December 20, 2024

విద్యా రంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన జయంతి నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన భారతదేశానికి మొదటి విద్యామంత్రిగా పనిచేశారు. నవంబర్ 11వ తేదీ విద్యాదినోత్సవంగా 2008లో ప్రభుత్వం ప్రకటించింది.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, మౌలానా ఆజాద్ భారతదేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యారు. ఫిబ్రవరి 1958 వరకు సమాజంలో విద్య వ్యాప్తికి అపారంగా దోహదపడ్డాడు. భారతదేశంలో ఆధునిక విద్యకు రూపురేఖలు తీర్చిదిద్దిన దార్శనికుడు ఆయన.

మౌలానా ఆజాద్ దేశంలో ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనలకు పునాది వేశారు. నవంబర్ 18, 1888 న జన్మించారు. ఆయన జన్మించింది మక్కా నగరంలో. తల్లి అరబ్బు. తండ్రి బెంగాలీ మూలాలకు చెందినవారు. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ కుటుంబం మక్కా నగరానికి తరలి వెళ్ళింది. మౌలానా ఆజాద్ అక్కడే జన్మించారు. 1890లో తిరిగి భారతదేశానికి వచ్చి, కలకత్తాలో స్థిరపడ్డారు. అరబి, ఇంగ్లీష్, ఉర్దూ, హింది, పర్షియన్, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

1912లో మౌలానా అల్ హిలాల్ పేరుతో ఒక ఉర్దూ పత్రిక నడిపారు. మింటో మోర్లే సంస్కరణల తర్వాత హిందూ ముస్లిం ఉద్రిక్తతలను తగ్గించి ఐక్యత సాధించడంలో అల్ హిలాల్ ప్రముఖ పాత్ర పోషంచింది. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలున్నాయని ప్రభుత్వం 1914లో ఈ పత్రికను నిషేధించింది. ఆ తర్వాత ఆయన అల్ బలమ్ పేరుతో మరో పత్రికను ప్రారంభించారు. బ్రిటీషు ప్రభుత్వం 1916లో ఈ పత్రికను కూడా నిషేధించి ఆయన్ను నిర్బంధించారు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఆయన్ను విడుదల చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాయకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూ 1920లో మౌలానా జాతీయ కాంగ్రెసులో చేరారు. 1940లో కాంగ్రెసు అధ్యక్షుడనిగా సేవలందించారు.

మౌలానా గొప్ప రచయిత,  భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. సెక్యులర్ వాది. పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలీగ్ ప్రతిపాదించిన దేశవిభజనకు వ్యతిరేకంగా గళం విప్పారు.

1920లో యూపీలోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియాను స్థాపించడానికి ఫౌండేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1934లో యూనివర్శిటీ క్యాంపస్‌ను అలీఘర్ నుండి న్యూఢిల్లీకి మార్చడంలో కూడా సహకరించారు.

స్వాతంత్య్రానంతర భారతదేశంలో మౌలానా ఆజాద్ గ్రామీణ పేదలు బాలికల విద్యపై దృష్టిపెట్టారు. వయోజన విద్య, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచితంగా తప్పనిసరి సార్వత్రిక ప్రాథమిక విద్యలను తీసుకువచ్చారు. 1948 జనవరి 16న అఖిల భారత విద్యా సదస్సులో ప్రసంగిస్తూ మౌలానా ఆజాద్ ఇలా అన్నారు: “కనీసం ప్రాథమిక విద్యను పొందడం ప్రతి వ్యక్తి జన్మహక్కు.”

మౌలానా ఆజాద్ భారతదేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలతో పాటు మొదటి ఐఐటిని స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. MHRD కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)ని ఏర్పాటు చేయడంలో కూడా ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.