సత్యపాల్ మలిక్ బీజేపీ నాయకుడు. మేఘాలయ గవర్నర్ గా ఆయన్ను బీజేపీయే నియమించింది. మేఘాలయ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన రైతుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించాడు. ఇది బీజేపీకి గొంతు దిగని వెలక్కాయ అయ్యింది. చివరకు బీజేపీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. రైతు ఆందోళనకు గట్టిగా మద్దతిచ్చిన ఆయన హర్యానాలోని రైతు సంఘాల అభిమానం పొందాడు. ఆయన మోడీని విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. ఒక సందర్భంలో మోడీని గర్విష్ఠి అని చెప్పారు.
మూడు సార్లు ఎం.పీ.గా గెలుపొందిన సత్యపాల్ మలిక్ ఇప్పుడు మోడీపై మరో పిడుగు లాంటి వ్యాఖ్య చేశాడు. దివైర్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడి, కశ్మీర్ సమస్య, అవినీతి సమస్యలపై ప్రధానిని విమర్శించారు.
కవిత్వం, సంగీతం, ఫోటోగ్రఫీ ఇష్టపడే సత్యపాల్ మలిక్ వయసు 76 సంవత్సరాలు. గత ఆరేళ్ళ కాలంలో ఆయన నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించాడు. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా ఉన్నాడాయన. అప్పట్లోనే గవర్నర్లకు పనిపాట ఉండదని వ్యాఖ్యానించాడు. రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా అరవైలలో రాజకీయాల్లో ప్రవేశించిన సత్యపాల్ మలిక్ 2004లో బీజేపీలో చేరాడు. ఎనభైలలో కొంతకాలం కాంగ్రెసులో కూడా ఆయన ఉన్నాడు. 1988 జనతాదళ్ స్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. 2018లో ఆయన్ను మోడీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ గవర్నర్ గా నియమించింది. అప్పట్లో మోడీని ఉత్తమ ప్రధాని అని కూడా పొగిడాడాయన. అధికరణ 370 రద్దు జరిగినప్పుడు ఆయనే గవర్నర్. కాని అధికరణ 370 రద్దు నిర్ణయం గురించి తనకు ముందుగా ఏమాత్రం తెలియదని. తెలిసి ఉంటే అలా చేయవద్దని చెప్పి ఉండేవాడినని అన్నాడు. 2019లో ఆయన్ను గోవాకు మోడీ ప్రభుత్వం పంపేసింది. ఆ తర్వాత మేఘాలయకు పంపారు.
గోవాలో అవినీతి గురించి మోడీకి చెప్పిన తర్వాత తనను హడావిడిగా అక్కడి నుంచి తప్పించారని ఆయన అన్నాడు. గత సంవత్సరం ఆయన మేఘాలయ గవర్నర్ గా రిటైరయ్యారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సత్యపాల్ మలిక్ కు జాట్ సముదాయంలో చాలా పలుకుబడి ఉంది.
పుల్వామా ఉగ్రదాడి, కశ్మీరు సమస్యల గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఇంటిపై సిబీఐ దాడి జరిగింది. తనపై కక్షసాధింపు చర్య అనీ, తన నోరు మూయించడానికే ఈ సిబీఐ దాడి అని ఆయన అన్నాడు. సిఆర్పిఎఫ్ దళాలను విమానాల ద్వారా తరలించకుండా రోడ్డు మార్గాన పంపడం చాలా పెద్ద తప్పని సత్యపాల్ మలిక్ తన ఇంటర్వ్యులో చెప్పారు. నిజానికి సిఆర్పిఎప్ విమానరవాణా కోరిందని, కాని నిరాకరించారని తెలియజేశాడు. దీనిపై ప్రధాని మోడీ, రక్షణ సలహాదారుడు అజిత్ దోవల్ తనను మౌనంగా ఉండమన్నారని కూడా చెప్పాడాయన.
పుల్వామా ఉగ్రదాడి గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ప్రధానిని ఇరుకున పెడుతున్నాయి. సత్యపాల్ మలిక్ నిజాలు చెప్పారంటూ హర్యానా రైతులు ఆయనకు మద్దతిస్తున్నారు. ఈ ఇంటర్వ్యు తర్వాతే సత్యపాల్ మలిక్ పై సిబిఐ దాడి జరిగిందన్నది గమనార్హం. అందుకే ఆయన ఇది కక్ష సాధింపు అంటున్నారు.
ఈ విషయాలను ఇప్పుడు దేశమంతా ప్రచారం చేసి చెబుతానంటున్నాడాయన. పుల్వామా దాడి వెనుక నిజాలు అందరికీ తెలవాలని చెబుతున్నాడు. యావత్తు ఉత్తరభారతదేశం పర్యటించి సభలు పెట్టి పుల్వామా గురించి చెబుతానంటున్నాడు. బోఫోర్సు మాదిరిగా పుల్వామా కూడా ఎన్నికల వరకు జనంలో చర్చలో ఉండేలా చేస్తానంటున్నాడు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని చెబుతున్నాడు.
కాని సంచలనాత్మకమైన ఈ వ్యాఖ్యల తర్వాత నిజానికి దేశంలోని మీడియా చానళ్ళలో ఈ విషయమై వాడి వేడి చర్చలు జరుగుతాయని సహజంగా అందరూ భావిస్తారు. విచిత్రంగా మీడియా చానళ్ళు మౌనం పాటించాయి. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే చర్చలేవీ మన మీడియా చానళ్ళు చేయడానికి ఇష్టపడవన్నది మరోసారి రుజువయ్యింది.