 నుంచి 10 శాతం వరకు ఉన్న వర్గాల వారిలోనే ప్రతిభావంతులు ఉన్నారా? మిగిలిన 90 శాతం ప్రజల్లో ప్రతిభావంతులే లేరా?

భారత సమాజంలో ఈ పరిస్థితికి దారి తీసిన సమస్యలేమిటనే విషయంపై చర్చ జరగాలి. సమాజంలో కేవలం కొన్ని సముదాయాలు మాత్రమే అత్యున్నత స్థానాలకు ఎలా చేరుకుంటున్నారు. మిగిలిన సముదాయాలకు ఎదురయ్యే అడ్డంకులేమిటి అనే ప్రశ్నలపై పరిశోధనలు జరగాలి. ఈ చర్చకు ఉపయోగపడేదే కులజనగణన. కులజనగణన లేనిదే ఏ సముదాయం ఎంత అభివృద్ధి సాధించిందనే లెక్కలు మన వద్ద ఉండవు. విద్య, ఆరోగ్యం, ఆదాయం తదితర విషయాల్లో ఏ సముదాయం పరిస్థితి ఎలా ఉందన్నది మనకు తెలియదు. కులజనగణన జరిపి ఆ వివరాలు బయటకు వస్తే సమాజంలో అలజడి చెలరేగుతుందనే భయాలు కొందరు వెలిబుచ్చుతున్నారు. కాని ఈ భయాలను సాకుగా చూపి వివిధ సముదాయాల పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశం లేకుండా చేయడం, ఆ విధంగా ఆయా సముదాయాల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకునే సమాచారం లేకుండా చేయడం సముచితమా అన్నది ముఖ్యమైన ప్రశ్న.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎంత జనాభా ఉంటే అంత వాటా కావాలి అన్నాడు. అంటే జనాభాకు తగిన విధంగా దామాషా ప్రాతినిథ్యం గురించి మాట్లాడారు. ఆయనేదో ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన ప్రసంగమే కావచ్చు, కానీ రానున్న రోజుల్లో ఈ నినాదాన్ని మరింత బలంగా వినిపించే అవకాశాలున్నాయి. కేవలం కర్నాటకలోనే కాదు దేశం మొత్తం, ఎన్నికల సందర్భాల్లోనే కాదు ఇతర సందర్భాల్లో కూడా ఎంత జనాభా ఉంటే అంత వాటా కావాలనే నినాదం వినిపించే అవకాశాలున్నాయి. 21వ శతాబ్ధంలో సామాజిక న్యాయం కోసం ఇచ్చిన పిలుపుగా దీన్ని చూడాలి.

కేవలం కర్నాటక ఎన్నికల సందర్భంగా వినిపించిన ఒక ఎన్నికల ప్రసంగం మాత్రమే కాదని ఇతర పరిణామాలు కూడా చెబుతున్నాయి. కాంగ్రెసు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాసి కులజనగణన జరిపించాలని అన్నారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులజనగణన జరిపిస్తానంటున్నారు. ఓబీసీ రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ తదితర సముదాయాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న ఆందోళన బీజేపీలోను ఉంది. ఈ ఎన్నికలు దక్షిణాది రాజకీయాలపైనే కాదు, ఉత్తరాది రాజకీయాలపై కూడా పెద్ద ప్రభావం వేసే అవకాశాలున్నాయి.