May 5, 2024

భారతీయత పునాదులు ప్రజాస్వామిక విలువలపై ఆధారపడి ఉన్నాయి. భారత ప్రగతి రథానికి సోషలిజం, సెక్యులరిజం రెండు చక్రాల్లా పనిచేస్తున్నాయి. ధార్మికవిశ్వాసాలు, మతాచారాలు ప్రజల జీవితాలతో పెనవేసుకున్న సమాజం భారత సమాజం. అందువల్లనే సోషలిజం, సెక్యులరిజాలు ఎంతో అవసరమైనవి. ఈ విలువలను బలహీనపరిచే అనేక ప్రయత్నాలు చాలా శక్తులు చాలా కాలంగా చేస్తూనే ఉన్నాయి.

భారత రాజ్యాంగ రచన కాలంలోనే ఈ వాస్తవాలను గుర్తించి, బహుళమతాలకు, విశ్వాసాలకు, సంస్కృతులకు, భాషలకు పూర్తి అవకాశాలున్న భారతదేశానికి పునాదులు వేశారు. దేశంలో ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన మతాన్ని ఎంచుకుని ఆచరించే స్వేచ్ఛ ఉంది. అలాగే మతప్రాతిపదికన ఎవరిపై కూడా ఎలాంటి వివక్షకు భారతరాజ్యాంగంలో అవకాశం లేదు. భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రత్యేకతగా కొనసాగుతూ వస్తోంది. కాని సెక్యులర్ విలువలను వ్యతిరేకించే శక్తులు స్వతంత్రసంగ్రామ కాలం నుంచి తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఫలితంగా అనేక సందర్భాల్లో మతపరమైన అల్లర్లు భగ్గుమన్నాయి. సెక్యులర్ విలువల పరిరక్షణకు, మానవవిలువలను కాపాడ్డానికి మతాలకు అతీతంగా ప్రజలు నడుం కట్టిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.

తనిష్క్ దేశంలో పేరున్న జువెలరీ బ్రాండ్. తనిష్క్ ఒక వ్యాపార ప్రకటన విడుదల చేసింది. ఒక ముస్లిం కుటుంబం తమ హిందూ కోడలిపై కురిపించిన ప్రేమాభిమానాలు ఆ ప్రకటనలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే ప్రకటన అది. కాని ఈ ప్రకటన చాలా మందికి రుచించలేదు. లవ్ జిహాద్ (అదెక్కడుందో, ఎన్ని కేసులున్నాయో ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చెప్పలేదు) గగ్గోలు మొదలయ్యింది. ఈ ప్రకటన లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని రాద్దాంతం చేశారు. చివరకు ఆ కంపెనీ ప్రకటన వెనక్కు తీసుకుంది. ఈ గగ్గోలు జరుగుతున్నప్పుడే ఒక జంట ఏమాత్రం భయపడకుండా తమ మతాంతర వివాహం గురించి ప్రకటించింది. అంతేకాదు. తాము చాలా సంతోషంగా ఉన్నామని కూడా చెప్పారు. తనిష్క్ ప్రకటనపై అభ్యంతరాల గగ్గోలును చాలా మంది నిస్సంకోచంగా విమర్శించారు.

భారతప్రభుత్వం 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంపై తీవ్రమైన నిరసనలు ప్రారంభమయ్యాయి. ముస్లిములను ఈ చట్టంలో మినహాయించి, మిగిలిన వారికి పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని చాలా మంది విమర్శించారు. ఈ నిరసనల్లో కేవలం ముస్లిములు మాత్రమే కాదు, అన్ని మతవర్గాల ప్రజలు పాల్గొని భారత సెక్యులర్ విలువలను చాటి చెప్పారు.

త్రిపురలో 2021లో ముస్లిములపై దాడులు జరిగాయి. మతపరమైన అల్లర్లు ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. మహారాష్ట్రలోని అమరావతిలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతిలోని వందేళ్ళ పాత మందిరంపై రెచ్చిపోయిన గుంపు దాడికి ప్రయత్నించింది. స్థానిక ముస్లిములు వెంటనే ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. మానవహారంగా ఏర్పడి మందిరానికి రక్షణ కల్పించారు. ఈ మందిరం ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతంలో ఉంది. బయటి నుంచి వచ్చిన అల్లరి మూకలు దాడికి ప్రయత్నించినప్పుడు స్థానిక ముస్లిములు ఈ ప్రయత్నాలను కొనసాగనివ్వలేదు.

గురుగ్రామ్ లో ప్రతి శుక్రవారం ముస్లిములు నమాజు చేసే స్థలాలపై గగ్గోలు మొదలైనప్పుడు, సిక్కులు ముందుకు వచ్చి తమ గురుద్వారాలో స్థలాన్ని ముస్లిములు నమాజు చదువుకోడానికి ఇచ్చారు. ఒక హిందూ వ్యాపారి తన స్థలాన్ని నమాజు చదువుకోడానికి ఇచ్చాడు.

బాబరీ మస్జిద్, హిజాబ్ బ్యాన్, బహిరంగ ప్రదేశాల్లో నమాజుపై కేసులు, జ్ఞానవాపి మస్జిదు వివాదం, లవ్ జిహాద్, నౌకరీ జిహాద్, ఫ్లడ్ జిహాద్ (ఇంకా అనేక కొత్త కొత్త జిహాదుల పేర్లు మతోన్మాద శక్తుల నిఘంటువుల్లో ఉన్నాయి) ఇలాంటి అనేకానేక సంఘటనలు, వివాదాలు, మతపరమైన ఉద్రిక్తతలు, అల్లర్ల చీకట్లలో పైన పేర్కొన్న సంఘటనల వంటి వెలుగు కిరణాలు భారతీయత బలాన్ని చాటి చెబుతున్నాయి.