December 19, 2024

సంవత్సరం క్రితం హరిద్వార్ లో జరిగిన ధర్మసంసద్ లో విద్వేష వ్యాఖ్యలు, ముస్లిముల ఊచకోతలను ప్రేరేపించేలాంటి ప్రసంగాలు జరిగాయి. అంతకు ముందు కూడా అలాంటి సమావేశాలు, సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత కూడా జరిగాయి. ఈ విద్వేష ప్రసంగాల పట్ల పోలీసులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.

ఈ జుగుప్సాకరమైన మతోన్మాదాన్ని చాలా మంది హిందువులు కూడా ఏవగించుకుంటున్నారనే విశ్లేషణలు తరచు వస్తున్నాయి. కాని విద్వేషం సునామీలా విరుచుకుపడుతుంటే చాలా మంది మౌనంగా ఎందుకు చూస్తున్నారన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక రెస్టరెంటులో చివరి ముగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ చిత్రపటాన్ని చూసి మతోన్మాద శక్తులు అక్కడ వీరంగాలు వేశాయి. ఔరంగజేబు వారసుడన్నాయి. నిజానికి బహదూర్ షా జఫర్ బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వతంత్రసంగ్రామానికి నాయకుడు. ఇప్పుడు మరో విచిత్రమైన వార్త వచ్చింది. షారుక్ ఖాన్ సినిమా పఠాన్ లో ఒక పాటలో దీపికా పదుకునే కాషాయం రంగు బికినీ ధరించడంపై గగ్గోలు చెలరేగింది. ఆ పాటలో దీపికా పదుకునే అరడజను దుస్తులు మార్చినట్లు కొందరు రాశారు. కాని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కాషాయం బికీనీపై మండిపడుతూ వ్యాఖ్యలు చేశారు. అయోథ్యలో ఒక మతగురువు షారుక్ ఖాన్ దిష్టిబొమ్మను తగలబెట్టి ఇలాగే షారుఖ్ ఖాన్ ని కూడా తగలబెడతాం అన్నారు.

దీపికా పదుకునే ఇంతకు ముందు గహరాయియాం సినిమాలో ఇలాంటి లోదుస్తులే ధరించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, 1998లో మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ పాల్గొన్నప్పుడు ఆమె కాషాయం రంగు మిని డ్రస్ ధరించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. మరాఠీ నటి స్మితా గోండ్కర్ ఈ వివాదం తర్వాత మాట్లాడుతూ కాషాయం రంగు బికినీ నా వార్డ్ రోబ్ లో ఏదైనా ఉందా అని వెదకవలసి వచ్చింది. ఇప్పుడు కాషాయం రంగు బ్రా ధరించాలన్నా భయమేస్తోంది అని వ్యాఖ్యానించింది.

ఆ పాటలో అశ్లీలం ఉందా లేదా అన్నది ఇక్కడ చర్చ కాదు. నేడు చాలా సినిమా పాటలు కుటుంబసమేతంగా చూడదగినఃవిగా లేవన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం. కాని పఠాన్ సినిమాపై మాత్రమే ఈ అభ్యంతరాలు ఎందుకన్నది ఆలోచించవలసిన విషయం. మరో విషయమేమిటంటే, భారతసినిమాల్లో చాల పాటలు, దృశ్యాల్లో చాలా చోట్ల కాషాయం రంగు దుస్తులు ధరించిన సన్నివేశాలు లేవా? అలాంటి సన్నివేశాలను చాలా మంది మతపరంగా కట్టుబాట్లను పాటించే హిందువులు కూడా చూడడం లేదా? గతంలో సినిమాలో కాషాయం రంగు దుస్తులు ధరించడంపై ఎవరైనా అభ్యంతరాలు చెప్పిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా? హఠాత్తుగా షారుక్ ఖాన్ పఠాన్ సినిమాపై ఈ అభ్యంతరాలెందుకు వచ్చాయి?

ముస్లిములపై దాడులు దౌర్జన్యాలు, విద్వేషభరిత వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. సగటు ముస్లిములపైనే కాదు ముస్లిము సెలబ్రిటీలను కూడా లక్ష్యంగా చేసుకోగలమనే సందేశాన్నివ్వడమే ఈ సంఘటనల వెనుక కనిపిస్తున్న మనస్తత్వం. గతంలో మాజీ ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీ, సల్మాన్ ఖుర్షిద్, జర్నలిస్టు ముహమ్మద్ జుబైర్, ఇర్ఫాన్ పఠాన్, ఆమిర్ ఖాన్ లపై కూడా ఇలాగే ప్రవర్తించారు. విద్వేషం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పే ఉదాహరణలు ఇవి. నిజానికి ఈ మతతత్వ శక్తులు కోరుకునే ఆదర్శభారత ముస్లిము లక్షణాలు చాలా వరకు షారుక్ ఖాన్ లో ఉన్నాయి. అయినప్పటికీ ముస్లిం పేరు ఉంటే చాలు ఎవరిపై అయినా దాడి జరుగుతుందన్నది ఈ సంఘటనతో స్పష్టమవుతోంది.

సగటు హిందువుల్లో ఇలాంటి విద్వేష మనస్తత్వం లేనేలేదన్నది వాస్తవం. కాని ఈ ఇస్లామోఫోబియాను ఒక పెద్ద సమస్యగా కూడా చాలా మంది చూడడం లేదన్నది కూడా ఒక వాస్తవమే. 1200 సంవత్సరాలుగా హిందువులపై అణిచివేత జరిగిందని, అందువల్లనే కొందరు ఇలాంటి అతిపోకడలు పోతున్నారని లేకపోతే సహజంగా హిందువులు అహింసావాదులని సమర్థించుకునేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విద్వేష వాతావరణం కేవలం ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే అని,  సగటు హిందువుల్లో ఇస్లామోఫోబియా లేదు కాబట్టి అంత ఆందోళన పడవలసిన అవసరం లేదని మరికొందరు తమను తాము నచ్చచెప్పుకుంటున్నారు. అందరూ ఏదో ఒక విధంగా ఈ విద్వేషంతో కలిసి జీవించడానికి అలవాటు పడుతున్నారే తప్ప ఈ విద్వేషాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం లేదు.

విద్వేషం ఎంతగా విస్తరించిందో, ఎంత లోతుగా పాతుకుపోతుందో సగటు ప్రజలు గుర్తించే రోజు వస్తుందా? ఈ విద్వేషం దేశప్రయోజనాలకు విఘాతమని గ్రహించే రోజు వస్తుందా?