December 19, 2024

భారతదేశంలో ముస్లిముల సమస్యలు నానాటికి పెరుగుతున్నాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. సచర్ కమిటీ నివేదిక తర్వాత యుపియే ప్రభుత్వం ఈ ఫెలోషిప్ ను ప్రారంభించింది. ముస్లిము, క్రయిస్తవ, సిక్కు, బౌద్ధ, పార్శీ సముదాయాలకు చెందిన మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ఫెలోషిప్ ఇది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న మైనారిటీ విద్యార్థులకు ఈ ఫెలోషిప్ ఇవ్వడం ప్రారంభించారు.

మైనారిటీ సముదాయాల్లో అత్యథిక సంఖ్యాకులు ముస్లిములే కాబట్టి ఈ ఫెలోషిప్ పొందిన విద్యార్థుల్లోను అధికంగా ముస్లిములే కనిపిస్తారు. అందువల్ల ఇప్పుడు ఈ ఫెలోషిప్ ను రద్దు చేయడం వల్ల అత్యధికంగా నష్టపోయేది కూడా ముస్లిములే. బీజేపీ ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక ధోరణి రహస్యమేమీ కాదు, పైగా ఈ ఫెలో షిప్ ఒక ముస్లిం స్వతంత్ర సమరయోధుడి పేరుతో ఉంది. కాబట్టి ఈ ఫెలోషిప్ ను రద్దు చేయడం అంటే ముస్లిములను దెబ్బతీయడానికి తీసుకున్న నిర్ణయంగానే కనిపిస్తోంది. కాని ఈ నిర్ణయం వల్ల ఇతర మైనారిటీ సముదాయాలు కూడా నష్టపోతున్నాయి. ఇతర స్కాలర్ షిప్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మౌలానా ఆజాద్ ఫెలోషిప్ అవసరం లేదని మైనారిటీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. ఇది ఒక విచిత్రమైన వాదన. ఏదైనా ఒక స్కాలర్ షిప్ తీసుకున్న విద్యార్థి మరో స్కాలర్ షిప్ పొందడానికి అనర్హుడవుతాడు. జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, నేషనల్ ఫెలో షిప్ వంటివి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు షెడ్యుల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగలు, వికలాంగులు, వెనుకబడిన వర్గాలకు ఫెలోషిప్పులున్నాయి. మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా ముస్లిం విద్యార్థులకు ప్రత్యేకంగా మౌలానా ఆజాద్ ఫెలోషిప్ అవసరం లేదన్న వాదన మరికాస్త పొడిగించి, యస్సీ యస్టీ వికాలంగులు తదితర వర్గాలకు కూడా ప్రత్యేక స్కాలర్ షిప్పులు అవసరం లేదన్న వాదన బహుశా త్వరలోనే రావచ్చు.

పౌరసత్వ చట్టం వంటి చట్టాలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం మౌలానా ఆజాద్ ఫెలోషిప్ రద్దు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం పరిధిలో ముస్లిములు లేరని ప్రభుత్వం ఇలాంటి అనేక నిర్ణయాలతో చెబుతూనే వస్తోంది. ముస్లిముల సంక్షేమం పట్ల ఆలోచించడం అనేది లేనే లేదు. వేధించడం గురించిన ఆలోచనలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. హిజాబ్ వివాదం సృష్టించి ముస్లిం బాలికలను విద్యాభ్యాసానికి దూరం చేసే ప్రయత్నం ఎలా చేశారో అలాగే ముస్లిములు చదువుకోకుండా నిరోధించే ఇలాంటి ఎత్తుగడలు మరిన్ని ముందుకు రావచ్చు.

ప్రిమెట్రిక్ స్కలార్ షిప్పులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి మైనారిటీ విద్యార్థులకు ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఆ స్కాలర్ షిప్పులు కూడా ఆపేశారు. నిజానికి స్వయంగా బీజేపీఎం.పీ.ప్రీతమ్ ముండే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే స్కాలర్ షిప్పులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పిల్లలను బాలశ్రామికులుగా మార్చరాదనుకుంటే, పిల్లలు చదువుకుని దేశాభివృద్దికి తోడ్పడేలా చేయాలనుకుంటే ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడరాదు. కాని ప్రస్తుత ప్రభుత్వం ముస్లిములను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ముస్లిములను వేధించే నిర్ణయాలు తీసుకుంటే ఓట్ల వాన కురుస్తుందన్న అభిప్రాయంతో ఉంది. అందువల్లనే మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధులను కూడా తగ్గించేశారు. 2019-20 సంవత్సరంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల సంఖ్య కన్నా తర్వాతి సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య చాలా తగ్గిపోయింది.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలోని నిజాలేమిటో ఈ నిర్ణయాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాల వైఖరి వల్ల ముస్లిములు విద్యాపరంగా చాలా వెనుకబడ్డారు. గతప్రభుత్వాలు తీసుకున్న కొద్దిపాటి సంక్షేమ చర్యలను కూడా ఈ ప్రభుత్వం అటకెక్కించడం ద్వార ముస్లిం వ్యతిరేకతను బాహాటంగా ప్రదర్శిస్తోంది. అయినా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని నమ్మమంటోంది.