December 22, 2024

రైట్ వింగ్ యాక్టివిస్టుగా పేరున్న మధుకిశ్వర్ తో పాటు మరో నలుగురిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో పుకార్లను ప్రచారం చేశారని కేసు పెట్టారు. ఎప్పుడో 2017లో జరిగిన ఒక సంఘటన వీడియోను ఆమె ఇప్పుడు పోస్టు చేశారు.

కన్వరియాలు ప్రయాణిస్తున్న ఒక వాహనం ఒక ముస్లిం వ్యక్తిని ఢీకొట్టి వెళ్ళిపోయిన వీడియో ఆమె పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఉద్దేశ్యపూర్వకంగా ఒక ముస్లింను ఢీకొట్టినందుకు కన్వరియాలపై కేసు నమోదు చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నట్లు స్క్రోల్ వార్తాసంస్థ పేర్కొంది. స్క్రోల్ ప్రకారం సహరాన్ పోలీసులు ఈ సంఘటన 2017 లో జరిగిందని వివరణ ఇచ్చారు.

ఈ వివరణ తర్వాత కూడా ఆమె, మిగిలిన నలుగురు పోస్టును తొలగించలేదు. మిగిలిన నలుగురు శక్త్ ప్రౌడ్ హిందు, సుధాశుక్లా, రాజ్ కమల్, అనిల్ మన్సింకా అని తెలుస్తోంది. గతంలో ఏప్రిల్ లో కూడా మధు కిశ్వర్ ఇలాంటి ఒక పోస్టుతో వివాదం సృష్టించారు. ముస్లిం పురుషుల లైంగికసామర్థ్యం వల్ల హిందూ, క్రయిస్తవ, సిక్కు అమ్మాయిలను ఆకర్షిస్తున్నారని రాస్తూ ఆధారాల్లేని లవ్ జిహాద్ కు సెక్సు జిహాద్ అనే కొత్త పేరు కూడా కనిపెట్టి రాశారు. ఈ ట్వీటు తర్వాత తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె దాన్ని తొలగించారు. రాయిటర్ సంస్థకు పనిచేస్తున్న, పులిట్జర్ అవార్డుపొందిన భారతీయ ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్దీకీని జిహాదిగా ఆమె పేర్కొన్నారు. కందహార్ లో అఫ్గన్ దళాలకు, తాలిబాన్లకు మధ్య పోరును కవర్ చేస్తున్న డానిష్ సిద్దీకీ ప్రాణాలు కోల్పోయారు. 2018లో గురుగ్రామ్ లో ఒక స్కూలు బస్సుపై జరిగిన దాడి ఐదుగురు ముస్లిములు చేసిన దాడిగా ట్వీటు చేశారు. ఆల్ట్ న్యూస్ వార్తా సంస్థ ఈ అబద్దాన్ని రుజువులతో సహా నిరూపించింది.